ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు(గురువారం) కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం చెలరేగింది.
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనను తొలగించుకుంటూ విద్యార్థులు కమిషనర్ కార్యాలయం వైపు కదిలారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీసీఎస్ ప్రిలిమ్స్ 2024, ఆర్/ఏఆర్‌ఓ ప్రిలిమ్స్ 2023 పరీక్షలను రెండు రోజుల్లో రెండు షిఫ్టులలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు సోమవారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రయాగ్‌రాజ్‌లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట సోమవారం నుంచి వేలాది మంది విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని కమిషన్ కార్యాలయం వద్దనున్న మూడు రోడ్ల కూడలిలో విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బారికేడ్లతో మూడు రహదారులను మూసివేసి భద్రతను పెంచారు. కాగా కొందరు పోలీసులు రాత్రిపూట సాధారణ దుస్తులలో వచ్చి కొంతమంది విద్యార్థులను తీసుకెళ్లారనే ఆరోపణలు వినివస్తున్నాయి. ఈరోజు(గురువారం) నిరసన స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్న కూడలి వద్ద వేలాది మంది విద్యార్థులు గుమిగూడారు. వీరిలో కొందరు కమిషన్ కార్యాలయం వైపు వెళ్లకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
కాగా బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేట్ నంబర్ టూ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులతో మాట్లాడేందుకు జిల్లా డీఎం రవీంద్ర కుమార్, పోలీస్ కమిషనర్ తరుణ్ గబా, కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ వచ్చారు. డిఎం రవీంద్రకుమార్ గంటపాటు విద్యార్థులతో మాట్లాడి నిరసనను విరమించేలా వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ నిరసన కొనసాగిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా?
Comments
Please login to add a commentAdd a comment