మరో ఆలయం కూల్చివేత
గుంటూరు రూరల్ : భక్తుల మనోభావాలతో సర్కారు ఇంకా ఆటలాడుకుంటూనే ఉంది. ఆలయాల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. మొన్నటివరకు విజయవాడలో కొనసాగిన ప్రక్రియ ఇప్పుడు గుంటూరులో జరుగుతోంది. గోరంట్ల గ్రామంలో దాదాపు 21 సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న కనకదుర్గమ్మ ఆలయాన్ని గురువారం మున్సిపల్ అధికారులు తొలగించారు. అమరావతి రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందంటూ ఆలయాన్ని కూల్చివేశారు. నగరంలోని లాడ్జి సెంటర్ నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. సర్వే సందర్భంగా ఆలయ ముందుభాగాన్ని మాత్రమే తొలగిస్తామని చెప్పిన అధికారులు ఆ తర్వాత మొత్తం తొలగించారని నిర్వాహకులు తురకా భూపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఆలయాన్ని తొలగించారని ఆలయ కమిటీ సభ్యులు విమర్శిస్తున్నారు. గ్రామస్తులందరితో పూజలందుకుంటున్న తల్లికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని కూల్చివేయటంతో ఒక విగ్రహం ధ్వంసమైందని, మిగిలిన విగ్రహాలను గ్రామంలోని చిన్న రేకుల షెడ్డులో ఏర్పాటు చేశామని వారు వివరించారు.
పనుల్లో భాగంగానే తొలగించాం...
రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఆలయాన్ని తొలగించాల్సి వచ్చిందని నగరపాలక సంస్థ డీసీపీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయం రోడ్డుకు మధ్యలో అడ్డుగా ఉండటంతో ముందే నిర్వాహకులకు తెలిపామన్నారు.