law amendment
-
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
క్రీడాకారులకు సర్కారీ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభా వంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా తెలంగాణ(పబ్లిక్ సర్వీస్ నియామ కాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ) చట్ట సవరణ బిల్లును శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజీ సర్వీస్ కమిషన్, ఏదైనా కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ, పత్రికల్లో బహిరంగ ప్రకటనల ద్వారా మినహా ఇతర పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీపై ఈ చట్టం ద్వారా నిషేధం విధించారు.కారుణ్య నియామకాలతో పాటు పోలీసు కాల్పులు/ బాంబు పేలుళ్లు/ తీవ్రవాదుల హింస బాధితులు, అత్యాచారాలకు గురైన ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై క్రీడాకారులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. మరో రెండు బిల్లులకు ఆమోదం..: జూనియర్ సివిల్ జడ్జీల ద్రవ్య అధికార పరిధిని రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలకు కుదించడానికి ప్రతిపాదించిన తెలంగాణ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సంక్షిప్తనామాన్ని ‘టీఎస్’నుంచి ‘టీజీ’కి మార్చుతూ ప్రతిపాదించిన కొత్త చట్టం బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
గుర్బానీ ప్రసారాలు ఉచితం
చండీగఢ్: సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ఇకపై ఉచితంగా ప్రఖ్యాత స్వర్ణదేవాలయం నుంచి ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన బ్రిటిష్‌కాలంనాటి చట్టానికి చేసిన సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. మంగళవారం శాసనసభలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. ఇన్నాళ్లూ గుర్బానీని రాష్ట్రంలో శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానెల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్జీపీసీ) మండిపడింది. ‘ఆ చట్టాన్ని పార్లమెంట్ చేసింది. దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. సిక్కుల మత సంబంధ వ్యవహారాలకు ఆప్ ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘చట్ట పరిధిపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఇది రాష్ట్ర పరిధిలోనిది’ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ గుర్బానీ వినిపించేటపుడు అడ్వర్ట్టైజ్మెంట్లు ఉండకూడదనే ఉద్దేశంతో∙ప్రత్యక్షంగా ఉచితంగా ఆడియో, వీడియో ప్రసారాలు చేస్తున్నాం’ అని ప్రభుత్వం ప్రకటించింది. పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. -
గవర్నర్‌తో విభేదాలు.. మమత సర్కార్ కీలక నిర్ణయం
కోల్‌కత: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్కడ్, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్కడ్ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది. చదవండి👇 మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే! -
సినిమాటోగ్రఫీ చట్టం సవరణ ప్రతిపాదనలకు నిరసన
ముంబై: సినిమాటోగ్రఫీ చట్ట సవరణలకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని ఆరు ట్రేడ్ ఫిల్మ్ అసోసియేషన్స్ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించాయి. సినిమాటోగ్రఫీ చట్ట సవరణల బిల్లు–2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని కోరుతూ ప్రభుత్వం జూన్ 18న ప్రకటన జారీ చేసింది. సినిమా పైరసీని నేరంగా పరిగణిస్తూ జైలుశిక్షతో పాటు జరిమానా విధించడం, సర్టిఫికేషన్‌కు కాల వ్యవధి, సర్టిఫికెట్ పొందిన సినిమాపై ఫిర్యాదులొస్తే మళ్లీ సర్టిఫికేషన్(రీసర్టిఫికేషన్) జరిపేందుకు కేంద్రానికి అధికారం.. తదితర ప్రతిపాదనలను ఆ ముసాయిదాలో పొందుపర్చారు. రీసర్టిఫికేషన్ ప్రతిపాదనను సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ పలువురు సినీ ప్రముఖులు సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు. -
చెక్ బౌన్స్ సత్వర పరిష్కారానికి సుప్రీం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. 1973, సీఆర్పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం
అయిదేళ్ల ఆ చిన్నారి పేరు రెండు వారాల కిందట ఆసీస్ ప్రసార మాధ్యమాల్లో మార్మోగింది. కారణం.. ఓ ప్రాణాంతక వ్యాధిపై పోరుకోసం చేయనున్న చట్ట సవరణ ప్రతిపాదన బిల్లుకు ఆ చిన్నారి పేరు పెట్టడమే. దీనిని ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్ హంట్ ఏకంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఆ చట్టం మావె లా.. ఆ చిన్నారి పేరు మావె హుడ్. విప్లవాత్మక చట్ట సవరణకు ఆ చిట్టి తల్లి పేరు పెట్టడం వెనక ఓ విషాదం దాగి ఉంది. సారా హుడ్, జోయెల్ హుడ్ దంపతుల మూడో కూతురు మావె హుడ్. ఐదు నెలల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది మావెలో. వైద్యుల పర్యవేక్షణ, చికిత్సతో కోలుకున్నప్పటికీ ఆ తర్వాతా అనేక సమస్యలు వెంటాడాయి. 18 నెలల వయసులో చిన్నారి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈసారి పాపను పరీక్షించిన వైద్యులు.. మైటోకాండ్రియా లోపంతో వచ్చే లీ సిండ్రోమ్‌కు గురైనట్లు గుర్తించారు. పాపను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ, అప్పటికప్పుడు మాత్రలతో వ్యాధి తీవ్రతను తగ్గించి, మరణాన్ని వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదన్నారు డాక్టర్లు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ పాప పరిస్థితికి తల్లఢిల్లినా, పాపను అప్రమత్తంగా చూసుకోసాగారు. ఇటీవల ఈ విషయం పత్రికల ద్వారా ఆ దేశ ఆరోగ్య మంత్రి గ్రెగ్‌కు చేరింది. మావె పడుతున్న కష్టాలను తెలుసుకున్న ఆయన దేశంలో మరే చిన్నారికీ ఇలాంటి అవస్థ రాకూడదంటే ఏం చేయాలో చెప్పాలని వైద్యులనడిగారు. డీఎన్ఏ మార్పిడి ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చని వాళ్లు చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే.. తల్లి గర్భిణిగా ఉన్నప్పడు చిన్నారిలోని ఆమె డీఎన్ఏ స్థానంలో మరొకరి నాణ్యమైన డీఎన్ఏను ఐవీఎఫ్ పద్ధతిలో ప్రవేశపెడితే ప్రాణాంతక వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చని వివరించారు. అయితే, ఇది కష్టమైన పని. ఎందుకంటే డీఎన్ఏ మార్పిడిపై ఆసీస్‌లో నిషేధం ఉంది. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు గ్రెగ్ హంట్ తీర్మానించాడు. అందులో భాగంగానే చట్ట సవరణ కోరుతూ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు, ఆ బిల్లుకు మావె పేరు పెట్టాడు. నిజానికి ఆస్ట్రేలియాలో ఏటా కనీసం 56 మంది చిన్నారులు మైటోకాండ్రియా డిసీజ్‌తో జన్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో చాలామంది ఐదేళ్లలోపే మరణిస్తున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించి, పసిప్రాణాలను కాపాడడం, తల్లిదండ్రుల కడుపుకోతను అడ్డుకోవాలనే తన ప్రయత్నానికి మనఃస్ఫూర్తిగా సహకరించాలని గ్రెగ్ హంట్ పార్లమెంట్లో విపక్ష సభ్యులందరినీ కోరాడు. ఈ చట్ట సవరణకు ఆమోదం లభిస్తే ఆ తరువాత ఆస్ట్రేలియాలో మైటోకాండ్రియాతో చిన్నారులు మరణించడమేనేది ఉండకపోవచ్చు. మైటోకాండ్రియా డిసీజ్ అంటే... మనిషిని పట్టి పీడించే ప్రాణాంతక వ్యాధుల్లో ఇదొకటి. మన శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందనే విషయం తెలిసిందే కదా. అయితే, ఆహారం జీర్ణమై శక్తిగా రూపొందడంలో కీలకంగా వ్యవహరించే పాత్ర మన శరీరంలోని ఉండే కణాల్లోని మైటోకాండ్రియాదే. ఏ కారణం వల్ల అయినా మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోయినా, నిర్జీవమైనా మన శరీరానికి తగిన శక్తి ఆహారం నుంచి అందదు. ఫలితంగా రకరకాల రుగ్మతలు వస్తాయి. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఫెయిల్యూర్.. అంటే అవయవం పనిచేయకపోవడం. ఇది మరణానికి దారి తీస్తుంది. అలాగే గుండెపోటు, చెవుడు, దృష్టిలోపం, నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటివీ సంభవిస్తాయి. జన్యులోపం వల్లో, వంశపారంపర్యంగానో, జీవన శైలిలో మార్పుల వల్లో వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేలోగా ఎప్పుడైనా సరే ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. -
పెట్రోల్, డీజిల్‌పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
చట్ట సవరణకు కేబినెట్ నోట్లు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: పునర్విభజన చట్ట ప్రకారం ఏపీ, తెలంగాణలలో వివిధ విద్యా, పరిశోధన సంస్థల ఏర్పాటుకు చేయాల్సిన చట్ట సవరణకు కేబినెట్ నోట్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. విభజన హామీల అమలు పై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో ఆ శాఖ కౌంటర్ దాఖలు చేసింది. చట్ట ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థలు, ప్రస్తుతం వాటి పరిస్థితి వివరాలను అఫిడవిట్లో పొందుపరిచింది. ఏపీ, తెలంగాణల్లో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీ య వర్సిటీల ఏర్పాటుకు సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్–2009, సవరణ బిల్లు–2016 సవరణకు సం బంధించి కేబినెట్ నోట్లు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం–2009ని సవరించే వరకు అనంతపురం సెంట్రల్ వర్సిటీకి చట్టపరమైన హోదా కల్పించేందుకు సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్–1860 కింద సొసైటీ ఏర్పాటు చేసి తాత్కాలిక తరగతుల ప్రారంభానికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ మొదటిదశ నిర్మాణానికి రూ.420 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని పేర్కొంది. తిరుపతి ఐఐటీని 2015–16 విద్యాసంవత్సరంతో రేణిగుంటలోని చదలవాడ వెంకట సుబ్బ య్య ఇంజనీరింగ్ కాలేజీలో తాత్కాలిక తరగతుల్లో ప్రారంభించామని, తిరుపతికి సమీపంలోని మేర్లపాకలో శాశ్వత ప్రాంగణం నిర్మాణానికి రూ.1,074 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ అంగీకరించిందని తెలిపింది. తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంస్థను తాత్కాలికంగా శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభించి రూ.109 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది. నిట్ తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, రెగ్యులర్ డైరెక్టర్ నియామకంతోపాటు 2015లో వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతులు ప్రారంభించామని, శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.460 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. విశాఖ ఐఐఎంను ఆంధ్ర వర్సిటీలో తాత్కాలికంగా ప్రారంభించామని తెలిపింది. కర్నూలు జిల్లా జగన్నాథగట్టు దిన్నెదేవరపాడులో రూ.297 కోట్ల నిధులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మానుఫ్యాక్చరింగ్ సంస్థ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆర్థిక వ్యయ కమిటీ ఆమోదించిందని, కేబినెట్ ఆమోదానికి ముసాయిదా బిల్లు ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉందని తెలిపింది. -
పెద్ద కారు ఇక ప్రియం!
♦ జీఎస్టీ సెస్సు 25 శాతానికి పెంపు... ♦ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం ♦ ఆర్డినెన్స్ ద్వారా జీఎస్టీ చట్ట సవరణ న్యూఢిల్లీ: పెద్ద కార్లపై సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి గరిష్టంగా 25 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో మధ్య, పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ మొదలైన వాటి రేట్లు పెరగనున్నాయి. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం జూలై 1న అమల్లోకి వచ్చినప్పుడు పన్నుల శ్లాబుల్లో వ్యత్యాసాల కారణంగా లగ్జరీ కార్ల ధరలు సుమారు 3 శాతం దాకా తగ్గగా.. సాధారణంగా వినియోగించే పలు ఉత్పత్తుల రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యత్యాసాలను సరిచేసే దిశగా గరిష్ట సెస్సు రేటును పెంచేందుకు జీఎస్టీ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తగు సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. వివిధ వాహనాలపై వాస్తవ సెస్సు ఎంత ఉండాలి, ఎప్పట్నుంచి అమలవుతుంది అన్నది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని వివరించారు. సెప్టెంబర్ 9న జైట్లీ సారధ్యంలో ఈ కౌన్సిల్ హైదరాబాద్‌లో భేటీ కానుంది. ప్రస్తుతం 28% జీఎస్టీకి అదనంగా పెద్ద కార్లపై 15% దాకా సెస్సు ఉంటోంది. ఇదే 25%కి పెరగనుంది. సామాన్యులకే ప్రయోజనం కలగాలి .. విలాసవంతమైన ఉత్పత్తులు ధరలు తగ్గేలాగా, నిత్యావసరాల ధరలు పెరిగేలా చేయడమనేది పన్ను విధాన ప్రధానోద్దేశం కాదని జైట్లీ స్పష్టం చేశారు. ‘ పన్ను ప్రయోజనం అనేది సామాన్యులకు ఉపయోగించే ఉత్పత్తులకు ఉండాలే తప్ప లగ్జరీ ఉత్పత్తులకు కాదు. రూ. 1 కోటి పెట్టి కారు కొంటున్న వారు రూ. 1.20 కోట్లు కూడా వెచ్చించి కొనుక్కోగలరు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సిగరెట్స్పైనా సెస్సును పెంచడంపై స్పందిస్తూ.. సిగరెట్లను చౌకగా అందించడం జీఎస్టీ లక్ష్యం కాదని జైట్లీ స్పష్టం చేశారు. ‘ఒకవేళ అలాగే చేసి ఉంటే మతిలేని వ్యవహారంగా ఉండేది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. లగ్జరీ కేటగిరీ కింద అత్యధిక ఎక్సైజ్ సుంకం, వ్యాట్ వర్తించే కార్లపై తప్ప మిగతా వాటిపై రేటు పెంచే యోచనేదీ లేదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. వృద్ధికి ప్రతికూలం: వాహన పరిశ్రమ లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంచాలన్న ప్రతిపాదన.. ఈ విభాగం వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మెర్సిడెస్–బెంజ్, ఆడి, జేఎల్ఆర్ తదితర ఆటోమొబైల్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘సెస్సు పెంపును హడావిడిగా అమలు చేయాలన్న‘ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. కనీసం ఆరు నెలలైనా ఆగి జీఎస్టీ ప్రభావంపై స్పష్టత వచ్చాక సమీక్ష జరిపి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాయి. తగ్గి.. పెరిగిన పన్నులు... జీఎస్టీ అమల్లోకి రాక మునుపు పెద్ద కార్లపై సేల్స్ ట్యాక్స్, సెస్ తదితరాలు కలిసి పన్ను రేటు 52–54.72% శ్రేణిలో ఉండేది. దీనికి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, ఆక్ట్రాయ్ మొదలైన వాటి రూపంలో అదనంగా మరో 2.5 శాతం వర్తించేది. అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం పన్ను స్థాయి సుమారు 43%కి (28 శాతం జీఎస్టీతో 15% సెస్ కలిపి) దిగి వచ్చింది. దీంతో, ఎస్‌యూవీల ధరలు కూడా సుమారు రూ. 1–3 లక్షల మేర, కొన్ని లగ్జరీ కార్ల రేట్లు ఏకంగా రూ. 10 లక్షల దాకా కూడా దిగొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సెస్సును పెంచాలని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్టు 5న నిర్ణయించింది. ఇలా సెస్సుల రూపంలో వసూలైన మొత్తాన్ని జీఎస్టీ అమలుతో ఆదాయం నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారం కింద చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగించనుంది. -
డిసెంబర్‌లోపే ఐటీ రిటర్నులు
► లేకుంటే పన్ను మినహాయింపు కోల్పోయే ప్రమాదం ► రాజకీయ పార్టీల విరాళాలపై కేంద్రం చట్ట సవరణ! న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలన్నీ తమకొచ్చే విరాళాలపై ప్రతి ఏడాదీ డిసెంబర్‌లోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్ట సవరణ చేయనుంది. అలా దాఖలు చేయని పక్షంలో పన్ను మినహాయింపును కోల్పో యే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకుల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లను కొని పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తి గుర్తింపును రహస్యంగా ఉంచేలా చట్టాన్ని మార్చనున్నారు. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు పన్ను మినహాయింపును అనుభవిస్తున్నాయని, కానీ సగంపైగా పార్టీలు సరైన సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకొచ్చే విరాళాలపై పారదర్శకత పెంచేందుకు డిసెంబర్‌లోపు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేసేలా 2017–18 బడ్జెట్లో ఆర్థిక బిల్లు ద్వారా చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పా రు. ఉదాహరణకు 2018–19 అంచనా సంవత్సరానికి గాను(2017, ఏప్రిల్ 1 నుం చి ఆర్థిక సంవత్సరం ప్రారంభం) డిసెంబర్ 31, 2018లోపు రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా చేయని పార్టీలకు పన్ను మినహాయింపును రద్దు చేసేలా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి
-
మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి
- చట్ట సవరణకు మంత్రి కేటీఆర్ ఆదేశం - అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపు - ప్రతి మున్సిపాలిటీలో ప్రభుత్వ నర్సరీ - రూ.60 కోట్లతో హైదరాబాద్‌లో 210 జంక్షన్ల అభివృద్ధి - సమీక్షలో కేటీఆర్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: మొక్కలు నాటితేనే ఇంటి/భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేలా రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, భవన నిర్మాణ నియమావళిని సవరించాలని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ఈ ఆలోచనకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని..ఈ మేరకు నిబంధనల సవరణ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలకశాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తించేలా ఈ మార్పులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో సైతం నర్సరీల ఏర్పాటును పరిశీలించాలని సంస్థ కమిషనర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ సాధ్యమైనన్ని నర్సరీలను అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖకు ఆదేశాలు జారీ చేశారు. నర్సరీల ద్వారా ప్రజలకు అవసరమైన మొక్కలను సరఫరా చేస్తామని...రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘గ్రేటర్’లో జంక్షన్లకు సొబగులు జీహెచ్ఎంసీలో మొత్తం 210 రోడ్డు జంక్షన్లను రూ. 60 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో జంక్షన్ల ఏర్పాటు, అభివృద్ధి పనులపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. స్థల సేకరణ అవసరం లేకుండానే రూ. 12.5 కోట్లతో 89 జంక్షన్లను అభివృద్ధి చేయవచ్చని అధికారులు మంత్రికి నివేదించారు. మిగిలిన జంక్షన్ల విస్తరణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి స్థలాల సేకరణ కోసం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అప్పటికప్పుడు ఒకేసారి అన్ని జంక్షన్ల అభివృద్ధికి అనుమతి ఇచ్చారు. ముందుగా 10 జంక్షన్లను మోడల్ జంక్షన్లుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ జంక్షన్లలో పాదచారులకు అసౌకర్యం లేకుండా జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతి జంక్షన్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జంక్షన్లు చూసేందుకు అందంగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి కోసం రోడ్లు-భవనాలు, రవాణా, పోలీసు, ట్రాఫిక్ ఇతర శాఖలతో కలసి పనిచేయాలన్నారు. జంక్షన్లలో భవిష్యత్తు విస్తరణకు అవసరమైన నిబంధనలను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చట్ట సవరణలను రెండు వారాల్లో పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. సమీక్షలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ఆ సవరణలు సహకార బ్యాంకులకు శాపాలు
పట్టణ సహకార బ్యాంకుల సమాఖ్య విమర్శ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల చట్ట సవరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహకార బ్యాంకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరు సహకార బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ సహకార సంఘాల చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ తయారు చేసిన చట్టంలో అనేక మార్పులు, చేర్పులూ చేశారని, అవి పట్టణ సహకార బ్యాంకులకు శాపంగా మారాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బహుళ రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకుల సమాఖ్య విమర్శించింది. శుక్రవారం ఇక్కడ ‘తెలంగాణ సహకార సంఘాల చట్టం’పై జరిగిన సదస్సులో సమాఖ్య అధ్యక్షుడు జి.రామమూర్తి మాట్లాడుతూ ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలని సవరణ తీసుకొచ్చారని, లెసైన్స్ రెన్యువల్ ఉంటుందే కానీ, రిజిస్ట్రేషన్‌కు రెన్యువల్ చేసుకోవాలని పేర్కొనడం అర్థరహితమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వివరించగా ఆయన కూడా విస్మయం వ్యక్తం చేశారన్నారు. అధికారులను తాము నిలదీయగా ఈ నిబంధన నుంచి పట్టణ సహకార బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఎన్నికల అధికారిని నియమించే అధికారాన్ని సహకారశాఖకు కట్టబెట్టి అధికారుల జోక్యాన్ని మరింత పెంచారన్నారు. జనరల్ బాడీ మీటింగ్‌లకు సహకార సంఘాల రిజిస్ట్రార్ హాజరవుతారని పేర్కొన్నారని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమావేశంలో సమాఖ్య చైర్మన్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి, డెరైక్టర్ జి.మదన గోపాలస్వామి, సుధా సహకార పట్టణ బ్యాంకు సీఈవో పెద్దిరెడ్డి గణేష్, సమాఖ్య సీఈవో గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.