betting rocket
-
ఆ ఐపీఎల్లో ఆటగాళ్ల రెమ్యునరేషన్ రూ. 400 మాత్రమే..!
ఐపీఎల్ పేరిట నకిలీ మ్యాచ్‌లు నిర్వహిస్తూ ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు గుజరాత్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహ్సాన జిల్లా మోలిపూర్ గ్రామంలోని ఓ ముఠా ఐపీఎల్ పేరిట ఫేక్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సాంకేతికత ద్వారా అచ్చం ఐపీఎల్ మ్యాచ్ల్లా చిత్రీకరించిన ఈ మ్యాచ్‌ల ద్వారా సదరు ముఠా రష్యాలోని బెట్టింగ్ రాయుళ్లకు గాలం వేస్తోంది. ఈ ఫేక్ ఐపీఎల్లో వ్యవసాయ కూలీలే ఆటగాళ్లు. ఒక్కో మ్యాచ్‌లో ఆటగాడిగా నటించినందుకు గాను వీరికి లభించే రెమ్యునరేషన్ రూ.400. వీరు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలు ధరించి నిజమైన ఆటగాళ్లలా బిల్డప్ ఇస్తుంటారు. ఈ మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు బొమ్మ వాకీ టాకీలు పట్టుకుని నిజమైన అంపైర్ల కంటే ఎక్కువ ఫోజులు కొడుతుంటారు. హర్ష భోగ్లే స్వరాన్ని ఇమిటేట్ చేస్తూ కామెంటరీ చేయడం ఈ ఫేక్ ఐపీఎల్ మొత్తానికే హైలైట్. ఈ మ్యాచ్‌లను హెచ్డీ కెమెరాలతో రికార్డు చేసి ఐపీఎల్ పేరుతో యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తుంటారు. ఈ నకిలీ ఐపీఎల్ ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. రష్యాలోని త్వెర్, వోరోనెజ్, మాస్కో తదితర ప్రాంతాల నుంచి పంటర్లు (పందెం కాసేవాళ్లు) బెట్టింగ్‌లు పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయంశంగా మారింది. నిజమైన ఐపీఎల్‌ను తలపించే ఈ ఫేక్ ఐపీఎల్ గురించి తెలిసి క్రికెట్ ఫాలోవర్స్ నివ్వెరపోతున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫేక్ ఐపీఎల్ నిర్వహణకు సూత్రధారి షోయబ్ దవ్దా రష్యాలోని ప్రముఖ బెట్టింగ్ కేంద్రంలో గతంలో పని చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వరల్డ్ ఎలెవెన్‌తో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే..? -
హార్స్ రేసింగ్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు
సాక్క్షి హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్పేట్ నందనవనం కాలనీకి చెందిన తిరుమల్‌రెడ్డి, జోజిరెడ్డి, గుర్రపు పందేల్లో పాల్గొని డబ్బులు పోగొట్టుకున్నారు. వాటిని తిరిగి సంపాదించుకునేందుకు తమ అనుభవాన్ని ఉపయోగించి ఆన్లైన్ బెట్టింగ్ ప్రారంభించారు. లాక్డౌన్ సమయాన్ని అందుకు అనువుగా మలుచుకున్నారు. చాలా మంది ఇంటి వద్దనే ఉంటుండంతో గుర్రపు పందెలపై ఆసక్తి ఉన్న వారు బెట్ 365 యాప్ ద్వారా పందాలు కాసేవారు. అలాంటి వారిని ఎంచుకుని ట్రూస్టార్స్, లెజెండ్స్ పేరుతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేశాడు. మియాపూర్‌కు చెందిన జోసఫ్‌రెడ్డిని కో ఆర్గనైజర్‌గా, హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రాక్లిన్ రెడ్డిని అకౌంటెంట్ గా ఏర్పాటు చేసుకున్నాడు. సాంకేతికతను ఉపయోగించి వివిధ నగరాల్లో జరిగే గుర్రపు పందాల ఫొటోలను తను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపు సభ్యులకు పంపేవాడు. వారి నుంచి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా పందెం డబ్బులు పంపేలా ఏర్పాటు చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందడంతో మీర్పేట్ పోలీసులు, ఎస్ఓటీ ఎల్బీనగర్ జోన్ టీం ఈ నెల 3న జోజిరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు నిర్వాహకులతో పాటు కూకట్‌పల్లికి చెందిన రామచంద్రారెడ్డి, చంపాపేట్‌కు చెందిన బొక్కా మాధవరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా మాధవరెడ్డి ఎక్సైజ్ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నట్లుగా తెలిసింది. వారి నుంచి రూ. 42 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, డీసీపీ క్రైమ్స్ పి.యాదగిరి, పాల్గొన్నారు. -
IPL-2021: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఖమ్మం: ఐపీఎల్-2021 మ్యాచ్‌లపై బెట్టింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అయితే ఈ బెట్టింగ్‌ను కొత్త తరహాలో చేస్తుండడం గమనార్హం. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురుని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బ్యాచ్ గూగుల్ పే ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. రూ.రెండు లక్షల రూపాయల వరకు బెట్టింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆన్లైన్లో లావాదేవీలు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏసీపీ వెల్లడించారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: మరో హీరో.. ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ -
ఐపీఎల్-2021: బంతి బంతికీ బెట్టింగ్
‘ఏలూరుకి చెందిన రామకృష్ణ నగరంలో ద్వితీయ శ్రేణి బుకీతో క్రికెట్ బెట్టింగ్ కట్టాడు. తన సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగులు కాస్తున్నాడు. రెండు, మూడు మ్యాచ్‌లలో డబ్బులు రావడంతో ఆసక్తి పెరిగింది. దీంతో జోరుగా పందేలు కాయడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే రూ.70 వేలు బుకీలకు బకాయిపడ్డాడు. బుకీలకు చెందిన రౌడీషీటర్లు అతని ఇంటికి వెళ్లి డబ్బుల కోసం వేధింపులకు దిగటంతో ఏం చేయాలో పాలుపోక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు రామకృష్ణ.’ ‘భీమవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వెంకటేష్ గత ఐపీఎల్ సీజన్లో జోరుగా క్రికెట్ బెట్టింగులు కట్టాడు. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు చెప్పి డబ్బులు తెచ్చి బెట్టింగులు కాసాడు. మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి లక్షల్లో అప్పు అయ్యింది. బుకీలకు చెందిన వ్యక్తులు వెంకటేష్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను సైతం వేధించారు. బయటకు చెబితే పరువుపోతుందని వీరు అప్పులు చేసి కొంతమేర డబ్బులు కట్టారు.’ ఏలూరు టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగులకు వారధిగా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత లక్ష్యంగా బెట్టింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బంతి బంతికీ, ఓవర్ ఓవర్‌కు, మ్యాచ్ విజేతలు ఇలా పలురకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. క్రికెట్ బుకీల వలలో చిక్కుకుంటున్న యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగులు కడుతున్నారు. ఎర చూపుతూ.. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ ఎరవేయడంతో యువత, విద్యార్థులు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ కేసుల్లో అత్యధికంగా పట్టుబడేది కూడా యువత, విద్యార్థులు కావడం విశేషం. బెట్టింగులకు అలవాటు పడిన యువత వ్యసనాలకు బానిసలై దొంగలుగానూ మారుతున్నారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, నిడదవోలు, కొవ్వూరుతోపాటు పల్లెల్లోనూ బెట్టింగ్ సంస్కృతి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం గత ఐపీఎల్ సీజన్లో ఏలూరు ప్రాంతంలో పోలీసులు బెట్టింగ్ కేసుల్లో 35 మంది వరకూ అదుపులోకి తీసుకుంటే వారిలో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు దాడులు చేసి 46 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 30 మందికి పైగా యువతే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. పల్లెల్లోనూ విష సంస్కృతి : గ్రామాలకు సైతం బెట్టింగ్ మాఫియా విస్తరించడంతో చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులు సైతం వీరి బారిన పడుతున్నారు. కీలకమైన జట్లు తలపడితే బెట్టింగ్ హీట్ పెరిగిపోతుంది. ఈ ఐపీఎల్ సీజన్లో సుమారుగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైగానే బెట్టింగులు జరుగుతాయని అంచనా. ఆన్లైన్ యాప్‌లతో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధాన బుకీలు ప్రత్యేక యాప్‌లలో సెకండ్ స్టేజ్ బుకీలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. వాటికి అనుగుణంగా సెల్‌ఫోన్‌తోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటికంటే రెండు, మూడు నిమిషాలు ముందుగానే ప్రత్యేక యాప్‌లలో మ్యాచ్ వివరాలు తెలిసిపోతూ ఉండటం గమనార్హం. కఠిన చర్యలు జిల్లాలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, జూదక్రీడలపై ప్రత్యేక నిఘా ఉంది. క్రికెట్ బెట్టింగుల పేరుతో యువత, విద్యార్థులను పెడదోవ పట్టించే అసాంఘిక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. బెట్టింగులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోనూ పటిష్ట చర్యలు చేపట్టాం. – కె.నారాయణనాయక్, జిల్లా ఎస్పీ ఓ కంట కనిపెట్టాలి యువత, విద్యార్థులు సమాజాభివృద్ధికి కీలక వనరులు. వీరిని వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. విలాసాలకు అలవాటు పడితే పెడదారిపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది. – డాక్టర్ హరికృష్ణ, జిల్లా ఆస్పత్రి వైద్యులు -
కామారెడ్డి పోలీసుల్లో ఐపీఎల్ బెట్టింగ్ గుబులు!
-
బెట్టింగ్ కాస్కో.. తీస్కో !
సాక్షి, భూపాలపల్లి అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. కరోనా నేపథ్యంతో పాటు ఎవరికీ చిక్కవద్దనే భావనతో ఎక్కడ కూడా గుమికూడకుండా అంతా ఆన్లైన్లో కానిచ్చేస్తున్నారు. ఉద్యోగాలు ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు ఉండడంతో పాటు కళాశాలలకు సెలవులు రావడంతో బెట్టింగ్ వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, కాటారం, ములుగు, ఏటూరునాగారం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మొదలు నుంచి చివరి వరకు ఐపీఎల్ మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకు ప్రతీ అంశాన్ని బెట్టింగ్ బాబులు పందెం కాస్తూ జోరుగా దండుకున్నట్లు తెలుస్తోంది. పరుగుకు ఓ రేటు, బంతి బంతికి మరో రేటు, వికెట్, టాస్, విజేత ఇలా ప్రతీ అంశానికో రేటు నిర్ణయించినట్లు సమాచారం. రూ.వంద బెట్టింగ్ పెడితే గెలిచిన వారికి రూ.వెయ్యి చొప్పున అందిస్తుండగా.. కొందరు మాత్రమే గెలుస్తూ ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువకులు, విద్యార్థులను బడా వ్యాపారులు బుట్టలో వేసుకుని బెట్టింగ్ కడుతుండంతో రూ.లక్షల్లో చేతులు మారుతోంది. జరుగుతోంది ఇలా.. వివిధ ప్రాంతాల్లో కొందరు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొంత మంది బుకీల సాయంతో కానిచ్చేస్తున్నారు. ఇంట్లో టీవీ ముందు కుర్చోని లేదా సెల్ఫోన్లో మ్యాచ్ చూస్తూ బెట్టింగ్ కాస్తున్నారు. ఏ టీం ఎన్ని పరుగులు చేస్తుంది, ఏ జట్టు గెలుస్తుంది, ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు, ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడనే అంశాలపై బెట్టింగ్ సాగుతోంది. మ్యాచ్ అయిపోగానే ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క చూసుకుంటున్నారు. రూ.వంద మొదలు రూ.లక్షల వరకు బెట్టింగ్ సాగుతుండడంతో ప్రతీ ఆటకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. (ఐపీఎల్ బెట్టింగ్: ఒక్కోమ్యాచ్‌పై లక్షల్లో) అంతా కోడ్ భాష క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడేవారు ఎక్కువగా సెల్‌ఫోన్, ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదలచుకుంటున్నారో వారితో ఆన్లైన్, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి, పుచ్చుకుంటున్నారు. ఈ విషయం ఇతరులకు అర్థం కాకుండా కోడ్ భాష ఉపయోగిస్తున్నారు. కోడ్ ప్రకారం బెట్టింగ్ పెట్టి వారు గెలిస్తే డబ్బు చెల్లిస్తున్నారు. పోలీసులకు సైతం చిక్కవద్దనే భావనతో కోడ్ లాంగ్వేజీని ఎంచుకున్నట్లు సమాచారం. కాగా, బెట్టింగ్‌కు పాల్పడుతున్న సామాన్య, గ్రామీణ ప్రాంత ప్రజలు, యువకులు ఆర్థికంగా నష్టపోతూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. బెట్టింగ్ వల్ల బుకీలకు లాభం చేకూరుతుండగా సామాన్యుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. కురవి: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. యువకులు, క్రికెట్ అభిమానులు ఆటను ఆస్వాదించాలే తప్ప డబ్బు సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్‌కు పాల్పడొద్దు. అదే జరిగితే కేసులు ఎదుర్కొంటూ జైలు పాలు కావల్సి వస్తుంది. అంతేకాకుండా జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. యువతీ, యువకులు, విద్యార్థులు బెట్టింగ్‌కు పాల్పడి చేటు కొనితెచ్చుకోవద్దు. – జె.శంకర్రావు, ఎస్సై, కురవి -
ఐపీఎల్ బెట్టింగ్: ఒక్కోమ్యాచ్‌పై లక్షల్లో
క్రీడా రంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతోంది. ఆటలంటే అందరికీ అభిమానమే అయినా.. క్రికెట్ అంటే చిన్న పిల్లవాడు మొదలు.. పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఈ నెల 19న ప్రారంభమైన ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) క్రికెట్‌పై యువత అప్పుడే ఆన్లైన్ బెట్టింగ్‌లు మొదలుపెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఒకచోట గుమిగూడి ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరి కొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్లైన్లో బెట్టింగ్ పెడుతున్నారు. పల్లె మొదలు పట్టణాల వరకు యువత టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయి.. ఈ విష సంస్కృతిలో కూరుకుపోతున్నారు. రోజు ఒక్కోమ్యాచ్‌పై సుమారు రూ. వెయ్యి నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో సాగుతోందని సమాచారం. ప్రతిదీ వ్యాపారమే.. యువత ఇష్టాన్ని.. బెట్టింగ్ సంస్కృతిని ఆసరా చేసుకుంటున్న కొందరు క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బుకీలుగా మారుతున్నారు. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో మందు పార్టీలు సైతం చేసుకుంటూ తాగిన మైకంలో బెట్టింగ్‌లపై మోజు పెంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కోబాల్‌కు బెట్టింగ్ పెట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పైగా అప్పుల పాలు సైతం అవుతున్నారు. ప్రధానంగా గూగుల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నందున సెల్ఫోన్ల నుంచి ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుకుంటున్నారు. గతంలో జిల్లాకేంద్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా ఈనెల 19న ప్రారంభమైన ఐపీఎల్ కు కూడా క్రికెట్ బెట్టింగ్‌లు మొదలయ్యాయి. మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్లపై గెలుపు ఓటములపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు. ఇదిరోజు సాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా క్రికెట్ బెట్టింగులు రూ.లక్షల్లో సాగుతున్నట్లు సమాచారం. కోడ్ భాషతో.. బుకీల వద్ద బెట్టింగులకు కోడ్ భాష వాడుతున్నారు. ఒకసారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి ఫోన్వస్తేనే బెట్టింగ్ వ్యవహారంపై మాట్లాడుతారు. గతంలో బెట్టింగ్ రాయుళ్లు వాడే కోడ్ భాష లెగ్ అని, ఈటింగ్ అనే కోడ్ భాషను వాడారు. ఎవరు ఎన్ని లెగ్‌లు తీసుకుంటే అన్ని లెగ్గులకు లెక్కగట్టి చెల్లించాల్సి ఉంటుంది. లెగ్‌కు ఇంత అని ముందే రేటు ఫిక్స్ చేస్తారు. బుకీల ద్వారా బెట్టింగ్‌లు పెడితే మ్యాచ్ జరగడానికి ముందే లావాదేవీలు జరుపుతారు. కలిసొస్తున్న లాక్డౌన్ ఈసారి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లకు లాక్డౌన్ కలిసొచ్చినట్లు ఉంది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో చాలామంది యువత ఇంట్లోనే ఉంటోంది. దీంతో రోజంతా టీవీలు, సెల్ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగుల వైపు మొగ్గు చూపుతున్నారు. హోటళ్లు, బిర్యాణి సెంటర్లలో కూర్చుండే అవకాశం లేకపోవడంతో యువత నివాస గృహాలు, బహిరంగ ప్రదేశాలను ఎంచుకుని బెట్టింగ్ చేస్తున్నారు. జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలోని శ్రీరాంపూర్, సీసీసీ, జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్, రాముని చెరువు పార్క్, హైటెక్ సిటీ, లక్సెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి వంటి పట్టణాల్లో ఇప్పటికే బెట్టింగ్ వ్యవహారం జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు దృష్టి సారించాలి యువత రానురాను విష వలయంలో చిక్కుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ప్రారంబైనందున యువత బెట్టింగ్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీస్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్నటివరకు పోలీస్ అధికారులందరూ కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో పోలీస్ అధికారులకు కొంత విరామం దొరికినట్లు అయ్యింది. ఇదే సమయంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జిల్లాలో జోరుగానే సాగుతున్నాయన్న సమాచారం ఉంది. యువత బెట్టింగ్ విషవలయంలో చిక్కకముందే ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విష సంస్కృతిలో యువత.. ఆన్లైన్ బెట్టింగ్‌ల ద్వారా యువత పెడదారి పడుతోంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జరిపిన వారే మళ్లీ ఈసారి రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ వార్డులో ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందన్న సమాచారం మేరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది యువకులు ఉండగా.. మంచిర్యాల జిల్లాకేంద్రంలో పేరు మోసిన వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లితండ్రులకు తెలియకుండా అవసరాల నిమిత్తం డబ్బులు అడుక్కుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్ప డుతున్నారు. అవి అయిపోయాక స్నేహితుల వద్ద, బెట్టింగులో ఉన్న కొందరి పెద్ద మనుషుల వద్ద అధిక వడ్డీకి తీసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. -
ఉలిక్కిపడ్డ బెట్టింగ్ రాయుళ్లు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : రాజాం పట్టణ కేంద్రంగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్థానిక బాబానగర్ కాలనీలో ఓ అద్దె ఇంటి నుంచి కొనసాగిస్తున్న బెట్టింగ్ ముఠాను రాజాం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరడంతో మరో ఐదుగురు బుకీలు అక్కడ్నుంచి తప్పించుకుని పరారయ్యారు. ఈ నెల 7న వరల్డ్ కప్ సెమీఫైనల్ –2 సందర్భంగా వీరంతా మ్యాచ్ తిలకిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. రాజాంలో కొంతకాలంగా సాగుతున్న బెట్టింగ్‌రాయుళ్లుపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో బుకీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి లక్షలాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారినట్లు సమాచారం. ఇటువంటి బెట్టింగ్ రాయుళ్లుపై పోలీసుల మరింత కఠినంగా వ్యవహరించాల్సి అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ బెట్టింగ్‌పై నిఘా : ఎస్పీ ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడినా, జూదం ఆడుతున్నా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం బెట్టింగ్ ముఠా వివరాలను వెల్లడించారు. రాజాం పట్టణ సీఐ సోమశేఖర్‌కు వచ్చిన సమాచారంతో నిఘా పెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ. 2.65 లక్షలు, 12 సెల్ఫోన్లు, పద్దు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో పిన్నింటి శివకుమార్, శేషపు మురళీకృష్ణ, లెంక దామోదరరావు, చింత శ్రీనివాసరావు, కరణం పురుషోత్తం ఉన్నారని వివరించారు. మరికొందరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐ సోమశేఖర్, ఎస్ఐ సూర్యకుమారి, హెచ్‌సీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, కృష్ణాజిల్లా : ఐపీఎల్12 సీజన్ చివరి రోజున క్రికెట్ బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. పోరంకిలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నాలుగు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్, టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఎన్ని'కల' పందెం కాస్కో..!
సాక్షి, కొత్తకోట: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈనెల 11న వెలువడే ఫలితాలపై రూ.లక్షల బెట్టింగ్ నడుస్తోంది. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా, ఒక్క లగడపాటి ఎగ్జిట్‌పోల్ సర్వే మాత్రం మహాకూటమికి సానుకూలంగా ఉందని చెప్పడం అందరిలోనూ ఉత్కంఠ రేపింది. గతంలో జరిపిన లగడపాటి సర్వేలు చాలా మేరకు విజయవంతమవడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత అలజడి నెలకొంది. దీంతో నేషనల్ ఎగ్జిట్‌పోల్స్‌పై నమ్మకం ఉంచుతూ కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలో బెట్టింగు రాయుళ్లు సైతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులకు మించిన స్థాయిలో ఓటింగ్ జరిగిన తీరునూ అంచనా వేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్తకోట పట్టణంతో పాటు దేవరకద్ర, భూత్పూర్, అడ్డాకుల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతో పాటు మదనాపురం, మూసాపేట వంటి మారుమూల ప్రాంతాలకు ఈ జాఢ్యం అంటుకుంది. ఈ క్రమంలో కొందరు లాభపడటం.. మరికొందరు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితాలపై బెట్టింగ్‌ల తీరు ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీలు రూ.కోట్లు ఖర్చుచేశాయి. డబ్బు, మద్యం ఏరులై పారింది. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ప్రచారం మొదలుకుని పోలింగ్ వరకు పందెం కాస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. మహాకూటమి వస్తుందా.. లేక హంగ్ ఏర్పడనుందా.. అంటూ పందెం కాస్తున్నారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడా.. లేక మహాకూటమి అభ్యర్థి గెలుస్తాడా.. బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారు. ఇవీ కాకుండా బెట్టింగ్ రాయళ్లు ఇంకొంచెం ముందుకెళ్లి ఆయా పట్టణాల్లో తమ నాయకుడికే అత్యధిక ఓట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఏ మండలం ఎవరికి ఎంత లీడ్ ఇస్తుందో చెబుతున్నారు. పల్లెల్లో బెట్టింగ్ భూతం ఎన్నికలకు ముందు దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువగా కొత్తకోట, దేవరకద్ర మండలాల్లో బెట్టింగ్ కాసినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు, లగడపాటి సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉండటంతో బెట్టింగ్‌ల స్థాయి పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో ఆయా మండలాల్లో కీలక నేతలు ఉండే గ్రామాల్లో కార్యకర్తల బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. బెటింగ్ రాయుళ్ల ఆశలు నెరవేరాలంటే ఈనెల 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. స్వేహపూర్వకంగా గెలుపోటములు ఏ పోటీలోనైనా గెలుపోటములు స్వేహపూర్వకంగా ఉండాలి. అంతేగాని కొట్లాటలు, పోట్లాట వరకు వెళ్లకూడదు. ఫలితాలపై ఉత్కంఠ ఉండటం సహజమే. కానీ ఈ నెపంతో పందెం కాసి డబ్బు పోగొట్టుకోవడం మంచిది కాదు. ఆయా పార్టీల వారిలో ఎవరి ధీమా వారికే ఉంటుంది. ప్రస్తుతం ఓటర్లు పూర్తి అవగాహనతో ఓటు వేస్తున్నారు. వారి నాడి ఎవరికి అంతుచిక్కడం లేదు. – రవికాంత్‌రావు, ఎస్ఐ, కొత్తకోట -
క్యారం సెంటర్లపై పోలీసుల దాడులు
నిజామాబాద్ క్రైం : నగరంలోని ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ నార్త్ సీఐ బుచ్చయ్య తెలిపారు. 5వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో గల క్యారం బోర్డు సెంటర్లలో నిత్యం బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్నారనే సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి ఆరు క్యారం సెంటర్లపై దాడులు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బెట్టింగ్‌లపై క్యారం ఆడుతున్న 26 మందిని అదుపులోకి తీసుకుని రూ. 1,720 నగదు, 16 సెల్ఫోన్లు, 8 క్యారం బోర్డులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
‘అవినీతిని కొత్తపుంతలు తొక్కిస్తున్న కోడెల’
సాక్షి, గుంటూరు : అవినీతిని కొత్తపుంతలు తొక్కిస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీనేత, శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్రావుదేనని నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ నేతలు దారుణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని అన్నారు. తెలుగు యువత అధ్యక్షుడే నరసరావుపేటలో బెట్టింగ్గులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. స్పీకర్ కోడెల కుమారుడు, కుమార్తె చేస్తున్న అవినీతి అంతఇంత కాదని ఇవన్ని కోడెల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు. కోడెలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కోటప్పకొండ మీద ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. దేవెన్నాదేవిలో భూకబ్జా చేసింది, కమీషన్ కోసం రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించింది, అపార్ట్మెంట్లలో ప్రతి ఫ్లాటుకు రూ.లక్ష వరకూ మాముళ్లు వసూలు చేసింది ఎవరని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత కోడెలదేనని తెలిపారు. -
ఆరోపణలకు ఆధారాలు చూపండి: రిచర్డ్సన్
టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్, పిచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించిన అల్ జజీరా టీవీ నెట్వర్క్... దానికి సంబంధించిన ఆధారాలను తమకు అందించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. అజ్ జజీరా తమ వద్ద అందుబాటులో ఉన్న, ఎడిట్ చేయని మొత్తం ఫీడ్‌ను ఇవ్వాలని, దానిపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపి క్రికెట్లో అవినీతిని తరిమివేసే ప్రయత్నం చేస్తామని రిచర్డ్సన్ అన్నారు. -
ప్రముఖ బుకీ అరెస్టు
ముంబై : ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ప్రముఖ బుకీని మంగళవారం నాడు థానే పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ముంబైలోని దొంబివాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న థానే దోపిడీ వ్యతిరేక విభాగానికి చెందిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి బుకీని అరెస్టు చేశారు. అతడి నుంచి ల్యాప్‌టాప్‌లను, పదుల సంఖ్యలో మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితుడు దేశంలోనే టాప్‌మోస్ట్ బుకీ సోను జలాన్ అలియాస్ సోను మలాద్గా పోలీసులు ప్రకటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జలాన్ ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌లు నిర్వహించడానికి సోషల్ మీడియా ద్వారా కొన్ని లింకులను పంపించేవాడు. ఇతర ఏజెన్సీలకు, పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం. బెట్టింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ఆ లింకుల ద్వారా బెట్టింగ్ పెడతారు. ఇలా పెట్టినవారికి జలాన్‌కు సంబంధించిన వ్యక్తుల ద్వారా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. జలాన్ దొంబివాలా పరిసరాలలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలను కూడా బెట్టింగ్‌కు అడ్డగా మార్చుకున్నాడని తెలిపారు. -
ఐపీఎల్ ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి..
ఇండోర్: ఐపీఎల్ బెట్టింగ్ తారాస్థాయికి చేరిందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా టీవీల్లో కొన్ని సెకన్లు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారమవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ బెట్టింగ్ బృందం.. సిగ్నల్స్‌ను దొంగిలించడం ద్వారా టీవీల్లో ప్రసారం కావడానికి ఎనిమిది సెకన్ల ముందే మ్యాచ్ గమనాన్ని తెలుసుకుని కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. క్రికెట్ బెట్టింగ్ టిప్స్ ఫర్ ఫ్రీ పేరు ఒక వెబ్‌సైట్‌ను తెరిచిన ఈ ముఠా.. మ్యాచ్ ఫీడ్‌ను మళ్లించి ఈ సైట్లో ఉంచుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ ముఠా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి ప్రధాన సూత్రధారి అంకిత్ జైన్ అలియాస్ మున్నూ జాకీగా అనుమానిస్తున్నారు. అతన్ని విదిషాలో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ సైబర్ సెల్ ఎస్పీ జితేందర్ సింగ్ తెలిపారు. -
గుంటూరులో క్రికెట్ బుకీలు అరెస్టు
సాక్షి,గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగులకు పాల్పడుతున్నారనే సమాచారంతో నల్లచెరువు ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ల్యాప్‌టాప్, టీవీ, 6 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు. -
బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 10 మంది అరెస్ట్
వైఎస్సార్ జిల్లా : కడప నగరంలో పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 10 మంది బుకీలను కడప టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.30 లక్షల నగదు, 10 మొబైల్స్, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మసూమ్ బాషా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. -
13మంది బుకీల అరెస్ట్
విజయవాడ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు అయింది. మొత్తం 13మంది బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సింగ్ నగర్లో ఓ ఇంట్లో రహస్యంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆన్లైన్, మొబైల్ యాప్‌లతో ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ రాష్ట్రంలోని పలువురు ఏజెంట్లతో ఈ ముఠా సంబంధాలు పెట్టుకున్నట్లు సమాచారం. వీరినుంచి 24 సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ బెట్టింగ్ వలలో ఎక్కువగా యువత చిక్కుకుంటోంది. ఇటీవలే తేజు అనే ఇంజనీరింగ్ విద్యార్ధి బెట్టింగ్‌లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్ నగర శివార్లలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో జరిగింది. నిజాంపేటలో కొందరు ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎస్వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థావరంపై దాడి చేసి ఇద్దరు బూకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.85 లక్షలు, ఒక కారు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.