సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణి బదిలీ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. బదిలీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఆమెకు మద్దతుగా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. గురువారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణిని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో అతి పెద్ద న్యాయ స్థానాల జాబితాలో ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌తో ఉన్న మేఘాలయకు తనను బదిలీ చేయడాన్ని తహిల్ రమణి వ్యతిరేకించారు. తన బదిలీని పునః సమీక్షించాలని కొలీజియంకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన రాకపోవడంతో.. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు.
కాగా తహిల్ రాజీనామా విషయంలో కొలిజియం, రాష్ట్రపతి భవన్ ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తహిల్ రమణికి మద్దతుగా తమిళనాట రాజకీయవర్గాలతో పాటు, న్యాయలోకం కూడా గళమెత్తింది. తహిల్‌కు మద్దతుగా ఇప్పటికే పలు ఆందోళనలు సాగాయి. ఆమెను ఇక్కడే కొనసాగించాలన్న నినాదం మిన్నంటుతున్న సమయంలో ఏకంగా కొలీజియం సిఫారసులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నై నందనంకు చెందిన న్యాయవాది కర్పగం బుధవారం ఉదయం న్యాయమూర్తులు సత్యనారాయణ, శేషసాయి బెంచ్ ముందుకు వచ్చారు. తహిల్ రమణి బదిలీ వ్యవహారం గురించి ప్రస్తావించారు. కొలీజియం సిఫారసు అన్న నిరంతర ప్రక్రియలో భాగమేనని, దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో విచారణకు అవకాశం ఉందన్నారు. ఈ బదిలీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా, కొలిజియం సిఫారసులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆమె తరఫు వాదనల్ని పరిగణించిన న్యాయమూర్తులు పిటిషన్ దాఖలుకు అవకాశం ఇచ్చారు. దీంతో కర్పగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.
భద్రతా చర్యలు..
సీజే బదిలీ వ్యవహారంతో హైకోర్టు ఆవరణలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో 30వ తేదీలోపు హైకోర్టును బాంబులతో పేల్చేస్తామన్న హెచ్చరికలు, బెదిరింపులు కూడా రావడంతో భద్రతాపరంగా చర్యల్ని కట్టుదిట్టం చేశారు. చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్, సీనియర్ న్యాయమూర్తులు వినిత్ కొతారి, మణికుమార్, శశిధరన్, సీఆర్‌పీఎఫ్ వర్గాలు సమావేశం అయ్యారు. భద్రతా పరంగా హైకోర్టు ఆవరణలో చర్యలకు సిద్ధమయ్యారు. ప్రతి న్యాయవాది తమ కోటు ధరించడంతో పాటు గుర్తింపు కార్డును ధరించి రావాలని, సీఆర్‌పీఎఫ్ తనిఖీలకు సహకరించాలన్న నిర్ణయం తీసుకుని, ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అదే విధంగా.. చెన్నై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సమన్వయంతో భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment