2 నెలలు లీవ్ పెడుతున్న ఫేస్బుక్ సీఈవో
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (31) తన ముద్దుల కూతురు కోసం రెండు నెలల పెటర్నిటీ లీవ్ (భార్య ప్రసవించినపుడు భర్తకు ఇచ్చే సెలవు) తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతోపాటు తన ఫేస్బుక్ పేజీలో పాప ఫోటోను కూడా షేర్ చేశాడు.
అయితే సెలవులో ఉన్నపుడు మార్క్ జుకర్ బర్గ్ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదంటూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఫేస్బుక్ యూజర్లలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై అటు ఫేస్ బుక్ యాజమాన్యం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని జుకర్బర్గ్ అంటోంటే, ఆయన పెటర్నటీ లీవ్ అసాధారణంగా ఉందని కొంతమంది టెక్నికల్ సంస్థలకు చెందిన వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ టెక్ సంస్థల హై లెవల్ అధికారులు ఇంత సుదీర్ఘ కాలం పెటర్నిటీ లీవ్ ఎపుడూ తీసుకోలేదంటున్నారు. యాహూ మహిళా సీఈవో మారిస్సా మేయర్ కూడా కేవలం రెండు వారాలు మాత్రమే మెటర్నటీ తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు.
అయితే అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తమ ఉద్యోగులకు నాలుగు నెలల జీతంతో కూడిన పెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీన్ని ఒకేసారిగానీ, బిడ్డ పుట్టిన మొదటి సంవత్సరంలో ఎపుడైనా కానీ వాడుకోవచ్చు. తాము తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త తెలిసిన తరువాత గత జులైలో జుకర్బర్గ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
మరోవైపు ఫేస్ బుక్ జుకర్ బర్గ్ లీవ్ పెట్టిన పోస్ట్ పెట్టిన ఒక గంటలోనే 50 వేల లైకులు మూడు వేల షేర్లు కొట్టేసింది. అంతేకాదు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పలువురు సందేశాల వెల్లువ కురిపించారు. వీరిలో ఫేస్బుక్ సీఓఓ షెర్లే శాండ్బర్గ్ కూడా ఒకరు. జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా చాన్ కు అభినందనలు తెలిపిన ఆమె తొందర్లోనే చాన్ ను కలుస్తానంటూ కమెంట్ చేశారు.