తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన.
బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది.
కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది.
కోర్టుకెక్కిన తండ్రి
తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు.
దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది.
ఆందోళన లేకుండా
కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు.
మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే.
సమయం వచ్చేసింది
మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది.
ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’.
–జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు
(చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు)
Comments
Please login to add a commentAdd a comment