సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీ వాదనకు కేంద్ర జీఎస్టీ విభాగం లేఖ ద్వారా తెర దించింది. టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం చేసింది. జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది.
సాంకేతిక సాకు ఎత్తుగడ
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ టీడీపీ వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. సీమెన్స్‌కు తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో సాగించిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ గానీ ఆయన న్యాయవాదులు గానీ చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చిన 17 ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు రాజ్యాంగ రక్షణ లభిస్తుందని మాత్రమే అడ్డగోలుగా వాదిస్తున్నారు.
2017లోనే కేసు నమోదు..
చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. 2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది.
నకిలీ ఇన్వాయిస్‌లతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ కంపెనీలను గుర్తించి విస్తృతంగా సోదాలు జరిపింది. వీటిలో స్కిల్లర్ అనే కంపెనీ కూడా ఉంది. దీనిపై నాడే తీగ లాగడంతో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి డొంకంతా కదిలింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (ఏపీఎస్‌ఎస్‌డీసీ) పరికరాలను సరఫరా చేసినట్లు చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించినట్లు తేలింది. ఆ ఇన్వాయిస్‌లను చూపించే ఏపీఎస్‌ఎస్‌డీసీ నుంచి నిధులు పొందినట్లు నిర్ధారణ అయింది. దీనిపై జీఎస్టీ విభాగం 2017 మే నెలలోనే కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలతో సహా కుంభకోణాన్ని బట్టబయలు చేసింది.
పాత కేసులకు పాత చట్టమే
ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు దారి మళ్లడంపై విచారించాలని సూచిస్తూ ఏపీ ఏసీబీ విభాగానికి 2018 ఫిబ్రవరిలోనే సమాచారం ఇచ్చింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ లేఖ రాశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ఒత్తిడితో ఏసీబీ విభాగం ఆ కేసును తొక్కిపెట్టింది. అంటే స్కిల్ స్కామ్ బయటపడిందీ... కేసు నమోదైంది 2017లోనే అని స్పష్టమవుతోంది. అప్పటికి 17ఏ సెక్షన్ అమలులోకి రాలేదు.
ఆ సెక్షన్ 2018 జూలైలో చేయగా 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు చంద్రబాబుకు 17ఏ సెక్షన్ కింద రక్షణ లభించదన్నది నిర్ధారణ అయినట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. అవినీతికి పాల్పడి ఆధారాలతోసహా అడ్డంగా దొరికిన చంద్రబాబు సాంకేతిక సాకులతో తప్పించుకునేందుకు చేస్తున్న యత్నాలు ఫలించవని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డీజీ లేఖతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టినట్టేనని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment