పాక్‌ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే | Pakistan Parliament Passes Bill Capping Chief Justice Term President Zardari Gives Assent, See Details | Sakshi
Sakshi News home page

పాక్‌ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే

Published Tue, Oct 22 2024 6:01 AM | Last Updated on Tue, Oct 22 2024 10:05 AM

Pakistan parliament passes bill capping chief justice term

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్‌ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్‌ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్‌ అసెంబ్లీ, సెనేట్‌లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. 

అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్‌ కాజీ ఇసా స్థానంలో జస్టిస్‌ మన్సూర్‌ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. 

ఆయన స్థానంలో సీనియర్‌ మోస్ట్‌ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్‌ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్‌ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement