బెట్టింగ్ కాస్కో.. తీస్కో ! | Betting On IPL Matches At Warangal | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ కాస్కో.. తీస్కో !

Published Wed, Sep 30 2020 10:19 AM | Last Updated on Wed, Sep 30 2020 10:19 AM

Betting On IPL Matches At Warangal - Sakshi

సాక్షి, భూపాలపల్లి అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్‌ ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. కరోనా నేపథ్యంతో పాటు ఎవరికీ చిక్కవద్దనే భావనతో ఎక్కడ కూడా గుమికూడకుండా అంతా ఆన్‌లైన్‌లో కానిచ్చేస్తున్నారు. ఉద్యోగాలు ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు ఉండడంతో పాటు కళాశాలలకు సెలవులు రావడంతో బెట్టింగ్‌ వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి, కాటారం, ములుగు, ఏటూరునాగారం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం.

మొదలు నుంచి చివరి వరకు
ఐపీఎల్‌ మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకు ప్రతీ అంశాన్ని బెట్టింగ్‌ బాబులు పందెం కాస్తూ జోరుగా దండుకున్నట్లు తెలుస్తోంది. పరుగుకు ఓ రేటు, బంతి బంతికి మరో రేటు, వికెట్, టాస్, విజేత ఇలా ప్రతీ అంశానికో రేటు నిర్ణయించినట్లు సమాచారం. రూ.వంద బెట్టింగ్‌ పెడితే గెలిచిన వారికి రూ.వెయ్యి చొప్పున అందిస్తుండగా.. కొందరు మాత్రమే గెలుస్తూ ఎక్కువ మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల యువకులు, విద్యార్థులను బడా వ్యాపారులు బుట్టలో వేసుకుని బెట్టింగ్‌ కడుతుండంతో రూ.లక్షల్లో చేతులు మారుతోంది.

జరుగుతోంది ఇలా..
వివిధ ప్రాంతాల్లో కొందరు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొంత మంది బుకీల సాయంతో కానిచ్చేస్తున్నారు. ఇంట్లో టీవీ ముందు కుర్చోని లేదా సెల్‌ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తూ బెట్టింగ్‌ కాస్తున్నారు. ఏ టీం ఎన్ని పరుగులు చేస్తుంది, ఏ జట్టు గెలుస్తుంది, ఏ బ్యాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు, ఏ బౌలర్‌ ఎన్ని  వికెట్లు తీస్తాడనే అంశాలపై బెట్టింగ్‌ సాగుతోంది. మ్యాచ్‌ అయిపోగానే ఎవరికి ఎంత ఇవ్వాలో లెక్క చూసుకుంటున్నారు. రూ.వంద మొదలు రూ.లక్షల వరకు బెట్టింగ్‌ సాగుతుండడంతో ప్రతీ ఆటకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు సమాచారం. (ఐపీఎల్‌ బెట్టింగ్‌: ఒక్కోమ్యాచ్‌పై లక్షల్లో)

అంతా కోడ్‌ భాష
క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడేవారు ఎక్కువగా సెల్‌ఫోన్, ఆన్‌లైన్‌ ద్వారానే చేస్తున్నారు. ఎవరితో బెట్టింగ్‌ చేయదలచుకుంటున్నారో వారితో ఆన్‌లైన్, సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి, పుచ్చుకుంటున్నారు. ఈ విషయం ఇతరులకు అర్థం కాకుండా కోడ్‌ భాష ఉపయోగిస్తున్నారు. కోడ్‌ ప్రకారం బెట్టింగ్‌ పెట్టి వారు గెలిస్తే డబ్బు చెల్లిస్తున్నారు. పోలీసులకు సైతం చిక్కవద్దనే భావనతో కోడ్‌ లాంగ్వేజీని ఎంచుకున్నట్లు సమాచారం. కాగా, బెట్టింగ్‌కు పాల్పడుతున్న సామాన్య, గ్రామీణ ప్రాంత ప్రజలు, యువకులు ఆర్థికంగా నష్టపోతూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. బెట్టింగ్‌ వల్ల బుకీలకు లాభం చేకూరుతుండగా సామాన్యుల జేబులు మాత్రం గుల్లవుతున్నాయి. 

బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..
కురవి: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. యువకులు, క్రికెట్‌ అభిమానులు ఆటను ఆస్వాదించాలే తప్ప డబ్బు సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్‌కు పాల్పడొద్దు. అదే జరిగితే కేసులు ఎదుర్కొంటూ జైలు పాలు కావల్సి వస్తుంది. అంతేకాకుండా జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. యువతీ, యువకులు, విద్యార్థులు బెట్టింగ్‌కు పాల్పడి చేటు కొనితెచ్చుకోవద్దు.  – జె.శంకర్‌రావు, ఎస్సై, కురవి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement