cj
-
పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ సోమవారం ఆమోదముద్ర వేశారు. అంతేకాదు, సీజేను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జిలతో ప్రత్యేక కమిటీ నియామకం ఉత్తర్వుపైనా ఆయన సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన 26వ రాజ్యాంగ సవరణపై నేషనల్ అసెంబ్లీ, సెనేట్లతో ఆదివారం మొదలైన చర్చలు, సోమవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. తాజా సవరణ ద్వారా ఈ నెల 25న పదవీ విరమణ చేసే సీజే జస్టిస్ కాజీ ఇసా స్థానంలో జస్టిస్ మన్సూర్ అలీ షా కొత్తగా బాధ్యతలు చేపట్టకుండా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. ఆయన స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జి ఆటోమేటిక్‌గా ఆ పదవిని చేపడతారు. తాజా పరిణామంతో ఈ సంప్రదాయానికి ముగింపు పలికినట్లయింది. అంతేకాకుండా, సీజే ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటుకానుంది. ఇందులో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ జడ్జీలతోపాటు, సెనేట్, నేషనల్ అసెంబ్లీ నుంచి ఇద్దరు చొప్పున సభ్యులుగా ఉంటారు. చట్ట సవరణను నవ శకానికి నాందిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభివర్ణించగా దేశ స్వతంత్ర న్యాయవ్యవస్థకు చావుదెబ్బగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ పేర్కొంది. -
జస్టిస్ బండారు శ్యాంసుందర్ పదవీ విరమణ
సాక్షి, అమరావతి : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యాం సుందర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. జస్టిస్ శ్యాం సుందర్ 33 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి, న్యాయవ్యవస్థకు ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు. ఇంత సుదీర్ఘ కాలం పని చేయడం చిన్న విషయం కాదన్నారు. జస్టిస్ శ్యాం సుందర్ విలువలకు పెద్ద పీట వేశారని, తండ్రి చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఇప్పటివరకు పాటించారని తెలిపారు. క్లిష్టమైన కేసులను చాలా సులభంగా పరిష్కరించారని చెప్పారు. సత్వర న్యాయం కోసం కృషి చేశారు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిలిగినీడి చిదంబరం, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు తదితరులు జస్టిస్ శ్యాం సుందర్ సేవలను కొనియాడారు. న్యాయవ్యవస్థకు ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. సత్వర న్యాయం కోసం ఎంతో కృషి చేశారని, న్యాయవ్యవస్థ సమర్థతను పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నో క్లిష్టమైన కేసులను సమర్థతతో, స్పష్టతతో పరిష్కరించారన్నారు. పని చేసిన ప్రతి చోటా ఎంతో హుందాగా, సమర్థవంతంగా వి«ధులు నిర్వర్తించారన్నారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వారు చెప్పారు.ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు అనంతరం జస్టిస్ శ్యాం సుందర్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఎంతో మంది తనకు మార్గదర్శకంగా ఉండి, ఇక్కడి వరకు వచ్చేందుకు సహకరించారని తెలిపారు. తన గురువు, సీనియర్ అయిన తన తండ్రి ఎంతో నేర్పారన్నారు. విధి నిర్వహణలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలన్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థతో తనకు ఎన్నో మధుర స్మృతులున్నాయని, వాటిని గుండెల్లో దాచుకుంటున్నానని తెలిపారు. తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి విధులు నిర్వర్తించానని చెప్పారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ శ్యాం సుందర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజి్రస్టార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ శ్యాం ప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి, అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చిదంబరం, ఉపా«ధ్యక్షుడు ఎన్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి నన్నపనేని శ్రీహరి, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా: హైకోర్టు చీఫ్ జస్టిస్
నాంపల్లి (హైదరాబాద్): పర్యావరణాన్ని రక్షించేందుకు కేవలం ప్రభుత్వంపైనే బాధ్యత వేయకుండా ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి గగన్‌విహార్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని ఆయన అథారిటీ చైర్మన్ జస్టిస్ ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ సతీష్ చంద్ర సభనుద్దేశించి మాట్లాడారు. ‘నేను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు హుస్సేన్‌సాగర్ గురించి ఎంతో గొప్పగా విన్నా. మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు హుస్సేన్‌సాగర్‌ను చూడటానికి వెళ్లాను. అయితే, అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయా. అలాగే హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి తొలుత మురుగునీటి కాలువని అనుకున్నా. కానీ, నా డ్రైవర్ అది నది అని చెప్పడంతో నేను ఆశ్చర్యపోయా’అని జస్టిస్ సతీష్ చంద్ర చెప్పారు. తానొకరోజు విమానాశ్రయం వెళ్తోంటే కొందరు వ్యక్తులు సంచుల్లో చెత్తను తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేశారని, తన కుమారుడు కారు ఆపి ఆ చెత్తను చెత్తకుండీలో వేశారని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీకి ఐదుసార్లు క్లీన్ సిటీ అవార్డు వచ్చిందని, అక్కడి కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులు మరుగుదొడ్ల పక్కనే పుట్‌ఫాత్‌పై భోజనం చేశారని చెప్పారు. నదులు, సరస్సులు, పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తున్న వారిపై ఈ అథారిటీతోపాటు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ఉండి కాలుష్య నియంత్రణకు పాటుపడాలని చీఫ్ జస్టిస్ చేతులు జోడించి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అథారిటీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చిక్కుల్లో మాజీ సీజే తహిల్
సాక్షి ప్రతినిధి, చెన్నై : కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన మద్రాసు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి తహిల్రమణి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మాజీ సీజేగా పనిచేసిన కాలంలో ఆమె అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చేసిన అభియోగంపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. వివరాలు... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న తహిల్ రమణిని సుప్రీంకోర్టు కొలీజియం మేఘాలయ హైకోర్టుకు ఇటీవల బదిలీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని ఆశిస్తున్న దశలో దేశంలోనే అత్యంత చిన్నదైన మేఘాలయ హైకోర్టు బదిలీచేయడం అవమానంగా భావించినట్లు సమాచారం. ఈ క్రమంలో కొలీజియం నిర్ణయాన్ని నిరసిస్తూ తన పదవికి ఆమె రాజీనామా చేయగా రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆమోదించారు. ఇదిలా ఉండగా, తహిల్రమణిపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అవినీతి ఆరోపణలు చేసింది. చెన్నై సెంమ్మంజేరీ, తిరువిడందైలలో తహిల్రమణి జూన్, జూలైలలో రెండు అపార్టుమెంట్లను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు వెనుక అవినీతి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరోపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్కు ఐదు పేజీల నివేదికను సమర్పించింది. ఐబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ఐబీ అధికారులు విచారణ ప్రారంభించారు.(చదవండి : సీజే తహిల్ రాజీనామాకు ఆమోదం) కాగా మాజీ సీజే కొనుగోలు రెండు ఇళ్లను లోరియన్ టవర్ అనే సంస్థ నిర్మించిన అపార్టుమెంట్లలోనివే. వీటి విలువ రూ.3.18 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో రూ.1.62 కోట్లను హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రుణం పొంది చెల్లించారు. మిగిలిన రూ.1.56 లక్షలను సొంతంగా చెల్లించారు. ఈ నగదు చెల్లింపులు తన బంధువులకు చెందిన ఆరు బ్యాంకు ఖాతాల నుంచి బదలాయింపు జరిగింది. వీటిల్లో మూడు ఖాతాలు తన భర్తతో జాయింట్ అకౌంట్‌గా ఉంది. మరోటి తన కుమారుడి జాయింట్ అకౌంట్. మరోటి తల్లితో జాయింట్ అకౌంట్. ఇంకోటి తన జీతానికి సంబంధించిన అకౌంట్. ఇదిలా ఉండగా, రూ.18 లక్షలు తహిల్రమణి, ఆమె తల్లి జాయింట్ అకౌంట్లోకి చేరగా కేవలం ఒక నెలలో మరో ఖాతాకు బదలాయింపు జరిగింది. ఇలా బ్యాంకు ఖాతాలకు నగదు బదలాయింపులపై ఐబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక కేసు విచారణను కొట్టివేసిన నేపథ్యంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, నగదు లావాదేవీలు జరిగి ఉండొచ్చని ఆరోపిస్తోంది. తమిళనాడులో విగ్రహాల అక్రమరవాణా కేసులకు సంబంధించి 2018లో ప్రత్యేక విచారణ బెంచ్ ఏర్పడగా న్యాయమూర్తి మహాదేవన్ అనేక కఠిన మైన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక బెంచ్‌ను అప్పటి ప్రధాన న్యాయమూర్తి తహిల్రమణి రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ రద్దు వెనుక అక్రమాలు చోటుచేసుకుని ఉండే అవకాశాలు ఉన్నాయని ఐబీ సందేహిస్తోంది. -
అనూహ్యం; సీజే తహిల్ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్ రమణి రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ మేరకు తహిల్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. అదే విధంగా రాజీనామా అంశం సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అతి పెద్ద న్యాయ స్థానాల జాబితాలో ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌తో ఉన్న మేఘాలయకు తనను బదిలీ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తన బదిలీని పునః సమీక్షించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. అయినా కొలీజియం నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. ఈ క్రమంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా తహిల్ రమణి స్థానంలో జస్టిస్ వీ కొఠారిని మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు మరొక నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా తహిల్‌కు మద్దతుగా తమిళనాడు ఓ వైపు మద్దతు పెరుగుతూ ఆందోళనలు తీవ్ర తరం అవుతుండగా...ప్రభుత్వ నిర్ణయం కారణంగా అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి : ‘హైకోర్టును బాంబులతో పేలుస్తాం’) ఇదిలా ఉండగా... గుజరాత్ హైకోర్టు జడ్జిగా పని చేస్తున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ అఖిల్ ఖురేషిని త్రిపుర హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం మరో సిఫారసు చేసింది. ఈ మేరకు తన ప్రతిపాదనలను శుక్రవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక దేశంలో పెద్ద న్యాయస్థానాల జాబితాలో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌కు కాదని త్రిపుర హైకోర్టుకు తనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫారసులపై జస్టిస్ అఖిల్ ఎలా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా తహిల్ బాటనే అనుసరిస్తారా లేదా కొలీజియం ప్రతిపాదనను అంగీకరిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది.(చదవండి : కొలీజియం సిఫారసును తిరస్కరించిన కేంద్రం!?) -
‘హైకోర్టును బాంబులతో పేలుస్తాం’
సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణి బదిలీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. బదిలీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆమెకు మద్దతుగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. గురువారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో అతి పెద్ద న్యాయ స్థానాల జాబితాలో ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌తో ఉన్న మేఘాలయకు తనను బదిలీ చేయడాన్ని తహిల్ రమణి వ్యతిరేకించారు. తన బదిలీని పునః సమీక్షించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన రాకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. కాగా తహిల్ రాజీనామా విషయంలో కొలిజియం, రాష్ట్రపతి భవన్ ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తహిల్ రమణికి మద్దతుగా తమిళనాట రాజకీయవర్గాలతో పాటు, న్యాయలోకం కూడా గళమెత్తింది. తహిల్‌కు మద్దతుగా ఇప్పటికే పలు ఆందోళనలు సాగాయి. ఆమెను ఇక్కడే కొనసాగించాలన్న నినాదం మిన్నంటుతున్న సమయంలో ఏకంగా కొలీజియం సిఫారసులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నై నందనంకు చెందిన న్యాయవాది కర్పగం బుధవారం ఉదయం న్యాయమూర్తులు సత్యనారాయణ, శేషసాయి బెంచ్ ముందుకు వచ్చారు. తహిల్ రమణి బదిలీ వ్యవహారం గురించి ప్రస్తావించారు. కొలీజియం సిఫారసు అన్న నిరంతర ప్రక్రియలో భాగమేనని, దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో విచారణకు అవకాశం ఉందన్నారు. ఈ బదిలీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా, కొలిజియం సిఫారసులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమె తరఫు వాదనల్ని పరిగణించిన న్యాయమూర్తులు పిటిషన్ దాఖలుకు అవకాశం ఇచ్చారు. దీంతో కర్పగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. భద్రతా చర్యలు.. సీజే బదిలీ వ్యవహారంతో హైకోర్టు ఆవరణలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో 30వ తేదీలోపు హైకోర్టును బాంబులతో పేల్చేస్తామన్న హెచ్చరికలు, బెదిరింపులు కూడా రావడంతో భద్రతాపరంగా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్, సీనియర్ న్యాయమూర్తులు వినిత్ కొతారి, మణికుమార్, శశిధరన్, సీఆర్పీఎఫ్ వర్గాలు సమావేశం అయ్యారు. భద్రతా పరంగా హైకోర్టు ఆవరణలో చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి న్యాయవాది తమ కోటు ధరించడంతో పాటు గుర్తింపు కార్డును ధరించి రావాలని, సీఆర్పీఎఫ్ తనిఖీలకు సహకరించాలన్న నిర్ణయం తీసుకుని, ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అదే విధంగా.. చెన్నై పోలీసులు, సీఆర్పీఎఫ్ సమన్వయంతో భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమయ్యారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ చౌహాన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా చౌహాన్ వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసుబ్రమణియన్కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేశాక సంబంధిత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్ చౌహాన్ 1959 డిసెంబర్ 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2005లో రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీనితో సీనియర్ అయిన జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం జస్టిస్ రామసుబ్రమణియన్ 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాదులు కె.సార్వభౌమన్, టి.ఆర్.మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
సీజే, జడ్జీల ఖాళీల భర్తీపై పిల్ కొట్టివేత
- నియామక ప్రక్రియ కొనసాగుతోందని సుప్రీం చెప్పింది - దాన్ని గౌరవిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంతో పాటు న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేలా కేంద్రం, సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతోందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో దానిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ప్రస్తుతం హైకోర్టులోని న్యాయమూర్తుల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు మాత్రమే ఉన్నారన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది ఎంతమాత్రం సరికాదని, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన న్యాయమూర్తులు ఉన్నారని, వారి పూర్వీకులు తెలంగాణవారు కారన్న కారణంతో వారిని ఈ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. సదరు న్యాయమూర్తుల డీఎన్ఏలో వారి పూర్వీకులు ఇక్కడి వారేనని తేలితే తప్ప వారిని ఇక్కడి వారిగా పరిగణించేటట్లు లేరని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణి యన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. మా వద్ద మంత్రదండమేమీ లేదు.. హైకోర్టుకు 22 నెలలుగా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరని, అలాగే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌పై ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండమేదీ లేదని తన తీర్పులో వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ విస్తృతమైన సంప్రదింపులతో జరిగేదని గుర్తు చేసింది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు విశ్వసనీయతనిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నామే తప్ప, ఆ వ్యాజ్యాన్ని విచారించే న్యాయ పరిధి లేకో.. వ్యాజ్యానికి విచారణార్హత లేకో కాదని తెలిపింది. హైకోర్టులో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో న్యాయమూర్తులపై భరించలేనంత పనిభారం పెరగడంతో పాటు, పెండింగ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు కొలీజియం న్యాయవాదుల నుంచి ఆరుగురు పేర్లను, జిల్లా జడ్జీల నుంచి నలుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తే, వారిలో నలుగురే నియమితులయ్యారని పేర్కొంది. -
హైకోర్టు సీజేను కలిసిన బీబీఏ ప్రతినిధులు
విజయవాడ లీగల్ : ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు పూర్తి అదనపు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు సారథ్యంలో ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నగరంలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలో నిర్మిస్తున్న కోర్టుల బహుళ అంతస్తుల భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు, కోర్టులు పలు చోట్ల ఉండటం వలన ఉదయం కాల్ వర్క్‌లో చాలా ఇబ్బందులు పడుతుమని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో విడుదలైన జీవో ప్రకారం మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి, రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టును వేర్వేరుగా చేయాలని వినతిపత్రంలో కోరారు. న్యాయమూర్తిని కలిసిన వారిలో బీబీఏ కార్యవర్గ సభ్యులు దాసరి ఆంజనేయ ప్రసాదు, కొత్త చంద్రమౌళి, పుప్పాల శ్రీనివాసరావు, పి.కిరణ్, కండెల వర ప్రసాదరావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గోగుశెట్టి వెంకటేశ్వరరావు, ఎ.వి.రమణ, మట్టా జయకర్ ఉన్నారు. -
సీజేతో టీ బార్ అసోసియేషన్ సభ్యుల భేటీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారుల సస్పెన్షన్‌ను రీకాల్ చేయాల్సిందిగా వారు సీజేను కోరారు. అయితే ఈ వ్యవహారంలో.. సమ్మె విరమించాల్సిందిగా బార్ అసోసియేషన్ సభ్యులను సీజే కోరారు. న్యాయవాదులు ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించొద్దని ఆయన సూచించారు. హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి సదానంద గౌడతో మాట్లాడుతానని తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యులకు సీజే తెలిపారు. అయితే.. సమ్మె విరమించిన తరువాతే ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సీజే తేల్చి చెప్పారు. సమ్మె విరమించే విషయంలో సభ్యులందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బార్ అసోసియేషన్ సభ్యులు సీజేకు వెల్లడించినట్లు తెలిపారు.