Paternity leave
-
కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!
‘కనేది ఆమె అయినా అతడికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టంగా మారింది. కాబట్టి ఈ రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాల్సిన పరిస్థితి. ఇలాంటి సరికొత్త ఆలోచనకు నాంది పలకక తప్పని పరిస్థితి. అందువల్ల మహిళలకు ఇచ్చినట్లే కాబోయే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిందే. అయితే ఈ పెటర్నటీ సెలవులు ఉండి ఉన్నట్లుగా ఉన్నాయంతే. చాలా కంపెనీలు సరిగా ఇవ్వనే ఇవ్వడం లేదు. ఈ విషయమై లండన్‌లో పెద్ద ఎత్తున అసంతృప్తి నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. యూకే అంతటా పురుషుల విగ్రహాలు బేబీ క్యారియర్ల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఓ చిన్న శిశువు బొమ్మ పురుషుడి మెడకు చుట్టి ఉంచినట్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు ప్రపంచమంతటా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అందుకు కారణం పెటర్నటీ సెలవులు. కాబోయే తండ్రులకు సెలవులు ఇవ్వాలని చెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ది డాడ్ షిఫ్ట్ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అంతేగాదు కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం అనే విషయంపై అంతా దృష్టి సారించేలా ఈ విధంగా చేస్తున్నారు అక్కడ. పితృత్వ సెలవులు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?, వారి పాత్ర కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? అని నొక్కి చెప్పేలా అడుగడుగున ఇలాంటి పురుష విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంతేగాదు నిరసనకారులు తమ అభ్యర్థనలతో యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్‌కు బహిరంగ లేఖను కూడా అందించారు. నిజానికి యూకే రెండు వారాల పితృత్వ సెలవును అందిస్తుంది. అంతేగాక వారానికి సుమారు రూ. 20,300 చెల్లిస్తోంది కూడా. అయితే బెల్జియం వంటి యూరోపియన్ దేశాలు మాత్రం ఈ పెటర్నటీ సెలవల్ని 20 రోజులకు పెంచింది. అంటే..యూరోపియన్ పార్లమెంట్ ఆదేశాల ప్రకారం ఫిన్లాండ్లో తల్లిదండ్రులిద్దరికీ 160 రోజులు వేతనంతో కూడిన సెలవులందిస్తోంది. అయితే మన భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకు పితృత్వ సెలవులపై తప్పనిసరి చట్టం లేదు. కానీ 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) నిబంధనల ప్రకారం, పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పితృత్వ సెలవులకు అర్హులు. ఈ విషయంపై ఇదివరకటి రోజల్లో అంతగా ప్రామఖ్యత లేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సెలవులు తప్పనిసరి అని చెప్పొచ్చు. కాన్పు సమయంలో అమ్మ కాబోతున్న మహిళల్లో సైతం ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇప్పుడూ ఎవరికీ వారే అనే యమునా తీరే అన్నట్లుగా న్యూక్లియర్ ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటప్పుడూ భర్త తోడు ఉండాలి. దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలను ఎలా పంచుకోవాలో తెలియడమే గాక ఓ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.(చదవండి: మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్ మన్రో జీవితం..!) -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
ఆఫీసులుకు వస్తాం, ఆ సెలవులు మాకొద్దు బాబోయ్!.. వణికిపోతున్న తండ్రులు
జపాన్ దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన అక్కడి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పితృత్వ సెలవులకు చట్టబద్ధత కల్పించింది. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న దశాబ్ది కాలంలో జనాభా క్షీణతను నివారించవచ్చని భావిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం, పురుషులు 80 శాతం జీతంతో నాలుగు వారాల పితృత్వ సెలవులకు అర్హులుగా జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండగా.. తండ్రులు మాత్రం వాటిని తీసుకునేందుకు భయపడుతున్నారట. పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవుల విషయంలో నూతన విధానాలను తెరపైకి తీసుకొచ్చింది కిషిదా ప్రభుత్వం. దీని ప్రకారం సెలవులు తీసుకుంటున్న 14 శాతం ఉద్యోగుల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి, 2030 నాటికి 85 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం నిర్ణయం బాగానే ఉన్నా పితృత్వ సెలవులు తీసుకోవడం వల్ల తాము పని చేస్తున్న సంస్థ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని చాలా వరకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే అన్ని రోజులు ఉద్యోగులు సెలవు తీసుకోవడం ద్వారా.. అది వారి ప్రమోషన్ అవకాశాలు దెబ్బతీయడంతో పాటు వారి కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, అంతేకాకుండా సెలవుల అనంతరం వారికి ఇతర బాధ్యతలు అప్పజెప్పే ప్రమాదం ఉందని భావించడమే ఇందుకు ప్రధాన కారణమట. జపాన్‌లో కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్ ప్లేయర్ దూరం
Quinton De Kock: టీమిండియాతో కీలక సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్ వ్యక్తిగత కారణాల చేత రెండు, మూడు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని ఆ జట్టు సెలెక్షన్ కన్వీనర్ విక్టర్ పిట్సాంగ్ వెల్లడించాడు. జనవరిలో అతని భార్య సశా బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండడంతో డికాక్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్లు విక్టర్ ప్రకటించాడు. డికాక్ గైర్హాజరీలో కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్లను వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా డిసెంబర్ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. పర్యటనలో భాగంగా సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్, జొహన్నెస్‌బర్గ్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు రెండో టెస్ట్, కేప్‌టౌన్ వేదికగా జనవరి 11-15 వరకు మూడో టెస్ట్ జరగాల్సి ఉంది. చదవండి: ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం -
సెలవు కావాలి.. డీఎన్ఏ టెస్ట్ చేపించు
టోక్యో: ‘పెటర్నటి లీవ్’(పితృత్వ సెలవు) అడిగినందుకు తనను అవమానించడమే కాక.. డీఎన్ఏ టెస్ట్ రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశించారంటూ 2015లో ఓ వ్యక్తి కోర్టులో వేసిన కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే అత్యల్ప బర్త్ రేట్‌తో సతమతమవుతోన్న జపాన్ తాజా వివాదంతో ఒక్కసారి ఉల్కిపడింది. 2015లో జరిగిన ఈ కేసు వివరాలు.. కెనడాకు చెందిన గ్లేన్ వుడ్(49) గత ముప్పై ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటూ అక్కడే పని చేస్తున్నాడు. అప్పుడు అతని భార్య నేపాల్‌లో ఉద్యోగం చేస్తుంది. అప్పటికే ఆమె గర్భవతి. డెలీవరి సమయానికి భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వుడ్ పెటర్నటి లీవ్‌కు దరఖాస్తు చేశాడు. అయితే సదరు కంపెనీ అతడికి సెలవు మంజూరు చేయకుండా.. పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేపించి, వుడ్డే ఆ బిడ్డకు తండ్రని నిరూపిస్తేనే సెలవు ఇస్తామని తెలిపింది. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో వుడ్ నేపాల్‌లో ఉన్న తన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేపించి.. ఆ రిపోర్ట్స్‌ను తన కంపెనీలో సమర్పించాడు. ఆ తర్వాతే అతడికి సెలవు లభించింది. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో వుడ్ మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే కంపెనీ అతడికి జీతం చెల్లించకపోవడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించింది. దాంతో కంపెనీ తీరును ఎండగడుతూ.. కోర్టులో కేసు వేశాడు వుడ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. ‘ఇది కంపెనీ పాత పద్దతనుకుంటా. అయితే ఇక్కడ నాకు ఇప్పటికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. డీఎన్ఏ రిపోర్టు సమర్పించే వరకు కంపెనీ నాకు పెటర్నటి లీవ్ ఇవ్వలేదు. నెలలు నిండకుండానే నా కుమారుడు జన్మించడంతో.. తనని ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. వీటన్నింటిని నా భార్య ఒక్కతే చూసుకుంది. ఆ సమయంలో తను చాలా ఇబ్బంది పడింది. క్రిస్టమస్ తర్వాతే నాకు లీవ్ దొరికింది’ అన్నాడు వుడ్. ‘ఆ తర్వాత 2016, మార్చిలో నా కుమారుడ్ని తీసుకుని జపాన్ వచ్చేశాను. కానీ పని ఒత్తిడి వల్ల నా ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆరు నెలల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నాను. తర్వాత విధుల్లో చేరాను. కానీ కంపెనీ నాకు ఆరు నెలల వేతనాన్ని చెల్లించలేదు. అంతేకాక నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. ఈ అంశంలో నాకు న్యాయం జరగడం కోసం కోర్టును ఆశ్రయించాను’ అని తెలిపాడు వుడ్. జపాన్ చట్టం ప్రకారం అక్కడి కంపెనీలు బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇద్దరికి ఏడాది పాటు సెలవు ఇవ్వాలి. అదికాక మరో ఆరు నెలల సెలవును కూడా అదనంగా మంజూరు చేయాలి. అయితే జపాన్‌లో పెటర్నటి సెలవు తీసుకునే వారి పురుషుల సంఖ్య చాలా తక్కువని నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
పా–టర్నిటీ లీవ్!
మెటర్నిటీ లీవ్ అంటే తెలిసిందే. గర్భిణికి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కంపెనీ ఇచ్చే లీవు. ఆ లీవులకు జీతం కట్ ఉండదు. అలాగే పాటర్నిటీ లీవ్ అని మరో లీవ్ ఉంది. భార్య ప్రసవానికి కాస్త ముందు కానీ, ప్రసవం తర్వాత కానీ భర్తకు కంపెనీ ఇచ్చే లీవు. ఈ లీవులకూ జీతం కట్ ఉండదు. మరి ఈ ‘పా–టర్నిటీ’ లీవ్ ఏంటీ? ఏం లేదు. పిల్లలు పుడితే ఇచ్చినట్లే, కుక్కపిల్లను కొని తెచ్చుకుంటే ఇచ్చే లీవ్. ఇలాంటిదొక సదుపాయం ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ, బెర్డీన్ సిటీ (ఇంగ్లండ్) లోని ‘బ్రూడాగ్’ అనే బీరు తయారీ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీలోని ఉద్యోగులు ఎవరైనా కొత్తగా కుక్కపిల్లను పెంచుకుంటుంటే... దాని ఆలనాపాలన కోసం వారానికొకరోజు వారికి సెలవు ఇస్తుందట! ఆ సెలవుకు కంపెనీ పెట్టిన పేరే ‘పా–టర్నిటీ’ లీవు. ఇంగ్లిషులో ‘పా’ అంటే జంతువు పాదాకృతి. ఇంతకీ ఆ కంపెనీకి అంత ఉత్సాహం ఎందుకు వచ్చినట్టు? తన కంపెనీలో ‘డాగ్’ అనే పేరుంది కదా. అందుకు కావచ్చు. డాగ్‌ల గౌరవార్థం. మీరు చూస్తున్న బీర్డాగ్ల ఫొటో ఆ కంపెనీ విడుదల చేసిందే. -
సంక్రాంతి వరకు సెలవులోనే హీరో
ఇటీవలే తండ్రి అయిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ జవనరి మధ్య వరకు.. అంటే సుమారు సంక్రాంతి వరకు సెలవులోనే ఉంటాడట. ఆ తర్వాతే తాను తదుపరి చేయబోతున్న 'చెఫ్' సినిమా షూటింగులో పాల్గొంటాడట. అప్పటివరకు తాను పితృత్వ సెలవు తీసుకుంటానని ఈ నవాబు గారు చెబుతున్నట్లు టాక్. సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ ఈనెల 20వ తేదీన ముంబై బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో మగబిడ్డను కంది. ఆమెను ఆస్పత్రినుంచి గురువారమే డిశ్చార్జి చేశారు. తమ కొడుక్కి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని వీళ్లు పేరు పెట్టుకున్నారు. చివరిసారిగా చెఫ్ షూటింగులో సైఫ్ ఈనెల 12న పాల్గొన్నాడని, జనవరి రెండోవారం తర్వాత నుంచి మళ్లీ వస్తాడని చిత్ర దర్శకుడు రాజా కృష్ణ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, దాన్ని విదేశాల్లో తీస్తామని అన్నారు. ఇందుకోసం తాను అమెరికా, యూరప్ దేశాల్లో కొన్ని ప్రాంతాలు చూశానని, త్వరలోనే ఖరారు చేస్తానని చెప్పారు. ఈయన ఇంతకుముందు అక్షయ్ కుమార్ హీరోగా ఎయిర్‌లిఫ్ట్ సినిమా తీశారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సైఫ్ చేసిన 'రంగూన్' సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. -
పెటర్నిటీ లీవ్ లో ప్రేయసితో షికార్లు
- జపాన్ ఎంపీ నిర్వాకం.. పదవికి రాజీనామా టోక్యో: 'చెప్పేవి నీతి సూత్రాలు, చేసేవే హీనమైన పనులు సామెతకు కరెక్ట్ గా సరిపోతాడు మా పార్లమెంట్ సభ్యుడుగారు' అంటూ తమ ఎంపీని తూర్పారబడుతున్నారు క్యోటో- 3 నియోజకవర్గ ప్రజలు. అధికార పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ ఎంపీ పేరు కెన్సుకె మియజాకి. వయసు 34. ఆయన చేసిన నిర్వాకం గురించే ప్రస్తుతం జపనీయులు చెవులు కొరుక్కుంటూ నెట్ లో షేర్లూ చేస్తున్నారు. అంతలా 'అది' ప్రచారం పొందటానికి బలమైన కారణం కూడా ఉంది.. మియజాకి.. జపాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి పెటర్నిటీ లీవ్ తీసుకున్న ప్రజాప్రతినిధి. అవును. టెక్నాలజీలో అందరికంటే ముందున్నప్పటికీ పాతకాలపు పితృస్వామ్య భావనను వదిలించుకోలేకపోతున్న జపాన్ లో పెటర్నిటీ లీవుల వినియోగం 2 శాతానికి మించట్లేదు. పురుడు పోసుకునేటప్పుడు భార్య పక్కనే ఉండి ఆమెకు మనోధైర్యాన్ని కల్గించాలని, ఆ మేరకు పెటర్నిటీ లీవ్ ల వినియోగం పెరగాలని మియజాకి చాలాసార్లు వాదించారు. చెప్పినదాన్ని ఆచరిస్తున్నట్టు.. తన భార్యకు నెలలు నిండటంతో జనవరి చివరివారం, ఫిబ్రవరి మెదటి రెండు వారాలు పెటర్నిటీ లీవ్ తీసుకున్నారాయన. ఇక్కడివరకు బాగానే ఉందికానీ.. ఫిబ్రవరి 4న బిడ్డ పుట్టడానికి కొద్ది గంటల ముందు క్యోటో నగరంలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యాడాయన. అదికూడా సహచర మహిళా ఎంపీ మెగుమి కనెకోతో కలిసి. ఇద్దరూ చనువుగా కలిసున్న ఫొటోలను స్థానిక పత్రిక ప్రచురించడంతో ఎంపీగారి నిర్వాకం బట్టబయలైంది. 'పెటర్నిటీ లీవ్ పెట్టి ప్రేయసితో షికార్లు కొట్టిన ఎంపీ' శీర్షికలతో ఇద్దరు ఎంపీల ఫొటోలు అన్ని పత్రికల్లోనూ అచ్చయ్యాయి. చివరికి తాను చేసింది తప్పేనని మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పిన మియజాకి.. పదవికి రాజీనామాచేస్తున్నట్లు బుధవారం టోక్యోలో ప్రకటించారు. మహిళా ఎంపీతో అఫైర్ నిజమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. అయితే సదరు మహిళా ఎంపీ మెగుమి మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు నోరుతెరిచిందిలేదు. 'కీలకమైన సమయంలో నా గురించిన వార్తలు నా భార్యను కలవరపెట్టాయి. నిజానికి బిడ్డ పుట్టినప్పుడు నేను ఆమెతోనే ఉన్నా. సహచర మహిళా ఎంపీతో తిరగలేదని చెప్పట్లేదు కానీ ఆ సంగతులన్నీ నా భార్యకు వివరించా. ఆవిడ అర్థం చేసుకుందికానీ, ప్రజల్లో మాత్రం నాపై వ్యతిరేకత వ్యక్తవమైంది. అందుకే రాజీనామాచేస్తున్నా' అని ఉద్వేగంగా ప్రసంగించారు మియజాకి. -
2 నెలలు లీవ్ పెడుతున్న ఫేస్బుక్ సీఈవో
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (31) తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ (భార్య ప్రసవించినపుడు భర్తకు ఇచ్చే సెలవు) తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతోపాటు తన ఫేస్బుక్ పేజీలో పాప ఫోటోను కూడా షేర్ చేశాడు. అయితే సెలవులో ఉన్నపుడు మార్క్ జుకర్ బర్గ్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదంటూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఫేస్బుక్ యూజర్లలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై అటు ఫేస్ బుక్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని జుకర్‌బర్గ్ అంటోంటే, ఆయన పెటర్నటీ లీవ్ అసాధారణంగా ఉందని కొంతమంది టెక్నికల్ సంస్థలకు చెందిన వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ టెక్ సంస్థల హై లెవల్ అధికారులు ఇంత సుదీర్ఘ కాలం పెటర్నిటీ లీవ్ ఎపుడూ తీసుకోలేదంటున్నారు. యాహూ మహిళా సీఈవో మారిస్సా మేయర్ కూడా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నటీ తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తమ ఉద్యోగులకు నాలుగు నెలల జీతంతో కూడిన పెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీన్ని ఒకేసారిగానీ, బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో ఎపుడైనా కానీ వాడుకోవచ్చు. తాము తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త తెలిసిన తరువాత గత జులైలో జుకర్‌బర్గ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు ఫేస్ బుక్ జుకర్ బర్గ్ లీవ్ పెట్టిన పోస్ట్ పెట్టిన ఒక గంటలోనే 50 వేల లైకులు మూడు వేల షేర్లు కొట్టేసింది. అంతేకాదు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పలువురు సందేశాల వెల్లువ కురిపించారు. వీరిలో ఫేస్బుక్ సీఓఓ షెర్లే శాండ్‌బర్గ్ కూడా ఒకరు. జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా చాన్ కు అభినందనలు తెలిపిన ఆమె తొందర్లోనే చాన్ ను కలుస్తానంటూ కమెంట్ చేశారు.