కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..! | Issue Of Paternity Leave: Baby Dolls In Slings Are Being Tied To Statues In The UK | Sakshi
Sakshi News home page

Paternity Leave: కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!

Published Fri, Sep 20 2024 2:57 PM | Last Updated on Fri, Sep 20 2024 5:16 PM

Issue Of Paternity Leave: Baby Dolls In Slings Are Being Tied To Statues In The UK

‘కనేది ఆమె అయినా అతడికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టంగా మారింది. కాబట్టి ఈ రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాల్సిన పరిస్థితి. ఇలాంటి సరికొత్త ఆలోచనకు నాంది పలకక తప్పని పరిస్థితి. అందువల్ల మహిళలకు ఇచ్చినట్లే కాబోయే తండ్రులకు కూడా సెలవులు ఇవ్వాల్సిందే. అయితే ఈ పెటర్నటీ సెలవులు ఉండి ఉన్నట్లుగా ఉన్నాయంతే. చాలా కంపెనీలు సరిగా ఇవ్వనే ఇవ్వడం లేదు. ఈ విషయమై లండన్‌లో పెద్ద ఎత్తున అసంతృప్తి నిరసనల రూపంలో వ్యక్తమవుతోంది. 

యూకే అంతటా పురుషుల విగ్రహాలు బేబీ క్యారియర్‌ల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఓ చిన్న శిశువు బొమ్మ పురుషుడి మెడకు చుట్టి ఉంచినట్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహాలు ప్రపంచమంతటా హాట్‌టాపిక్‌గా నిలిచాయి. అందుకు కారణం పెటర్నటీ సెలవులు. కాబోయే తండ్రులకు సెలవులు ఇవ్వాలని చెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ది డాడ్‌ షిఫ్ట్‌ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 

అంతేగాదు కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత కీలకం అనే విషయంపై అంతా దృష్టి సారించేలా ఈ విధంగా చేస్తున్నారు అక్కడ. పితృత్వ సెలవులు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?, వారి పాత్ర కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేయగలదు? అని నొక్కి చెప్పేలా అడుగడుగున ఇలాంటి పురుష విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అంతేగాదు నిరసనకారులు తమ అభ్యర్థనలతో యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్‌మర్‌కు బహిరంగ లేఖను కూడా అందించారు. నిజానికి యూకే రెండు వారాల పితృత్వ సెలవును అందిస్తుంది. అంతేగాక వారానికి సుమారు రూ. 20,300 చెల్లిస్తోంది కూడా. 

అయితే బెల్జియం వంటి యూరోపియన్‌ దేశాలు మాత్రం ఈ పెటర్నటీ సెలవల్ని 20 రోజులకు పెంచింది. అంటే..యూరోపియన్‌ పార్లమెంట్‌ ఆదేశాల ప్రకారం ఫిన్లాండ్‌లో తల్లిదండ్రులిద్దరికీ 160 రోజులు వేతనంతో కూడిన సెలవులందిస్తోంది. అయితే మన భారతదేశంలో ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగులకు పితృత్వ సెలవులపై తప్పనిసరి చట్టం లేదు. కానీ 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) నిబంధనల ప్రకారం, పురుష ప్రభుత్వ ఉద్యోగులు 15 రోజుల పితృత్వ సెలవులకు అర్హులు. 

ఈ విషయంపై ఇదివరకటి రోజల్లో అంతగా ప్రామఖ్యత లేదు. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సెలవులు తప్పనిసరి అని చెప్పొచ్చు. కాన్పు సమయంలో అమ్మ కాబోతున్న మహిళల్లో సైతం ఒక విధమైన ఆందోళన ఉంటుంది. ఇప్పుడూ ఎవరికీ వారే అనే యమునా తీరే అన్నట్లుగా న్యూక్లియర్‌ ఫ్యామిలీలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటప్పుడూ భర్త తోడు ఉండాలి. దీనివల్ల తండ్రిగా తన బాధ్యతలను ఎలా పంచుకోవాలో తెలియడమే గాక ఓ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలనేది తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.

(చదవండి: మరోసారి హాట్‌టాపిక్‌గా మార్లిన్‌ మన్రో జీవితం..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement