integrated GST
-
ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
జీఎస్టీ వసూళ్లు రయ్ రయ్
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో జోష్ మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉందని శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.41,215 కోట్లతో కలిపి), సెస్ రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.856 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్ వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్ నెల వసూళ్లతో పోలిస్తే ఏకంగా 26 శాతం ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 22 శాతం ఎక్కువయ్యాయి. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఎనిమిదవ సారి. రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటం ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే వరుసగా ఏడోసారి. ఈ ఏడాదిలో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ జూలై 20న నమోదైంది. ఆ రోజు 9.58 లక్షల చలాన్ల ద్వారా రూ.57,846 కోట్లు వచ్చాయి. రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్లు సెప్టెంబర్ 20న నమోదయ్యాయి. ఏపీలో 21 శాతం.. తెలంగాణలో 12 శాతం జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 21 శాతం మేర పెరిగి రూ.3,132 కోట్లకు చేరిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రూ.3,494 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 12శాతం మేర పెరిగి రూ.3,915 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. -
జీఎస్టీ వసూళ్లు @ రూ.1,17,010 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెపె్టంబర్లో ఐదు నెలల గరిష్టస్థాయిలో రూ.1,17,010 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే వసూళ్లు రూ.లక్ష కోట్ల పైబడ్డం ఇది వరుసగా మూడవనెల. 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (2021అక్టోబర్–మార్చి2022) కేంద్రానికి ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని తాజా గణాంకాలు కల్పిస్తున్నాయి. తాజా వసూళ్లు 2020 సెపె్టంబర్ వసూళ్లతో (రూ.95,480 కోట్లు) పోలి్చతే 23 శాతం అధికం. 2019 సెప్టెంబర్ వసూళ్లతో (రూ.91,916 కోట్లు) పోలి్చతే 27 శాతం అధికం. ఏప్రిల్‌లో వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అటు తర్వాత ఈ స్థాయిలో (రూ.1.17 లక్షల కోట్లు) వసూళ్లు ఇదే తొలిసారి. సెపె్టంబర్ మొత్తం వసూళ్లు రూ.రూ.1,17,010 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.20,578 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ.26,767 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.60,911 కోట్లు. సెస్ రూ.8,754 కోట్లు. -
జీఎస్టీ కనీస పరిమితి రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కనీస పరిమితిని (థ్రెషోల్డ్ లిమిట్) రూ.25 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గించాలని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పట్టుబట్టారు. ఐదేళ్ల జీఎస్టీ పరిహార వ్యవస్థను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కొత్త పన్నుల వ్యవస్థ నిర్మాణంపై తాము గత సమావేశంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించనేలేదని కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు. పెట్రోలియం, పొగాకు, ఆల్కహాల్ వంటి ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని మంత్రులు ప్రతిపాదించారు. మినహాయింపుల జాబితాను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు అమల్లో ఉండే పరిహార వ్యవస్థ ఉండాలనీ, దాన్ని కూడా బిల్లులో చేర్చాలనీ కోరారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారాల నుంచి పన్నుల వసూలుకు పాలనాధికారాలే కాకుండా చట్టపరమైన అధికారాలు కూడా ఉండాలని డిమాండ్ చేశారు. రూ.కోటిన్నర లోపు వ్యాపారాలపై పన్ను మదింపు, ఆడిట్, ఇతర అంశాల్లో జోక్యం వద్దని కేంద్రానికి సిఫార్సు చేశారు. ద్వంద్వ నియంత్రణ విధానం ప్రకారం రూ.1.50 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారుల నుంచి పన్నులను కేంద్రం వసూలు చేస్తుంది. తర్వాత, ఆయా రాష్ట్రాలకు వాటి వాటాలను చెల్లిస్తుంది. కోటిన్నర లోపు టర్నోవర్ ఉండే కంపెనీల నుంచి ట్యాక్సులను రాష్ట్రాలు వసూలు చేసి, కేంద్రానికి దాని వాటాను చెల్లిస్తాయి. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ.10 లక్షల్లోపు వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారాలపై జీఎస్టీ విధించరు. ఈ పరిమితి సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరీ, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.5 లక్షలుగా ఉండాలని నిర్ణయించినట్లు రాథర్ వివరించారు. అనేక రాష్ట్రాల్లో వ్యాట్ కనీస పరిమితి రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం.