horse racing
-
రేసింగ్ విత్ త‘లుక్’ (ఫొటోలు)
-
ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!
పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ అవ్వలేదని సమాచారం. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టే బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. ఆన్లైన్ గేమ్‌లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్‌ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
కల చెదిరింది.. ప్రాణం తీసిన గుర్రపు పందెం
న్యూజిలాండ్‌కు చెందిన 26 ఏళ్ల మేఘన్ టేలర్ గుర్రపు పందెంలో ప్రాణాలు కోల్పోయింది. యంగ్ జాకీ రైడర్‌గా పేరు పొందిన మేఘన్ టేలర్ కాంటర్బరిలోని యాష్బర్టన్ రేస్‌వే వద్ద గురువారం జరిగిన హార్స్ రేసులో పాల్గొంది. రేసు మధ్యలో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. రేస్ జరుగుతున్న సమయంలో మరొక జాకీ రైడర్‌తో జరిగిన క్లాష్‌లో మేఘన్ టేలర్ కిందపడిపోయింది. అయితే వేగంగా పరిగెత్తుతున్న గుర్రంపై నుంచి కిందపడడంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించేలోపే మేఘన్ టేలర్ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మేఘన్ టేలర్ రెడ్ ఆర్కిడ్ హార్స్‌తో రెండో స్థానంలో ఉంది. అయితే ఆమె వెనకాలే మరో ముగ్గరు జాకీ రైడర్స్ ఒకే పార్శ్వంలో రావడమే ప్రమాదానికి కారణమైంది. మేఘన్‌తో పాటు మిగతా ముగ్గురు కూడా కింద పడినప్పటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక మేఘన్ టేలర్ జాకీ రైడర్‌గా 2019లో తన కెరీర్‌ను ప్రారంభించింది. యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌లో పలుమార్లు హార్స్ రేసింగ్‌లో పాల్గొంది. -
సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేల రగడ, బేరసారాలు, రాజకీయ సంక్షోభం రగులుతున్న నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకున్న నెటిజన్లు ఒక రేంజ్లో విమర్శిస్తున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురురాజకీయనాయకులు, నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. ఫ్రూడియన్ స్లిప్, మనసులో మాట అంటూ కొందరు విమర్శించారు. అంతేకాదు హార్స్ ట్రేడింగ్‌పై జీఎస్టీ అనేదే నిజమైతే.. బీజేపీనే ఎక్కువ టాక్స్ కట్టాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు సామాన్య ప్రజలు ఇక పన్నులు కట్టాల్సిన అవసరమే లేదంటూ పేర్కొంటున్నారు. ఈ కోవలో తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కూడా నిలిచారు. దీన్నే ఇంగ్లీషులో ఫ్రూడియన్ స్లిప్ అని హిందీలో మన్‌కీ బాత్ అంటారు అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా జీఎస్టీ కౌన్సిల్ ప్రెస్ మీట్ (జూన్ 29 బుధవారం) సందర్భంగా 'హార్స్ రేసింగ్'పై జీఎస్టీకి బదులుగా 'హార్స్-ట్రేడింగ్'పై జీఎస్టీ అన్నారు నిర్మలా సీతారామన్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోలు, హార్స్ రేసింగ్‌పై జీఎస్టీ గురించి ఆమె మాట్లాడారు. In English, this is called the Freudian slip of tongue In Hindi, it’s called “Mann Ki Baat” 😁#GSTonHorseTrading https://t.co/m2CGG23Sp0 — KTR (@KTRTRS) June 30, 2022 -
హార్స్ రేసింగ్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు
సాక్క్షి హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్పేట్ నందనవనం కాలనీకి చెందిన తిరుమల్‌రెడ్డి, జోజిరెడ్డి, గుర్రపు పందేల్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నారు. వాటిని తిరిగి సంపాదించుకునేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించి ఆన్లైన్ బెట్టింగ్ ప్రారంభించారు. లాక్డౌన్ సమయాన్ని అందుకు అనువుగా మలుచుకున్నారు. చాలా మంది ఇంటి వద్దనే ఉంటుండంతో గుర్రపు పందెలపై ఆసక్తి ఉన్న వారు బెట్ 365 యాప్ ద్వారా పందాలు కాసేవారు. అలాంటి వారిని ఎంచుకుని ట్రూస్టార్స్, లెజెండ్స్ పేరుతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. మియాపూర్‌కు చెందిన జోసఫ్‌రెడ్డిని కో ఆర్గనైజర్‌గా, హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రాక్లిన్ రెడ్డిని అకౌంటెంట్ గా ఏర్పాటు చేసుకున్నాడు. సాంకేతికతను ఉపయోగించి వివిధ నగరాల్లో జరిగే గుర్రపు పందాల ఫొటోలను తను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపు సభ్యులకు పంపేవాడు. వారి నుంచి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా పందెం డబ్బులు పంపేలా ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో మీర్పేట్ పోలీసులు, ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్ టీం ఈ నెల 3న జోజిరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులతో పాటు కూకట్‌పల్లికి చెందిన రామచంద్రారెడ్డి, చంపాపేట్‌కు చెందిన బొక్కా మాధవరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మాధవరెడ్డి ఎక్సైజ్ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. వారి నుంచి రూ. 42 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, డీసీపీ క్రైమ్స్ పి.యాదగిరి, పాల్గొన్నారు. -
రేస్‌కు వెళ్తుంటే ప్రమాదం .. 18 మంది మృతి
హాంగ్‌కాంగ్ : హాంగ్‌కాంగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో 18 మంది మృతి చెందగా, 47 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు హార్స్ రేసులను వీక్షించడానికి వేసిన ప్రత్యేక బస్సు, థాయ్ పో నుంచి షాటిన్ రేస్‌కోర్స్ వెళ్తుండగా ఈప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న బస్సు స్టేషన్‌పైకి దూసుకెళ్లింది. బోల్తా పడిన తర్వాత రెస్క్యూ సిబ్బంది బస్సు టాప్‌ను కట్ చేసి అందులో ఇరుక్కున్న ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనపై కోవ్లోన్ మోటర్ బస్సు కంపెనీ లిమిటెడ్ మేనేజర్ సో వాయ్ కీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. ఒక్కో బాధిత కుటుంబానికి 80,000 హాంగ్‌కాంగ్ డాలర్లు(దాదాపు రూ. 6.50 లక్షలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. -
మగధీరుడి గుర్రపుస్వారీ
మగధీర... సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా... అందులో రామ్‌చరణ్ (చెర్రీ) గుర్రపుస్వారీ చేస్తూ చేసిన ఫైట్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తే! అంత త్వరగా మర్చిపోలేరులెండి! చెర్రీ కూడా మర్చిపోలేదు... హార్స్ రైడింగ్నీ, ‘మగధీర’లో హార్స్నీ! వీలున్నప్పుడు ఆ గుర్రంపై సరదాగా కాసేపు షికారుకు వెళ్తున్నారు. ‘మగధీర’లో రామ్‌చరణ్ రైడ్ చేసిన గుర్రం పేరు బాద్షా. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు. నిన్న (ఆదివారం) కాజల్‌పై కాసేపు షికారు చేశారు. ఆ ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘రామ్‌చరణ్ ఈ వీకెండ్‌ని ‘మగధీర’లోని ఓల్డ్ ఫ్రెండ్‌తో స్పెండ్ చేస్తున్నాడు’’ అని ఉపాసన పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి చెర్రీకి హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర కాజల్‌తో పాటు మరికొన్ని గుర్రాలున్నాయి. ఇక, సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. -
కోట్లలో పందాలు.. లక్షల్లో లెక్కలు
♦ గుర్రపు పందాలలో రూ.కోట్లు పన్ను ఎగ్గొడుతున్న బుకీలు ♦ వందల కోట్ల వ్యాపారం చేస్తూ నెల నెలా లక్షల్లో లెక్కలు ♦ పన్ను రూపేణా నెలకు రేస్‌క్లబ్ చెల్లిస్తున్నది రూ. 5 కోట్లు ♦ ఎగ్గొడుతున్న మొత్తం అంతకు పదింతలకుపైనే! ♦ స్టింగ్ ఆపరేషన్ చేసి గుట్టు రట్టు చేసిన వాణిజ్యపన్నుల శాఖ ♦ నిజాం నాటి ‘రేస్‌కోర్స్’ చట్టంలో మార్పులకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న గుర్రపు పందాలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.. టికెట్లను పేరుకే రూ.50 నుంచి రూ.500 వరకు అమ్ముతూ వేలు, లక్షల రూపాయల్లో పందాలు కాస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇదంతా ప్రత్యేక లెసైన్సుతో పందాలు నిర్వహిస్తున్న 23 మంది బుకీల మాయాజాలం. రేస్‌క్లబ్ ద్వారా టికెట్లు కొని కాసే పందాలు సక్రమంగానే సాగుతుండగా... బుకీల ద్వారా జరిగే పందాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. వారు ప్రత్యేకంగా నెలకు కోట్ల రూపాయల్లో పందాలు కాస్తూ రేస్కోర్సుకు లక్షల్లో లెక్కలు చూపుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాన్ని గుర్తించింది. ‘బడా వ్యక్తులు’ బుకీల ద్వారా రూ.కోట్లలో గుర్రపు పందాలు ఆడుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నిజాం కాలం నాటి ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్-1939’లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైంది. మూడు రకాల పన్నులు..కోట్లల్లో లావాదేవీలు మలక్‌పేటలోని రేస్‌క్లబ్‌లో గుర్రాలు పరుగెడుతుంటే వాటిని చూస్తూ పందాలు కాయడం ఒక రకం బెట్టింగ్. దేశంలోని ఇతర ఏడు నగరాల్లో రేస్‌లు జరుగుతుంటే వాటిని ‘లైవ్ టెలికాస్ట్’ ద్వారా చూస్తూ కాసే ‘ఇంటర్వీన్ బెట్టింగ్’ రెండోది. ఇవి కాక ‘ఏపీ గేమింగ్ యాక్ట్ 1974’ కింద హైదరాబాద్‌లో చలికాలం, వర్షాకాలంలలో జరిగే రేసులకు జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ పందాలపై మూడు రకాల పన్నులు వసూలవుతాయి. రూ.10, రూ.100 విలువైన ప్రవేశ టికెట్ల మీద 30 శాతం పన్ను ఉంటుంది. రూ.500 వరకు లభించే పందె ం టికెట్లపై 10 శాతం పన్ను లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే రేస్కోర్స్లపై జరిగే ఇంటర్వీన్ బెట్టింగ్ మీద 12 శాతం పన్ను వస్తుంది. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా జరిగే ఈ ప్రక్రియలోనే సర్కారుకు నెలకు రూ.5 కోట్ల మేర పన్ను లభిస్తుంది. అయితే ఈ బెట్టింగ్లలోనే నల్లధనం చెలామణి అయ్యే మరో కోణమే బుకీలతో సాగే పందాలు. గుట్టు రట్టయిందిలా! వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్ రేవతి రోహిణిల పర్యవేక్షణలో 70 మంది అధికారులు సెప్టెంబర్ 4న పందెం రాయుళ్లుగా రేస్కోర్సుకు వెళ్లారు. ప్రభుత్వ అనుమతితో సర్కారు సొమ్ము సుమారు రూ.2లక్షలు వెచ్చించి బుకీల వద్ద పందె ం టికెట్లు కొని రేసు ఆడారు. అధికారులు రూ.500 టికెట్ కొంటే రూ.50 విలువతో ఉన్న టికెట్ ఇచ్చారు. పందెం ముగిసిన తరువాత అధికారులు 23 మంది బుకీలను లెక్కలు అడిగితే రూ.7 లక్షలు చూపించారు. వారి కౌంటర్లపై దాడులు జరపగా రూ.50 లక్షల పైచిలుకు సొమ్ము లభించింది. బుకీలు ఇలా దొంగ లెక్కలతో 2014-15లో ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. వీరి వాస్తవ లావాదేవీల ప్రకారం నెలకు రూ. 