![Supreme Court issues norms for early disposal of cheque bounce cases - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/17/CHEQUE.jpg.webp?itok=dJGnuIAY)
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు కోర్టుల్లో పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కానానికి సుప్రీకోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఒక లావాదేవీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఒకే సంవత్సరంలో దాఖలైన వివిధ కేసులను కలిపి ఒకేసారి విచారించేలా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కు చట్ట సవరణలు చేయాలని చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం కేంద్రానికి నిర్దేశించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు.
1973, సీఆర్‌పీసీ 219వ సెక్షన్ ప్రకారం ప్రస్తుతం ఈ తరహాలో మూడు కేసులు మాత్రమే కలిపి విచారించాల్సి ఉంది. ఇక చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి వేగవంతమైన విచారణకు వీలైన ‘‘సమ్మరీ ట్రైల్’’ నుంచి కొంత ఆలస్యానికి కారణమయ్యే ‘‘సమన్స్ ట్రైల్’’కు మార్చడానికి కారణాలు ఏమిటన్నది సంబంధిత మేజిస్ట్రేట్ తప్పనిసరిగా రికార్డు చేసేలా తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు 27 పేజీల ఉత్తర్వుల్లో సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment