న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది.
కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి.
కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment