ఐపీఎల్‌ బెట్టింగ్‌: ఒక్కోమ్యాచ్‌పై లక్షల్లో | Online betting On IPL 2020 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌: ఒక్కోమ్యాచ్‌పై లక్షల్లో

Published Fri, Sep 25 2020 11:32 AM | Last Updated on Fri, Sep 25 2020 11:32 AM

Online betting On IPL 2020 - Sakshi

క్రీడా రంగంలో ప్రస్తుతం యువత ఎక్కువగా క్రికెట్‌పై మక్కువ చూపుతోంది. ఆటలంటే అందరికీ అభిమానమే అయినా.. క్రికెట్‌ అంటే చిన్న పిల్లవాడు మొదలు.. పెద్దల వరకు మోజు లేని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఈ నెల 19న ప్రారంభమైన ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌పై యువత అప్పుడే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు మొదలుపెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఒకచోట గుమిగూడి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరి కొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెడుతున్నారు. పల్లె మొదలు పట్టణాల వరకు యువత టీవీలు, సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోయి.. ఈ విష సంస్కృతిలో కూరుకుపోతున్నారు. రోజు ఒక్కోమ్యాచ్‌పై సుమారు రూ. వెయ్యి నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో సాగుతోందని సమాచారం. 

ప్రతిదీ వ్యాపారమే.. 
యువత ఇష్టాన్ని.. బెట్టింగ్‌ సంస్కృతిని ఆసరా చేసుకుంటున్న కొందరు క్రికెట్‌తో వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బుకీలుగా మారుతున్నారు. రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి అందినకాడికి దండుకుంటున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడుతున్నారు. అదే సమయంలో మందు పార్టీలు సైతం చేసుకుంటూ తాగిన మైకంలో బెట్టింగ్‌లపై మోజు పెంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కోబాల్‌కు బెట్టింగ్‌ పెట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పైగా అప్పుల పాలు సైతం అవుతున్నారు. ప్రధానంగా గూగుల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉన్నందున సెల్‌ఫోన్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుకుంటున్నారు. గతంలో జిల్లాకేంద్రంలో ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి. తాజాగా ఈనెల 19న ప్రారంభమైన ఐపీఎల్‌ కు కూడా క్రికెట్‌ బెట్టింగ్‌లు మొదలయ్యాయి. మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్లపై గెలుపు ఓటములపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు. ఇదిరోజు సాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా క్రికెట్‌ బెట్టింగులు రూ.లక్షల్లో సాగుతున్నట్లు సమాచారం.

కోడ్‌ భాషతో..
బుకీల వద్ద బెట్టింగులకు కోడ్‌ భాష వాడుతున్నారు. ఒకసారి రిజిస్టర్‌ అయిన నంబర్‌ నుంచి ఫోన్‌వస్తేనే బెట్టింగ్‌ వ్యవహారంపై మాట్లాడుతారు. గతంలో బెట్టింగ్‌ రాయుళ్లు వాడే కోడ్‌ భాష లెగ్‌ అని, ఈటింగ్‌ అనే కోడ్‌ భాషను వాడారు. ఎవరు ఎన్ని లెగ్‌లు తీసుకుంటే అన్ని లెగ్గులకు లెక్కగట్టి చెల్లించాల్సి ఉంటుంది. లెగ్‌కు ఇంత అని ముందే రేటు ఫిక్స్‌ చేస్తారు. బుకీల ద్వారా బెట్టింగ్‌లు పెడితే మ్యాచ్‌ జరగడానికి ముందే లావాదేవీలు జరుపుతారు.

కలిసొస్తున్న లాక్‌డౌన్‌
ఈసారి ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లకు లాక్‌డౌన్‌ కలిసొచ్చినట్లు ఉంది. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో చాలామంది యువత ఇంట్లోనే ఉంటోంది. దీంతో రోజంతా టీవీలు, సెల్‌ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఇదే సమయంలో ఐపీఎల్‌ ప్రారంభం కావడంతో బెట్టింగుల వైపు మొగ్గు చూపుతున్నారు. హోటళ్లు, బిర్యాణి సెంటర్లలో కూర్చుండే అవకాశం లేకపోవడంతో యువత నివాస గృహాలు, బహిరంగ ప్రదేశాలను ఎంచుకుని  బెట్టింగ్‌ చేస్తున్నారు. జిల్లాలోని కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని శ్రీరాంపూర్, సీసీసీ, జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్, రాముని చెరువు పార్క్, హైటెక్‌ సిటీ, లక్సెట్టిపేట,  మందమర్రి, బెల్లంపల్లి వంటి పట్టణాల్లో ఇప్పటికే బెట్టింగ్‌ వ్యవహారం జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. 

తల్లిదండ్రులు దృష్టి సారించాలి
యువత రానురాను విష వలయంలో చిక్కుకుంటోంది. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రారంబైనందున యువత బెట్టింగ్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీస్‌ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్నటివరకు పోలీస్‌ అధికారులందరూ కరోనా కట్టడికి పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం అంతగా లేకపోవడంతో పోలీస్‌ అధికారులకు కొంత విరామం దొరికినట్లు అయ్యింది. ఇదే సమయంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు జిల్లాలో  జోరుగానే సాగుతున్నాయన్న సమాచారం ఉంది. యువత బెట్టింగ్‌ విషవలయంలో చిక్కకముందే  ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

విష సంస్కృతిలో యువత..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల ద్వారా యువత పెడదారి పడుతోంది. గతంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లు జరిపిన వారే మళ్లీ ఈసారి రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ వార్డులో ఇంట్లో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా సాగుతోందన్న సమాచారం మేరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలామంది యువకులు ఉండగా.. మంచిర్యాల జిల్లాకేంద్రంలో పేరు మోసిన వ్యాపారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో తల్లితండ్రులకు తెలియకుండా అవసరాల నిమిత్తం డబ్బులు అడుక్కుని క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్ప డుతున్నారు. అవి అయిపోయాక స్నేహితుల వద్ద, బెట్టింగులో ఉన్న కొందరి పెద్ద మనుషుల వద్ద అధిక వడ్డీకి తీసుకుంటున్నారంటే అతిశయోక్తికాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement