- దామునాపల్లిలో జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు
- ఎడ్ల విజేత వల్లంపూడి...గుర్రపు విజేత చోడవరం
చోడవరం రూరల్ : చోడవరం మండలం దామునాపల్లి గ్రామంలో గురువారం జిల్లా స్థాయి ఎడ్ల, గుర్రపు పందాలు ఉత్సాహంగా సాగాయి. ఇటీవల కాలంలో పోటీలు ఎక్కడా లేకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి పలువురు ఔత్సాహికులు ఈ పోటీలకు తరలివచ్చారు. ప్రధానంగా ఎడ్ల పందాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తీవ్రమైన ఎండ కారణంగా పోటీలను ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు.
వడ్లపూడికి చెందిన ఎడ్లు ప్రథమ బహుమతి సాధించగా చుక్కపల్లి, లెక్కలవానిపాలెం, నర్సయ్యపేట, కొత్తపెంట ఎడ్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. అలాగే, జిల్లా స్థాయి గుర్రపు పందాల్లో చోడవరం పట్టణానికి చెందిన ఆర్.శ్రీను ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో వాడచీపురుపల్లికి చెందిన గొర్లి విజయ్‌కుమార్, మూడో స్థానంలో నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ, నాల్గో స్థానంలో చినయాతపాలెంకు చెందిన వి.యశ్వంత్ నిలిచారు.
కాగా, ఐదో స్థానాన్ని కూడా చోడవరానికే చెందిన ఆర్.శ్రీను గుర్రం దక్కించుకుంది. రెండు పోటీల్లోనూ విజేతలకు వరుసగా రూ.5వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి బహుమతిగా అందించారు. గ్రామదేవత పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పోటీలు చూసేందుకు చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.