హాస్టల్ విద్యార్ధులకు, వర్కింగ్ హాస్టల్స్‌లో ఉండే ఉద్యోగులకు హాస్టల్ ఫీజులు మరింత భారం కానున్నాయి. జీఎస్టీ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) బెంగళూరు, లఖ్‌నవూ బెంచ్‌లు హాస్టల్ ఫీజుకు 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని రెండు వేర్వేరు కేసుల్లో తీర్పును వెలువరించాయి. దీంతో హాస్టల్స్ ఉండేవారు సైతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.
బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీయిస్ స్టే ఎల్‌ఎల్‌పీ సంస్థ, నొయిడాకు చెందిన వీఎస్ ఇన్‌స్టిట్యూట్ అండ్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్‌లు చేసిన ధరఖాస్తులపై జీఎస్టీ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) బెంచ్ విచారణ చేపట్టాయి. ఈ విచారణలో భాగంగా హాస్టళ్లు అనేవి నివాస గృహాలు కావని, వాటికీ జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేశాయి.
హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్ల వసతికి గాను రోజుకు రూ.1000లోగా అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని గుర్తు చేసింది. 2022 జులై 17 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. పీజీ/ హాస్టళ్లకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. ఒకవేళ సొంత నివాసంలోనే హాస్టల్/ పీజీ సదుపాయం ఇస్తుంటే వాటిని గెస్ట్ హౌస్‌లు, లాడ్జింగ్ సర్వీసులుగానే పరిగణిస్తామని బెంచ్ పేర్కొంది.
అయితే, ఈ సందర్భంగా జీఎస్టీ విధింపుతో విద్యార్ధుల కుటుంబాలకు మరింత భారం కానుందని, జీఎస్టీ కౌన్సిల్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఏఏఆర్ బెంచ్‌లు ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాలు అమలుపరిస్తే హాస్టల్ వసతి భారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment