- ముగ్గురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
- గాంధీ గ్రామం సోలాపూరమ్మవారి ఉత్సవంలో ఘటన
చోడవరం, న్యూస్‌లైన్: హుషారుగా జిల్లా స్థాయి గుర్రపు పందాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఉత్సాహంగా పోటీలో పరుగులు తీస్తున్న గుర్రాల మధ్యలోకి కొందరు దూసుకురావడంతో అపశ్రుతి చోటుచేసుకుంది. గుర్రాల కింద పడి ముగ్గురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. చోడవరంమండలం గాంధీ గ్రామంలో ఆదివారం సోలాపూర్ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభంగా జరిగింది. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం ఈ ఆలయం సమీపంలో పొలాల్లో జిల్లా స్థాయి గుర్రపు, యడ్ల బళ్ల పోటీలు నిర్వహించారు. ముందు యడ్ల బళ్ల పోటీలు జరగగా, గుర్రపు పోటీలు నిర్వహించే సమయానికి కొంత పొద్దుపోయిన సమయం అయ్యింది. అయినా పోటీ జరిగే ప్రదేశంలో భారీగా లైట్లు ఏర్పాటు చేయడంతో గుర్రపు పోటీలు మంచి రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. గుర్రాలు పోటీ పడి పరుగెడుతున్న సమయంలో ఒక్కసారిగా కొందరు మధ్యలో అటుగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఇంతలో అప్పటికే వేగంగా దూసుకొస్తున్న గుర్రాల కింద కొందరు పడిపోయారు.
ఈ ప్రమాదంలో గాంధీ గ్రామం దూదిరామయ్య(70), ఆరిపాక సన్యాసి(60), ఎస్.పవన్(25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో దూది రామయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దర్నీ చోడవరం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. అంతా అహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా జరుగుతున్న పోటీల మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అనంతరం యథావిధిగా పోటీలు నిర్వహించారు.