సాక్క్షి హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్‌పేట్ నందనవనం కాలనీకి చెందిన తిరుమల్‌రెడ్డి, జోజిరెడ్డి, గుర్రపు పందేల్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నారు. వాటిని తిరిగి సంపాదించుకునేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించి ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రారంభించారు.
లాక్‌డౌన్ సమయాన్ని అందుకు అనువుగా మలుచుకున్నారు. చాలా మంది ఇంటి వద్దనే ఉంటుండంతో గుర్రపు పందెలపై ఆసక్తి ఉన్న వారు బెట్ 365 యాప్ ద్వారా పందాలు కాసేవారు. అలాంటి వారిని ఎంచుకుని ట్రూస్టార్స్, లెజెండ్స్ పేరుతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. మియాపూర్‌కు చెందిన జోసఫ్‌రెడ్డిని కో ఆర్గనైజర్‌గా, హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రాక్లిన్ రెడ్డిని అకౌంటెంట్ గా ఏర్పాటు చేసుకున్నాడు. సాంకేతికతను ఉపయోగించి వివిధ నగరాల్లో జరిగే గుర్రపు పందాల ఫొటోలను తను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపు సభ్యులకు పంపేవాడు.
వారి నుంచి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా పందెం డబ్బులు పంపేలా ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో మీర్‌పేట్ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్ టీం ఈ నెల 3న జోజిరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులతో పాటు కూకట్‌పల్లికి చెందిన రామచంద్రారెడ్డి, చంపాపేట్‌కు చెందిన బొక్కా మాధవరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మాధవరెడ్డి ఎక్సైజ్ పోలీస్ విభాగంలో ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. వారి నుంచి రూ. 42 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్‌బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, డీసీపీ క్రైమ్స్ పి.యాదగిరి, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment