![Tamilnadu Government U Turn On All Pass Order For Arrear Exams - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/16/online-exam.jpg.webp?itok=VUl1AeNU)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన ‘అరియర్స్’ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం షాక్ ఇచ్చింది. ఆల్‌పాస్ ఉత్తర్వుల నుంచి యూటర్న్ తీసుకుంది. అరియర్స్ విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందేనని ప్రకటించింది. ఇందుకు తగ్గ నివేదిక గురువారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కరోనా విలయతాండవంతో గత విద్యా సంవత్సరం జరగాల్సిన ప్లస్‌టూ మినహా, తక్కిన అన్ని పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పది విద్యార్థులకు ఆల్‌పాస్ ప్రకటించారు. అదే తరహాలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు మినహా, తక్కిన సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి తర్వాత సంవత్సరానికి ప్రమోట్ చేశారు.
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, అనేక సబ్జెక్టుల్లో ఫెయిలై ఏళ్ల తరబడి అరియర్స్‌ను భుజాన వేసుకుని ఉన్న విద్యార్థులకు ఊరట కల్గించే రీతిలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆల్‌పాస్ ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు చేరింది. విచారణ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధమని యూజీసీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని అరియర్స్ విద్యార్థులు ఎదురుచూశారు. ఆల్ పాస్ ప్రకటన సమయంలో పాలక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఈ విద్యార్థులకు తాజాగా షాక్ తప్పలేదు. పరీక్ష రాయాల్సిన పరిస్థితి. అయితే, ఇది నామమాత్రంగా ఉంటుందా వేచి చూడాల్సిందే.?
ఆన్‌లైన్‌లో పరీక్ష..
తమ నిర్ణయాన్ని సమర్థించుకునే రీతిలో కోర్టులో వాదన వినిపిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. ఓ వైపు ఏఐసీటీఈ, మరో వైపు యూజీసీ, ఇంకో వైపు కోర్టు రూపంలో వ్యతిరేకత , అక్షింతలు ఎదురుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం తగ్గాల్సిన పరిస్థితి. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయనారాయన్ హాజరై నివేదికను సమర్పించారు. అందులో అరియర్స్ విద్యార్థుల ఆల్ పాస్ ఉత్తర్వులను వెనుక్కి తీసుకుంటూ, పరీక్ష నిర్వహించన్నుట్టు ప్రకటించారు. అరియర్స్ విద్యార్థులందరికి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నామని వివరించారు.
ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులే ఉత్తీర్ణతకు అర్హులు అవుతారని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటిస్తాయని పేర్కొంటూ, యూజీసీ వర్గాలతో మరో మారు సంప్రదింపులు జరిపి సజావుగా అన్ని వ్యవహరాలు సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ, ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకు ఎనిమిది వారాలు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతలోపు అన్ని ప్రక్రియలు ముగించి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలైకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment