టోక్యో: ‘పెటర్నటి లీవ్’(పితృత్వ సెలవు) అడిగినందుకు తనను అవమానించడమే కాక.. డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు సమర్పించాల్సిందిగా ఆదేశించారంటూ 2015లో ఓ వ్యక్తి కోర్టులో వేసిన కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే అత్యల్ప బర్త్ రేట్‌తో సతమతమవుతోన్న జపాన్ తాజా వివాదంతో ఒక్కసారి ఉల్కిపడింది. 2015లో జరిగిన ఈ కేసు వివరాలు.. కెనడాకు చెందిన గ్లేన్ వుడ్(49) గత ముప్పై ఏళ్లుగా జపాన్‌లో నివాసం ఉంటూ అక్కడే పని చేస్తున్నాడు. అప్పుడు అతని భార్య నేపాల్‌లో ఉద్యోగం చేస్తుంది. అప్పటికే ఆమె గర్భవతి. డెలీవరి సమయానికి భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో వుడ్ పెటర్నటి లీవ్‌కు దరఖాస్తు చేశాడు. అయితే సదరు కంపెనీ అతడికి సెలవు మంజూరు చేయకుండా.. పుట్టిన బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేపించి, వుడ్డే ఆ బిడ్డకు తండ్రని నిరూపిస్తేనే సెలవు ఇస్తామని తెలిపింది.
దాంతో తప్పని సరి పరిస్థితుల్లో వుడ్ నేపాల్‌లో ఉన్న తన బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేపించి.. ఆ రిపోర్ట్స్‌ను తన కంపెనీలో సమర్పించాడు. ఆ తర్వాతే అతడికి సెలవు లభించింది. ఆ తర్వాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో వుడ్ మెడికల్ లీవ్ తీసుకున్నాడు. అయితే కంపెనీ అతడికి జీతం చెల్లించకపోవడమే కాక.. ఉద్యోగంలో నుంచి తొలగించింది. దాంతో కంపెనీ తీరును ఎండగడుతూ.. కోర్టులో కేసు వేశాడు వుడ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. ‘ఇది కంపెనీ పాత పద్దతనుకుంటా. అయితే ఇక్కడ నాకు ఇప్పటికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. డీఎన్‌ఏ రిపోర్టు సమర్పించే వరకు కంపెనీ నాకు పెటర్నటి లీవ్ ఇవ్వలేదు. నెలలు నిండకుండానే నా కుమారుడు జన్మించడంతో.. తనని ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. వీటన్నింటిని నా భార్య ఒక్కతే చూసుకుంది. ఆ సమయంలో తను చాలా ఇబ్బంది పడింది. క్రిస్టమస్ తర్వాతే నాకు లీవ్ దొరికింది’ అన్నాడు వుడ్.
‘ఆ తర్వాత 2016, మార్చిలో నా కుమారుడ్ని తీసుకుని జపాన్ వచ్చేశాను. కానీ పని ఒత్తిడి వల్ల నా ఆరోగ్యం చెడిపోయింది. దాంతో ఆరు నెలల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నాను. తర్వాత విధుల్లో చేరాను. కానీ కంపెనీ నాకు ఆరు నెలల వేతనాన్ని చెల్లించలేదు. అంతేకాక నన్ను ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. ఈ అంశంలో నాకు న్యాయం జరగడం కోసం కోర్టును ఆశ్రయించాను’ అని తెలిపాడు వుడ్. జపాన్ చట్టం ప్రకారం అక్కడి కంపెనీలు బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇద్దరికి ఏడాది పాటు సెలవు ఇవ్వాలి. అదికాక మరో ఆరు నెలల సెలవును కూడా అదనంగా మంజూరు చేయాలి. అయితే జపాన్‌లో పెటర్నటి సెలవు తీసుకునే వారి పురుషుల సంఖ్య చాలా తక్కువని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment