మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి | Building construction permission only affected plants over range GHMC, says ktr | Sakshi
Sakshi News home page

మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి

Published Sun, Jul 10 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి

మొక్క నాటితేనే ‘ఇంటి’కి అనుమతి

- చట్ట సవరణకు మంత్రి కేటీఆర్ ఆదేశం
- అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తింపు
- ప్రతి మున్సిపాలిటీలో ప్రభుత్వ నర్సరీ
- రూ.60 కోట్లతో హైదరాబాద్‌లో 210 జంక్షన్ల అభివృద్ధి
- సమీక్షలో కేటీఆర్ నిర్ణయాలు

 
 సాక్షి, హైదరాబాద్: మొక్కలు నాటితేనే ఇంటి/భవన నిర్మాణ  అనుమతులు జారీ చేసేలా రాష్ట్ర మున్సిపాలిటీల చట్టం, భవన నిర్మాణ నియమావళిని సవరించాలని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు నిర్ణయించారు. ఈ ఆలోచనకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని..ఈ మేరకు నిబంధనల సవరణ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలకశాఖను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వర్తించేలా ఈ మార్పులు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ప్రభుత్వ నర్సరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో సైతం నర్సరీల ఏర్పాటును పరిశీలించాలని సంస్థ కమిషనర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ సాధ్యమైనన్ని నర్సరీలను అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖకు ఆదేశాలు జారీ చేశారు. నర్సరీల ద్వారా ప్రజలకు అవసరమైన మొక్కలను సరఫరా చేస్తామని...రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
 ‘గ్రేటర్’లో జంక్షన్లకు సొబగులు
 జీహెచ్‌ఎంసీలో మొత్తం 210 రోడ్డు జంక్షన్లను రూ. 60 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో జంక్షన్ల ఏర్పాటు, అభివృద్ధి పనులపై శనివారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. స్థల సేకరణ అవసరం లేకుండానే రూ. 12.5 కోట్లతో 89 జంక్షన్లను అభివృద్ధి చేయవచ్చని అధికారులు మంత్రికి నివేదించారు. మిగిలిన జంక్షన్ల విస్తరణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి స్థలాల సేకరణ కోసం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అప్పటికప్పుడు ఒకేసారి అన్ని జంక్షన్ల అభివృద్ధికి అనుమతి ఇచ్చారు.
 
 ముందుగా 10 జంక్షన్లను మోడల్ జంక్షన్లుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ జంక్షన్లలో పాదచారులకు అసౌకర్యం లేకుండా జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రతి జంక్షన్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జంక్షన్లు చూసేందుకు అందంగా ఉండేలా డిజైన్లు రూపొందించాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి కోసం రోడ్లు-భవనాలు, రవాణా, పోలీసు, ట్రాఫిక్ ఇతర శాఖలతో కలసి పనిచేయాలన్నారు. జంక్షన్లలో భవిష్యత్తు విస్తరణకు అవసరమైన నిబంధనలను రూపొందించాలని, ఇందుకు అవసరమైన చట్ట సవరణలను రెండు వారాల్లో పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు. సమీక్షలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement