జపాన్ దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన అక్కడి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పితృత్వ సెలవులకు చట్టబద్ధత కల్పించింది. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న దశాబ్ది కాలంలో జనాభా క్షీణతను నివారించవచ్చని భావిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం, పురుషులు 80 శాతం జీతంతో నాలుగు వారాల పితృత్వ సెలవులకు అర్హులుగా జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇదిలా ఉండగా.. తండ్రులు మాత్రం వాటిని తీసుకునేందుకు భయపడుతున్నారట. పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవుల విషయంలో నూతన విధానాలను తెరపైకి తీసుకొచ్చింది కిషిదా ప్రభుత్వం. దీని ప్రకారం సెలవులు తీసుకుంటున్న 14 శాతం ఉద్యోగుల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి, 2030 నాటికి 85 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం నిర్ణయం బాగానే ఉన్నా పితృత్వ సెలవులు తీసుకోవడం వల్ల తాము పని చేస్తున్న సంస్థ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని చాలా వరకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఎందుకంటే అన్ని రోజులు ఉద్యోగులు సెలవు తీసుకోవడం ద్వారా.. అది వారి ప్రమోషన్ అవకాశాలు దెబ్బతీయడంతో పాటు వారి కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, అంతేకాకుండా సెలవుల అనంతరం వారికి ఇతర బాధ్యతలు అప్పజెప్పే ప్రమాదం ఉందని భావించడమే ఇందుకు ప్రధాన కారణమట. జపాన్‌లో కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment