‘ఏలూరుకి చెందిన రామకృష్ణ నగరంలో ద్వితీయ శ్రేణి బుకీతో క్రికెట్ బెట్టింగ్ కట్టాడు. తన సెల్‌ఫోన్‌లో ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేసుకుని బెట్టింగులు కాస్తున్నాడు. రెండు, మూడు మ్యాచ్‌లలో డబ్బులు రావడంతో ఆసక్తి పెరిగింది. దీంతో జోరుగా పందేలు కాయడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే రూ.70 వేలు బుకీలకు బకాయిపడ్డాడు. బుకీలకు చెందిన రౌడీషీటర్లు అతని ఇంటికి వెళ్లి డబ్బుల కోసం వేధింపులకు దిగటంతో ఏం చేయాలో పాలుపోక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు రామకృష్ణ.’
‘భీమవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వెంకటేష్ గత ఐపీఎల్ సీజన్‌లో జోరుగా క్రికెట్ బెట్టింగులు కట్టాడు. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు చెప్పి డబ్బులు తెచ్చి బెట్టింగులు కాసాడు. మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి లక్షల్లో అప్పు అయ్యింది. బుకీలకు చెందిన వ్యక్తులు వెంకటేష్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను సైతం వేధించారు. బయటకు చెబితే పరువుపోతుందని వీరు అప్పులు చేసి కొంతమేర డబ్బులు కట్టారు.’
ఏలూరు టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగులకు వారధిగా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత లక్ష్యంగా బెట్టింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బంతి బంతికీ, ఓవర్ ఓవర్‌కు, మ్యాచ్ విజేతలు ఇలా పలురకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. క్రికెట్ బుకీల వలలో చిక్కుకుంటున్న యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగులు కడుతున్నారు.
ఎర చూపుతూ.. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ ఎరవేయడంతో యువత, విద్యార్థులు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ కేసుల్లో అత్యధికంగా పట్టుబడేది కూడా యువత, విద్యార్థులు కావడం విశేషం. బెట్టింగులకు అలవాటు పడిన యువత వ్యసనాలకు బానిసలై దొంగలుగానూ మారుతున్నారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, నిడదవోలు, కొవ్వూరుతోపాటు పల్లెల్లోనూ బెట్టింగ్ సంస్కృతి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం
- గత ఐపీఎల్ సీజన్‌లో ఏలూరు ప్రాంతంలో పోలీసులు బెట్టింగ్ కేసుల్లో 35 మంది వరకూ అదుపులోకి తీసుకుంటే వారిలో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు దాడులు చేసి 46 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 30 మందికి పైగా యువతే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది.
- పల్లెల్లోనూ విష సంస్కృతి : గ్రామాలకు సైతం బెట్టింగ్ మాఫియా విస్తరించడంతో చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులు సైతం వీరి బారిన పడుతున్నారు. కీలకమైన జట్లు తలపడితే బెట్టింగ్ హీట్ పెరిగిపోతుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో సుమారుగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైగానే బెట్టింగులు జరుగుతాయని అంచనా.
- ఆన్‌లైన్ యాప్‌లతో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధాన బుకీలు ప్రత్యేక యాప్‌లలో సెకండ్ స్టేజ్ బుకీలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. వాటికి అనుగుణంగా సెల్‌ఫోన్‌తోనే బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటికంటే రెండు, మూడు నిమిషాలు ముందుగానే ప్రత్యేక యాప్‌లలో మ్యాచ్ వివరాలు తెలిసిపోతూ ఉండటం గమనార్హం.
కఠిన చర్యలు
జిల్లాలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, జూదక్రీడలపై ప్రత్యేక నిఘా ఉంది. క్రికెట్ బెట్టింగుల పేరుతో యువత, విద్యార్థులను పెడదోవ పట్టించే అసాంఘిక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. బెట్టింగులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోనూ పటిష్ట చర్యలు చేపట్టాం.
– కె.నారాయణనాయక్, జిల్లా ఎస్పీ
ఓ కంట కనిపెట్టాలి
యువత, విద్యార్థులు సమాజాభివృద్ధికి కీలక వనరులు. వీరిని వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. విలాసాలకు అలవాటు పడితే పెడదారిపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది.
– డాక్టర్ హరికృష్ణ, జిల్లా ఆస్పత్రి వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment