1 దేశం..పన్ను!
♦ జూలై 1 నుంచే జీఎస్టీ అమలు
♦ అంతా సిద్ధం చేశామంటున్న ప్రభుత్వం
♦ 17 పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను
♦ 0– 3– 5– 12– 18– 28 శాతాలతో ఆరు శ్లాబులు
♦ పన్నులేనివి ‘జీరోలోకి.. బంగారానికి మాత్రమే 3 శాతం
♦ మిగతావన్నీ ఇతర శ్లాబుల పరిధిలోకి లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ బయటే
♦ లగ్జరీ వాహనాలు, పలు ఉత్పత్తులపై గరిష్టంగా 15% సెస్సు పన్ను చెల్లింపులు, రిటర్నులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే..
♦ పలు ఇబ్బందులున్నాయంటున్న వ్యాపార వర్గాలు
పట్టుమని పది, పన్నెండు రోజులు.. వచ్చేనెల ఒకటో తారీఖు రాగానే దేశ పన్నుల ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా అభివర్ణిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లు మినహా.. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నులన్నీ దీంతో అంతర్థానమైపోతాయి. వాటన్నిటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఏ వస్తువుపై అయినా రకరకాల పన్నులుండవు. జీఎస్టీ మాత్రమే ఉంటుంది. 0 నుంచి 28 శాతం మధ్య ఐదు శ్లాబుల్లో ఉండే ఈ పన్నుకు.. సెస్సులు కలిపితే గరిష్టంగా 43 శాతం వరకూ అవుతుంది. అంటే ఏ వస్తువుపై అయినా 0–43 శాతం మధ్య జీఎస్టీ అమలవుతుంది.
అసలు జీఎస్టీని ఎందుకు తెస్తున్నారు? అమలయ్యేదెలా? ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం సులువేనా? వ్యాపారులంతా దానిలో చేరేదెలా? జీఎస్టీ వస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా.. లేక పెరుగుతాయా? ఏయే వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏయే సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? పన్ను రాయితీలతో కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వడం సాధ్యమేనా.. అనే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానమే ఈ వారం సాక్షి ‘ఫోకస్’..
ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారుల వరకూ అన్ని దశల్లోనూ పన్నులున్నాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఈ పన్నులు మారుతుంటాయి. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక.. కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ పరిస్థితిని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకే జీఎస్టీని 122వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తెస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న 17 రకాల పన్నులను తొలగించి వాటి స్థానంలో జీఎస్టీని అమలు చేస్తారు.
జీఎస్టీ అవసరమేంటి?
ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదారులు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారుచేసి విక్రయించేటప్పుడు మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతున్నాయి. ఇవన్నీ కలసి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28 నుంచి 30 శాతం వరకూ అవుతున్నాయి. జీఎస్టీని తెస్తే ఈ రేట్లు తగ్గటంతో పాటు ధరల్లో తేడాలు కూడా తగ్గుతాయనేది ప్రభుత్వం ఆలోచన.
చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే..
ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా జీఎస్టీ నెట్‌వర్క్ (జీఎస్టీఎన్) ఏర్పాటైంది. దానిలో కేంద్రానికి 24.5 శాతం, ఢిల్లీ సహా రాష్ట్రాలకు 24.5 శాతం కలిపి 49 శాతం వాటా ఉంది. మిగతా 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. జీఎస్టీఎన్‌లో పన్ను, రిటర్నుల వంటివన్నీ ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలి. ఏదీ భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా వెంటనే తెలిసిపోతుంది.
జీఎస్టీలోనూ 3 రకాలు
1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ)
కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ సీజీఎస్టీలో విలీనమవుతాయి.
2. స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ)
రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, లాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నులు ఎస్‌జీఎస్టీలో కలుస్తాయి.
3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ)
ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి.
పెరిగేవేమిటి.. తగ్గేవేమిటి?
జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల విధానం సరళమవుతుందని, ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే తమపై పన్ను రేట్లు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి తాము మనగలగటం కష్టమని థీమ్ పార్కులు వంటి పలు రంగాల కం పెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎక్కువ వస్తువులపై పన్ను రేట్లు తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఏ వస్తువు ధరైనా తగ్గుతుందా.. పెరుగుతుందా? అనేది వాటిపై విధించే జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జీఎస్టీలో ఐదు శ్లాబుల్ని చేర్చారు. అందులో మొదటిది జీరో కాగా... మిగతా ఐదు శ్లాబులు 3, 5, 12, 18, 28 శాతాలుగా ఉన్నాయి. ఈ లెక్కన వివిధ సేవలు, వస్తువులపై జీఎస్టీ ప్రభావాన్ని పరిశీలిద్దాం..
స్టార్ హోటల్లో తింటే బాదుడే!
రెస్టారెంట్లలో ఆహారంపై ప్రస్తుతమున్న మాదిరే పన్నులుం టాయి. ఇంకా చెప్పాలంటే 0.5 శాతం తగ్గుతుంది కూడా. రూ.50 లక్షల టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లలో బిల్లుపై 5 శాతం, నాన్ ఏసీ రెస్టారెంట్లలో 12 శాతం, ఏసీ–మద్యం అనుమతి ఉన్న రెస్టారెంట్లలో 18 శాతం పన్నుల్ని ఖరారు చేశారు.
రూ.1,000 లోపు అద్దె ఉండే హోటళ్లు, లాడ్జిలను జీఎస్టీ నుంచి మినహాయించారు. రూ.1,000 నుంచి రూ.2,000 లోపు అద్దె ఉండే వాటిపై 12 శాతం, రూ.2,500–5,000 మధ్య అద్దె ఉండే వాటిపై 18 శాతం, రూ.5 వేలపైన అద్దె ఉండే వాటికి 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంటే 28 శాతం పరిధిలోకి వస్తాయి కనక స్టార్‌హోటల్లో ఫుడ్ బిల్లుకు కూడా అదే స్థాయి పన్ను బాదుడు ఉంటుంది.
సినిమా టికెట్ల ధరలను పరిశీలిస్తే.. ప్రస్తుతం చలన చిత్రాలపై వినోద పన్ను 28 నుంచి 110 శాతం వరకూ ఉంది. జీఎస్టీలో రూ.100 లోపు సినిమా టికెట్లకు 18 శాతం, ఆపైన ధరలుండే టికెట్లకు 28 శాతం పన్నును ఖరారు చేశారు.
ఫోను కొన్నా.. మాట్లాడినా చుక్కలే..
ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారై మన దేశానికి దిగుమతి అవుతున్న ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కలిపి 14–13 శాతంగా ఉన్నాయి. అదే విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని మన దేశంలో అసెంబ్లింగ్ చేస్తున్న ఫోన్లపై సీవీడీ, ఎక్సైజ్ కలిపి 2 శాతంతోపాటు స్థానిక వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే జీఎస్టీలో దిగుమతి చేసుకున్నా సరే, స్థానికంగా తయారైనా సరే 18 శాతం పన్ను వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతం రూ.10 వేల ఫోన్‌కుగాను పన్నులు కలిపి రూ.11,280 చెల్లిస్తుంటే.. జీఎస్టీ అమలు తర్వాత అదే ఫోన్ ధర రూ.11,800 అవుతుందన్నమాట.
ప్రస్తుతం టెలికం రంగానికి 15 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను జీఎస్టీలో 18 శాతం పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం రూ.1,000 ఫోన్ బిల్లుపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్‌తో రూ.1,150 చెల్లిస్తుంటే.. జీఎస్టీ వచ్చాక రూ.1,180 చెల్లించాల్సి వస్తుంది.
రెడిమేడ్ దుస్తులు తగ్గుతాయ్..
జీఎస్టీలో బ్రాండెడ్ దుస్తులకు 5 శాతం పన్ను ఖరా రు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఫ్యాషన్ దుస్తులపై ఎక్సైజ్, వ్యాట్ కలిపి 7.5 శాతం వరకూ పన్ను ఉంది. అంటే రూ.1,000 టీ–షర్ట్‌కు ప్రస్తుతం పన్నులు కలిపి రూ.1,075 చెల్లిస్తుం టే.. జీఎస్టీ అమలయ్యాక అదే టీ–షర్ట్ రూ.1,050కే లభిస్తుంది. రూ.1,000 లోపు ధరలుండే చీరలు, వస్త్రాలపై 5 శాతం, అంతకంటే ఖరీదైన వాటిపై 12 శాతం పన్నును విధిస్తున్నారు.
టీవీలు తగ్గుతాయ్.. ఏసీలు పెరుగుతాయ్..
ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాలకు 24.2 నుంచి 27 శాతం పన్నులున్నాయి. జీఎస్టీలో వీటన్నింటినీ 28 శాతం పన్ను విభాగంలో చేర్చారు. అంటే 1 శాతం ధరలు పెరుగుతాయన్నమాట.
టీవీలను మాత్రం 18 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం రూ.20 వేలు ఉండే ఆయా ఉత్పత్తులకు పన్నులు కలిపి రూ.24,900 చెల్లిస్తుంటే.. జీఎస్టీలో 18 శాతం పన్నుతో అదే ఉత్పత్తుల ధరలు రూ.23,600లకే లభ్యమవుతాయన్నమాట.
బియ్యం, పప్పులు, నిత్యావసరాలు చవక!
ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ (నిత్యావసరాలు విక్రయించే) కంపెనీలకు ఎక్సైజ్, వ్యాట్, ప్రవేశపన్నులు కలిపి 24–25 శాతంగా ఉన్నాయి. జీఎస్టీలో ఎఫ్‌ఎంసీజీలోని చాలా వరకు ఉత్పత్తులను 18 శాతం పరిధిలోకి తెచ్చారు. పైగా జీఎస్టీలో లాభదాయక నిరోధక నిబంధన ఉంది. అంటే ఏవైనా పన్ను ప్రయోజనాలొస్తే వాటిని ఆయా కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలి. దీంతో జీఎస్టీ అమలయ్యాక నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
బియ్యం, పాలు, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు, పప్పు దినుసులపై ప్రస్తుతం 5 శాతం వరకు పన్నులున్నాయి. వీటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. అయితే ఇవన్నీ ప్యాకేజింగ్ లేకుండా విడిగా అమ్మితేనే మినహాయింపు వర్తిస్తుంది. అదే ఈ ఉత్పత్తులను బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి అమ్మితే 5 శాతం పన్ను పడుతుంది.
పంచదార, టీ, కాఫీ, వంటనూనెలపై ప్రస్తుతం 5 శాతం పన్నులు ఉన్నాయి. జీఎస్టీలోనూ ఇదే రేటుంటుంది. కాబట్టి ధరల్లో తేడా ఉండే అవకాశం తక్కువ.
కేశ సంరక్షణ నూనెలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి వాటిపై ప్రస్తుతం 23–26 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 18 శాతం పన్నును విధించారు. వీటి ధరలు తగ్గే అవకాశముంది.
శీతల, బలవర్ధక పానీయాలు, చాక్‌లెట్లు, చూయింగ్ గమ్స్, షాంపూల వంటి వాటిపై ప్రస్తుతం 23–25 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 28 శాతం పన్నును విధించినందున ధరలు పెరుగుతాయి.
ప్రస్తుతం రూ.500 లోపు ధరలుండే చెప్పులపై 9.5 శాతం వరకు పన్నులున్నాయి. దీన్ని జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అయితే రూ.500 కన్నా ఎక్కువ ధర ఉండే చెప్పులపై 18 శాతం జీఎస్టీ విధించారు. గతంలో వీటిపై పన్నులు 23.1 నుంచి 29.58 శాతం వరకు ఉన్నాయి. అంటే వీటి ధరలూ తగ్గే అవకాశం ఉంది.
పొగ పీలిస్తే జేబుకు చిల్లే..
సిగరెట్ కాల్చితేనే కాదు జీఎస్టీ తర్వాత వాటిని కొనాలన్నా జేబుకు హానికరమే. ఎందుకంటే జీఎస్టీలో సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను 28 శాతం పన్నుల శ్లాబులోకి తెచ్చారు. తునికాకుపై మాత్రం 18 శాతం పన్ను విధించారు. సిగరెట్ల మాదిరే బీడీలపై కూడా సెస్సును విధించలేదు.
ప్రయాణ టికెట్ల ధరలు తగ్గుతాయి
ప్రస్తుతం రైలు టికెట్లపై మినహా బస్సు, మెట్రో, సబర్బన్ వంటి ప్రజా రవాణా టికెట్లపై ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ లేదు. రైల్వే టికెట్లలోనూ దూర ప్రయాణ ఏసీ కోచ్ టికెట్లపైనే సర్వీస్ ట్యాక్స్ ఉంది. జీఎస్టీలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంబించారు.
ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్‌లపై 6 శాతంగా ఉన్న పన్నును జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అంటే ప్రైవేట్ క్యాబ్ సర్వీసు ధరలూ తగ్గుతాయి.
విమానాల్లో ప్రస్తుతం ఎకానమీ క్లాసు టికెట్లపై 5.6–6 శాతంగా ఉన్న పన్నులను జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లపై పన్ను 9 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అంటే ఎకానమీ టికెట్లు కాస్త తగ్గి బిజినెస్ క్లాస్ ధరలు పెరిగే అవకాశముంది.
లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి
ప్రస్తుతం వాహన రంగానికి పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా కలిపి 32 నుంచి 55 శాతం వరకు పన్నులున్నాయి. అయితే జీఎస్టీలో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ట్రాక్టర్లు మినహా అన్ని రకాల వాహనాలకూ 28 శాతం పన్ను విధించారు.
ప్రస్తుతం ఆల్టో, క్విడ్, సెలెరియో, బ్యాలెనో, పోలో, ఐ20 వంటి చిన్న కార్లపై 25–27.5 శాతం వరకు పన్నులున్నాయి. జీఎస్టీలో సెస్సుతో కలిపి 29 శాతానికి చేరింది. అంటే 1.5 నుంచి 2 శాతం పెరిగింది. అంటే చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరగొచ్చు.
హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్ వంటి సెడాన్, ఎస్‌యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతమున్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు కలిపి 43 శాతంగా ఉంటే.. జీఎస్టీలోనూ 28 శాతం పన్ను, అదనంగా 15 శాతం సెస్సును విధించారు. మొత్తంగా 43 శాతం పన్ను రేటే ఉండనుంది.
ప్రస్తుతం లగ్జరీ కార్లకు అంటే మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, వోల్వో వంటిì వాటికి ఎక్సైజ్, వ్యాట్, ఇన్‌ఫ్రా సెస్ కలిపి 55 శాతం వరకు పన్నులు ఉన్నాయి. జీఎస్టీలో వీటికి 28 శాతం+ అదనంగా 15 శాతం సెస్సు జోడించారు. అంటే 43 శాతం పన్ను ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతంతో పోలిస్తే 12 శాతం తక్కువ. దీంతో లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి కూడా.
ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్ (5–5.5 శాతం), సీఎస్టీ (2 శాతం), విడిభాగాలు, పరికరాలపై సెంట్రల్ వ్యాట్ (12.5 శాతం)గా ఉంది. అయితే జీఎస్టీలో ట్రాక్టర్ల ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్లు, ఇరుసులు, టైర్లు, ట్యూబుల వంటి ప్రధాన విడిభాగాలకు 28 శాతం పన్ను... మిగతా విడిభాగాలకు 18 శాతం పన్ను నిర్ణయించారు. అంటే ఒక్కో ట్రాక్టర్‌పై రూ.25 వేల వరకు ధర పెరుగుతుందని అంచనా.
బంగారం ధరలు స్వల్పంగా పెరగొచ్చు!
దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బంగారానికి జీఎస్టీలో ప్రత్యేక పన్ను శ్లాబు కేటాయించారు. బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం బంగారంపై 1 శాతం వ్యాట్, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలిపి 2 శాతం పన్ను ఉంది. అంటే జీఎస్టీ ఒకశాతం ఎక్కువే ఉన్నందున స్వల్పంగా ధరలు పెరగొచ్చు. మన దేశం బంగారం కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నందున... 10 శాతం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పూ చేయలేదు. అంటే విదేశీ మార్కెట్లతో పోలిస్తే మన దేశంలో ఆభరణాల బంగారం (916 క్యారెట్స్) గ్రాముకు రూ.280–300 వరకు ఎక్కువే ఉంటుందన్నమాట. అయితే ఆభరణాల తయారీకి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించారు. దీంతో స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కలుగుతుంది.
తొలిదేశం ఫ్రాన్స్
ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్. 1954లో దానిని అమలు చేసింది. ఇప్పటివరకు 140 దేశాల్లో జీఎస్టీ పన్ను విధానమే అమల్లో ఉంది. బ్రెజిల్, కెనడా వంటి దేశాల్లో ద్వంద్వ జీఎస్టీ విధానం ఉంది. ప్రస్తుతం మన దేశం కెనడా జీఎస్టీ అంటే ద్వంద్వ జీఎస్టీ పన్ను విధానాన్నే అమలులోకి తీసుకొస్తున్నాం.
జీఎస్టీలో విలీనమయ్యే పరోక్ష పన్నులివీ..
పన్ను రకం ప్రస్తుత రేటు (శాతాల్లో)
అమ్మకం పన్ను/వ్యాట్ 14.5
కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) 2–4
సేవా పన్ను 14.5
కస్టమ్స్ డ్యూటీ 11.90
ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ 5.5–10
ఎక్సైజ్ డ్యూటీ 12.36
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15
వినోద పన్ను 15–20
స్వచ్ఛ భారత్ సెస్ 0.5
కృషి కల్యాణ్ సెస్ 0.5
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ 2.5–4
జీఎస్టీలో కలవని పన్నులివే
బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ)
ఎక్స్‌పోర్ట్ డ్యూటీ
రోడ్డు మరియు పాసింజర్ ట్యాక్స్
టోల్ ట్యాక్స్
ప్రాపర్టీ ట్యాక్స్
స్టాంప్/రిజిస్ట్రేషన్ ట్యాక్స్
ఎలక్ట్రిసిటీ డ్యూటీ
లిక్కర్‌పై ఎక్సైజ్ పన్ను
స్థానిక సంస్థల ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్
(ఆల్కాహాల్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటూ విద్యుత్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు)