సంభాల్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది.
పాలరాతి నిర్మాణాలు
సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని కనుగొంది. దానిని 1978లో మూసివేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. ఈ సందర్భంగా సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా మాట్లాడుతూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఈ సైట్‌లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ సైట్ గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతో పాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.
అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు
బిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈ
మెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.
మెట్ల బావి అంటే ఏమిటి?
మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్లబావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్లబావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
#WATCH | Uttar Pradesh | Visuals from the Chandausi area of Sambhal where excavation work was carried out yesterday at an age-old Baori by the Sambhal administration pic.twitter.com/ILqA8t3WPW
— ANI (@ANI) December 23, 2024
తీర్థయాత్రా స్థలంగా సంభాల్
సంభాల్‌కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.
పాత ఫైళ్ల వెలికితీత
సంభాల్‌కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్‌లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ప్రభుత్వం వారికి సూచించింది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు
Comments
Please login to add a commentAdd a comment