విజయవాడ టు తిరుపతి, శ్రీశైలానికి హెలికాప్టర్
- సర్వీసులు నడపడానికి ముందుకొచ్చిన సుమిత్ ఏవియేషన్
- హెలికాప్టర్ ద్వారా తిరుమల దర్శనం కోసం వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లదలిచిన వారికి త్వరలో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా కొద్ది రోజుల్లోనే విజయవాడ నుంచి తిరుపతి, శ్రీశైలం మధ్య హెలిక్టాపర్ రాకపోకలు మొదలు కాబోతున్నారుు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు విదేశీ యాత్రికులను ఎక్కువగా ఆకర్షించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు హెలికాప్టర్ సర్వీసులను నడపడానికి ఢిల్లీకి చెందిన సుమిత్ ఏవియేషన్ సంస్థ ముందుకొచ్చింది. తిరుపతిసహా మిగిలిన పుణ్యక్షేత్రాల వద్ద ప్రభుత్వం హెలిప్యాడ్ వసతిని కల్పించడంతోపాటు హెలికాప్టర్ ద్వారా వచ్చే యాత్రికులకు తిరుమలలో నివాస వసతి, దైవ దర్శనం ఏర్పాట్లు కల్పించాలంటూ సుమిత్ ఏవియేషన్ యజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఏవియేషన్ సంస్థ ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో తొలి దశలో తిరుపతి, శ్రీశైలంలకు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది.
హెలిప్యాడ్ల ఏర్పాటుకు ఆదేశాలు
సుమిత్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ రాకపోకలకు ఉపయోగించుకోవడానికి ప్రత్యేకంగా విజయవాడ, తిరుపతి, శ్రీశైలంలలో యుద్ధప్రాతిపదికన హెలిప్యాడ్‌ల నిర్మాణానికి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.