సహచర ఎంపీ మెగుమి కనెకోతో క్యోటో పార్లమెంట్ సభ్యుడు కెన్సుకె మియజాకి.
- జపాన్ ఎంపీ నిర్వాకం.. పదవికి రాజీనామా
టోక్యో: 'చెప్పేవి నీతి సూత్రాలు, చేసేవే హీనమైన పనులు సామెతకు కరెక్ట్ గా సరిపోతాడు మా పార్లమెంట్ సభ్యుడుగారు' అంటూ తమ ఎంపీని తూర్పారబడుతున్నారు క్యోటో- 3 నియోజకవర్గ ప్రజలు. అధికార పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ ఎంపీ పేరు కెన్సుకె మియజాకి. వయసు 34. ఆయన చేసిన నిర్వాకం గురించే ప్రస్తుతం జపనీయులు చెవులు కొరుక్కుంటూ నెట్ లో షేర్లూ చేస్తున్నారు. అంతలా 'అది' ప్రచారం పొందటానికి బలమైన కారణం కూడా ఉంది..
మియజాకి.. జపాన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి పెటర్నిటీ లీవ్ తీసుకున్న ప్రజాప్రతినిధి. అవును. టెక్నాలజీలో అందరికంటే ముందున్నప్పటికీ పాతకాలపు పితృస్వామ్య భావనను వదిలించుకోలేకపోతున్న జపాన్ లో పెటర్నిటీ లీవుల వినియోగం 2 శాతానికి మించట్లేదు. పురుడు పోసుకునేటప్పుడు భార్య పక్కనే ఉండి ఆమెకు మనోధైర్యాన్ని కల్గించాలని, ఆ మేరకు పెటర్నిటీ లీవ్ ల వినియోగం పెరగాలని మియజాకి చాలాసార్లు వాదించారు. చెప్పినదాన్ని ఆచరిస్తున్నట్టు.. తన భార్యకు నెలలు నిండటంతో జనవరి చివరివారం, ఫిబ్రవరి మెదటి రెండు వారాలు పెటర్నిటీ లీవ్ తీసుకున్నారాయన. ఇక్కడివరకు బాగానే ఉందికానీ..
ఫిబ్రవరి 4న బిడ్డ పుట్టడానికి కొద్ది గంటల ముందు క్యోటో నగరంలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యాడాయన. అదికూడా సహచర మహిళా ఎంపీ మెగుమి కనెకోతో కలిసి. ఇద్దరూ చనువుగా కలిసున్న ఫొటోలను స్థానిక పత్రిక ప్రచురించడంతో ఎంపీగారి నిర్వాకం బట్టబయలైంది. 'పెటర్నిటీ లీవ్ పెట్టి ప్రేయసితో షికార్లు కొట్టిన ఎంపీ' శీర్షికలతో ఇద్దరు ఎంపీల ఫొటోలు అన్ని పత్రికల్లోనూ అచ్చయ్యాయి. చివరికి తాను చేసింది తప్పేనని మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పిన మియజాకి.. పదవికి రాజీనామాచేస్తున్నట్లు బుధవారం టోక్యోలో ప్రకటించారు. మహిళా ఎంపీతో అఫైర్ నిజమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. అయితే సదరు మహిళా ఎంపీ మెగుమి మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు నోరుతెరిచిందిలేదు.
'కీలకమైన సమయంలో నా గురించిన వార్తలు నా భార్యను కలవరపెట్టాయి. నిజానికి బిడ్డ పుట్టినప్పుడు నేను ఆమెతోనే ఉన్నా. సహచర మహిళా ఎంపీతో తిరగలేదని చెప్పట్లేదు కానీ ఆ సంగతులన్నీ నా భార్యకు వివరించా. ఆవిడ అర్థం చేసుకుందికానీ, ప్రజల్లో మాత్రం నాపై వ్యతిరేకత వ్యక్తవమైంది. అందుకే రాజీనామాచేస్తున్నా' అని ఉద్వేగంగా ప్రసంగించారు మియజాకి.