మద్రాస్ హైకోర్టు(ఫైల్ ఫొటో)
సాక్షి, చెన్నై: తమిళనాడులో జల్లికట్టు క్రీడలో ఇకపై నాటు ఎద్దులను మాత్రమే వినియోగించాలని నిర్వాహకుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇందుకు తగ్గ తీర్పును గురువారం వెలువరించింది. తమిళుల సాహసక్రీడగా జల్లికట్టు ప్రపంచప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికుల రూపంలో నిషేధాన్ని కొన్ని సంవత్సరాలు ఎదుర్కొన్నా, చివరకు మహోద్యమం ద్వారా ఈ క్రీడను తమిళులు మళ్లీ దక్కించుకున్నారు. ఏటా సంక్రాంతి పర్వదినం వేళ కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఈ క్రీడ నిర్వహిస్తున్నారు.
కాగా ఒక్కియం తురై పాక్కంకు చెందిన శేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో జల్లికట్టులో కేవలం నాటు ఎద్దులను మాత్రమే ఉపయోగించాలన్న వాదన తెర మీదకు వచ్చింది. వాదనల అనంతరం హైకోర్టు బెంచ్ స్పందిస్తూ, జల్లికట్టు క్రీడలో కేవలం నాటు ఎద్దుల్ని మాత్రమే ఉపయోగించాలని, విదేశీ, స్వదేశంలోని ఇతర జాతుల ఎద్దులను, ఆవుల్ని ఉపయోగించకూడదని తీర్పు ఇచ్చారు. ఈమేరకు పశువైద్యుడి సర్టిఫికెట్‌ను ఎద్దుల యజమానులు సమర్పించాలని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన పక్షంలో కోర్టు ధిక్కార కేసు తప్పదని హెచ్చరించారు.
లక్ష్మణ రేఖదాటి స్పందించబోం..
స్పీకర్ అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలు లక్ష్మణ రేఖ లాంటిదని, దానిని దాటే విధంగా తాము జోక్యం చేసుకోలేమని మద్రాసు హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అసెంబ్లీలో సభ్యులందరికీ.. సమానంగా పరిగణించాలని, ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదంటూ కోయంబత్తూరుకు చెందిన లోకనాథన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ, ఒక సభ్యుడు ఎక్కడ.. ఎలా.. కూర్చోవాలి, ఎంత సేపు మాట్లాడాలి అన్న వ్యవహారాలన్నీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాము వ్యాఖ్యానించబోమని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment