న్యూఢిల్లీ : మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే తహిల్ రమణి రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ మేరకు తహిల్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అదే విధంగా రాజీనామా అంశం సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో అతి పెద్ద న్యాయ స్థానాల జాబితాలో ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌తో ఉన్న మేఘాలయకు తనను బదిలీ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. తన బదిలీని పునః సమీక్షించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. అయినా కొలీజియం నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు.
ఈ క్రమంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా తహిల్ రమణి స్థానంలో జస్టిస్ వీ కొఠారిని మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నట్లు మరొక నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా తహిల్‌కు మద్దతుగా తమిళనాడు ఓ వైపు మద్దతు పెరుగుతూ ఆందోళనలు తీవ్ర తరం అవుతుండగా...ప్రభుత్వ నిర్ణయం కారణంగా అవాంఛనీయ ఘటనలు తలెత్తే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి : ‘హైకోర్టును బాంబులతో పేలుస్తాం’)
ఇదిలా ఉండగా... గుజరాత్ హైకోర్టు జడ్జిగా పని చేస్తున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అఖిల్ ఖురేషిని నియమించాలన్న కొలీజియం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ అఖిల్ ఖురేషిని త్రిపుర హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం మరో సిఫారసు చేసింది. ఈ మేరకు తన ప్రతిపాదనలను శుక్రవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక దేశంలో పెద్ద న్యాయస్థానాల జాబితాలో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్‌కు కాదని త్రిపుర హైకోర్టుకు తనను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫారసులపై జస్టిస్ అఖిల్ ఎలా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆయన కూడా తహిల్ బాటనే అనుసరిస్తారా లేదా కొలీజియం ప్రతిపాదనను అంగీకరిస్తారా అన్న విషయం చర్చనీయాంశమైంది.(చదవండి : కొలీజియం సిఫారసును తిరస్కరించిన కేంద్రం!?)
Comments
Please login to add a commentAdd a comment