5 కోట్లపైనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ రేస్‌కోర్స్, బెట్టింగ్ యాక్ట్‌ను సమూలంగా మార్చాలని నిర్ణయించింది. బుకీలపై వాణిజ్యపన్నుల శాఖకు పూర్తిస్థాయి అజమాయిషీ ఉండేలా చట్టం రూపొందిస్తోంది. రేస్కోర్సుతో సంబంధం లేకుండా బుకీలు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్, ట్యాక్సేషన్ జరిపేలా మార్పులు చేసింది. బుకీల ఆర్థిక లావాదేవీలపై నిఘా, రిటర్న్స్ ఫైలింగ్ ఉండేలా సవరణలు చేసింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడుతోంది. బుకీల మాయాజాలం మలక్‌పేట రేస్‌క్లబ్ నిర్వహించే గుర్రపు పందాలలో 40 ఏళ్ల క్రితమే ప్రైవేటు బుకీలు ప్రవేశించారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి కొన్నేళ్లుగా ప్రభుత్వం 23 మంది బుకీలకు పందాల నిర్వహ ణ లెసైన్సులు జారీ చేసింది. ఈ బుకీలే ఏటా లెసైన్సులను రెన్యూవల్ చేయించుకుంటున్నారు. వీరికి రేస్క్లబ్లోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమైతే వీరి వద్ద టికెట్లు కొని గుర్రాలపై పందెం కాసినా.. రేస్‌కోర్సు లెక్కలోకే వెళుతుంది. వీరికి కమీషన్ మాత్రం వస్తుంది. కానీ బుకీలు ఆడే ఆటకు, రేస్కోర్సుకు చూపించే ‘లెక్క’లకు కోట్లలో తేడా ఉంటుంది. రూ.500 పందెం కాస్తే రికార్డుల్లో రూ. 50గా ఉంటుంది. రూ.500కు మించి అధికారికంగా పందాలు కాయడానికి వీలు లేకపోవ డంతో దాన్ని ఆసరాగా చేసుకొని బుకీలు లావాదేవీలు సాగిస్తారు. పందెం లెక్కలు బుకీలకు, కాసిన వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఇక్కడే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. -
గ్రామీణ ప్రాంతాలకూ గుర్రపందాలు!
బెట్టింగ్ కేంద్రాలను స్థాపించే యోజనలో ‘బీటీసీ’ ఇప్పటి వరకూ బెంగళూరుకు మాత్రమే పరిమితమైన గుర్రపందేలు ఇకపై గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనున్నాయి! ఈ మేరకు బెంగళూరు టర్ఫ్ క్లబ్ (బీటీసీ) రూపొందించిన నివేదికకు ప్రభుత్వం నుంచి అమనుమతి లభించనుంది. బెంగళూరు నడి బొడ్డున ఉన్న బీటీసీలో జరిగే గుర్రపు పందేలకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఇక్కడకు చాలా మంది వచ్చి పందెం కాస్తుంటారు. కోట్లాది రుపాయలు చేతులు మారడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రాబడి కూడా భారీగానే ఉంటోంది. అయితే ఈ బీటీసీ తమ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది. - సాక్షి, బెంగళూరు తొలుత ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ గుర్రపు పందేలను తొలుత బళ్లారి, దావణగెరె, బెళగావిలో ప్రా రంభించనున్నట్లు సమాచారం. వీటిలో బెంగళూరులో గుర్రపు పందేలు జరిగే సమయంలో వాటిని టీవీ, ఇంటర్నెట్ తదితర మాద్యమాల ద్వారా ఈ కేంద్రాల్లో ప్రసారం చేస్తారు. ఈ కేం ద్రాల్లో బెట్టింగ్ జరపడానికి అవకాశం ఉంటుంది. అంటే నూతనంగా ప్రారంభించబోయే కేంద్రాల్లో ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం బెట్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదట మూడు కేంద్రాల్లో ప్రయోగాత్మంగా ఈ విధానాన్ని ప్రారంభించి అటుపై రాష్ట్రమంతటా విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీటీసీ రూపొందించిన నివేదిక ఆర్థికశాఖకు చేరింది. అనుమతిపై అనుమానాలు బెంగళూరు టర్ఫ్ క్లబ్లో మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రభావంతమైన పోస్టుల్లో ఉండటం వల్ల ఁబీటీసీ* ప్రతిపాదికకు అనుమతి లభిస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా గుర్రపుపందేల సంస్కృతి గ్రామీణ ప్రాంతాలు విస్తరించడం వల్ల అక్కడి ప్రజల ఆర్థిక విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. జూదాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ దానిని అరికట్టాలని గవర్నర్‌ను కోరుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని కూడా లేవదీసింది. ఈ నేపథ్యంలోనే క్లబ్ సభ్యుడు ఒకరు ఁసాక్షి*తో మాట్లాడుతూ... ‘బెళగావి, దావణగెరె, బళ్లారిలలో కేంద్రాల స్థాపనకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయం వాస్తవమే. త్వరలోనే అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
దామునాపల్లిలో జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు ఎడ్ల విజేత వల్లంపూడి...గుర్రపు విజేత చోడవరం చోడవరం రూరల్ : చోడవరం మండలం దామునాపల్లి గ్రామంలో గురువారం జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు ఉత్సాహంగా సాగాయి. ఇటీవల కాలంలో పోటీలు ఎక్కడా లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పలువురు ఔత్సాహికులు ఈ పోటీలకు తరలివచ్చారు. ప్రధానంగా ఎడ్ల పందాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీవ్రమైన ఎండ కారణంగా పోటీలను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. వడ్లపూడికి చెందిన ఎడ్లు ప్రథమ బహుమతి సాధించగా చుక్కపల్లి, లెక్కలవానిపాలెం, నర్సయ్యపేట, కొత్తపెంట ఎడ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అలాగే, జిల్లా స్థాయి గుర్రపు పందాల్లో చోడవరం పట్టణానికి చెందిన ఆర్.శ్రీను ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో వాడచీపురుపల్లికి చెందిన గొర్లి విజయ్‌కుమార్, మూడో స్థానంలో నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ, నాల్గో స్థానంలో చినయాతపాలెంకు చెందిన వి.యశ్వంత్ నిలిచారు. కాగా, ఐదో స్థానాన్ని కూడా చోడవరానికే చెందిన ఆర్.శ్రీను గుర్రం దక్కించుకుంది. రెండు పోటీల్లోనూ విజేతలకు వరుసగా రూ.5వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి బహుమతిగా అందించారు. గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పోటీలు చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. -
గుర్రాల పోటీలో అపశ్రుతి
ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం గాంధీ గ్రామం సోలాపూరమ్మవారి ఉత్సవంలో ఘటన చోడవరం, న్యూస్‌లైన్: హుషారుగా జిల్లా స్థాయి గుర్రపు పందాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఉత్సాహంగా పోటీలో పరుగులు తీస్తున్న గుర్రాల మధ్యలోకి కొందరు దూసుకురావడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. గుర్రాల కింద పడి ముగ్గురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చోడవరంమండలం గాంధీ గ్రామంలో ఆదివారం సోలాపూర్ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభంగా జరిగింది. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ఈ ఆలయం సమీపంలో పొలాల్లో జిల్లా స్థాయి గుర్రపు, యడ్ల బళ్ల పోటీలు నిర్వహించారు. ముందు యడ్ల బళ్ల పోటీలు జరగగా, గుర్రపు పోటీలు నిర్వహించే సమయానికి కొంత పొద్దుపోయిన సమయం అయ్యింది. అయినా పోటీ జరిగే ప్రదేశంలో భారీగా లైట్లు ఏర్పాటు చేయడంతో గుర్రపు పోటీలు మంచి రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. గుర్రాలు పోటీ పడి పరుగెడుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు మధ్యలో అటుగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఇంతలో అప్పటికే వేగంగా దూసుకొస్తున్న గుర్రాల కింద కొందరు పడిపోయారు. ఈ ప్రమాదంలో గాంధీ గ్రామం దూదిరామయ్య(70), ఆరిపాక సన్యాసి(60), ఎస్.పవన్(25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో దూది రామయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దర్నీ చోడవరం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. అంతా అహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా జరుగుతున్న పోటీల మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అనంతరం యథావిధిగా పోటీలు నిర్వహించారు.