కోట్లలో పందాలు.. లక్షల్లో లెక్కలు
♦ గుర్రపు పందాలలో రూ.కోట్లు పన్ను ఎగ్గొడుతున్న బుకీలు
♦ వందల కోట్ల వ్యాపారం చేస్తూ నెల నెలా లక్షల్లో లెక్కలు
♦ పన్ను రూపేణా నెలకు రేస్‌క్లబ్ చెల్లిస్తున్నది రూ. 5 కోట్లు
♦ ఎగ్గొడుతున్న మొత్తం అంతకు పదింతలకుపైనే!
♦ స్టింగ్ ఆపరేషన్ చేసి గుట్టు రట్టు చేసిన వాణిజ్యపన్నుల శాఖ
♦ నిజాం నాటి ‘రేస్‌కోర్స్’ చట్టంలో మార్పులకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న గుర్రపు పందాలతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.. టికెట్లను పేరుకే రూ.50 నుంచి రూ.500 వరకు అమ్ముతూ వేలు, లక్షల రూపాయల్లో పందాలు కాస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొడుతున్నారు. ఇదంతా ప్రత్యేక లెసైన్సుతో పందాలు నిర్వహిస్తున్న 23 మంది బుకీల మాయాజాలం. రేస్‌క్లబ్ ద్వారా టికెట్లు కొని కాసే పందాలు సక్రమంగానే సాగుతుండగా... బుకీల ద్వారా జరిగే పందాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. వారు ప్రత్యేకంగా నెలకు కోట్ల రూపాయల్లో పందాలు కాస్తూ రేస్‌కోర్సుకు లక్షల్లో లెక్కలు చూపుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాన్ని గుర్తించింది. ‘బడా వ్యక్తులు’ బుకీల ద్వారా రూ.కోట్లలో గుర్రపు పందాలు ఆడుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నిజాం కాలం నాటి ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్-1939’లో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
మూడు రకాల పన్నులు..కోట్లల్లో లావాదేవీలు
మలక్‌పేటలోని రేస్‌క్లబ్‌లో గుర్రాలు పరుగెడుతుంటే వాటిని చూస్తూ పందాలు కాయడం ఒక రకం బెట్టింగ్. దేశంలోని ఇతర ఏడు నగరాల్లో రేస్‌లు జరుగుతుంటే వాటిని ‘లైవ్ టెలికాస్ట్’ ద్వారా చూస్తూ కాసే ‘ఇంటర్‌వీన్ బెట్టింగ్’ రెండోది. ఇవి కాక ‘ఏపీ గేమింగ్ యాక్ట్ 1974’ కింద హైదరాబాద్‌లో చలికాలం, వర్షాకాలంలలో జరిగే రేసులకు జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఈ పందాలపై మూడు రకాల పన్నులు వసూలవుతాయి. రూ.10, రూ.100 విలువైన ప్రవేశ టికెట్ల మీద 30 శాతం పన్ను ఉంటుంది. రూ.500 వరకు లభించే పందె ం టికెట్లపై 10 శాతం పన్ను లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే రేస్‌కోర్స్‌లపై జరిగే ఇంటర్‌వీన్ బెట్టింగ్ మీద 12 శాతం పన్ను వస్తుంది. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా జరిగే ఈ ప్రక్రియలోనే సర్కారుకు నెలకు రూ.5 కోట్ల మేర పన్ను లభిస్తుంది. అయితే ఈ బెట్టింగ్‌లలోనే నల్లధనం చెలామణి అయ్యే మరో కోణమే బుకీలతో సాగే పందాలు.
గుట్టు రట్టయిందిలా!
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్ రేవతి రోహిణిల పర్యవేక్షణలో 70 మంది అధికారులు సెప్టెంబర్ 4న పందెం రాయుళ్లుగా రేస్‌కోర్సుకు వెళ్లారు. ప్రభుత్వ అనుమతితో సర్కారు సొమ్ము సుమారు రూ.2లక్షలు వెచ్చించి బుకీల వద్ద పందె ం టికెట్లు కొని రేసు ఆడారు. అధికారులు రూ.500 టికెట్ కొంటే రూ.50 విలువతో ఉన్న టికెట్ ఇచ్చారు. పందెం ముగిసిన తరువాత అధికారులు 23 మంది బుకీలను లెక్కలు అడిగితే రూ.7 లక్షలు చూపించారు. వారి కౌంటర్లపై దాడులు జరపగా రూ.50 లక్షల పైచిలుకు సొమ్ము లభించింది.
బుకీలు ఇలా దొంగ లెక్కలతో 2014-15లో ప్రభుత్వానికి చెల్లించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. వీరి వాస్తవ లావాదేవీల ప్రకారం నెలకు రూ. 5 కోట్లపైనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ రేస్‌కోర్స్, బెట్టింగ్ యాక్ట్‌ను సమూలంగా మార్చాలని నిర్ణయించింది. బుకీలపై వాణిజ్యపన్నుల శాఖకు పూర్తిస్థాయి అజమాయిషీ ఉండేలా చట్టం రూపొందిస్తోంది. రేస్‌కోర్సుతో సంబంధం లేకుండా బుకీలు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్, ట్యాక్సేషన్ జరిపేలా మార్పులు చేసింది. బుకీల ఆర్థిక లావాదేవీలపై నిఘా, రిటర్న్స్ ఫైలింగ్ ఉండేలా సవరణలు చేసింది. ఈ మేరకు వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడుతోంది.
బుకీల మాయాజాలం
మలక్‌పేట రేస్‌క్లబ్ నిర్వహించే గుర్రపు పందాలలో 40 ఏళ్ల క్రితమే ప్రైవేటు బుకీలు ప్రవేశించారు. అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి కొన్నేళ్లుగా ప్రభుత్వం 23 మంది బుకీలకు పందాల నిర్వహ ణ లెసైన్సులు జారీ చేసింది. ఈ బుకీలే ఏటా లెసైన్సులను రెన్యూవల్ చేయించుకుంటున్నారు. వీరికి రేస్‌క్లబ్‌లోనే ప్రత్యేకంగా కౌంటర్లు ఉంటాయి. నిబంధనల ప్రకారమైతే వీరి వద్ద టికెట్లు కొని గుర్రాలపై పందెం కాసినా.. రేస్‌కోర్సు లెక్కలోకే వెళుతుంది. వీరికి కమీషన్ మాత్రం వస్తుంది. కానీ బుకీలు ఆడే ఆటకు, రేస్‌కోర్సుకు చూపించే ‘లెక్క’లకు కోట్లలో తేడా ఉంటుంది. రూ.500 పందెం కాస్తే రికార్డుల్లో రూ. 50గా ఉంటుంది. రూ.500కు మించి అధికారికంగా పందాలు కాయడానికి వీలు లేకపోవ డంతో దాన్ని ఆసరాగా చేసుకొని బుకీలు లావాదేవీలు సాగిస్తారు. పందెం లెక్కలు బుకీలకు, కాసిన వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. క్రికెట్ బెట్టింగ్ తరహాలో ఇక్కడే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.