సీజే, జడ్జీల ఖాళీల భర్తీపై పిల్ కొట్టివేత
- నియామక ప్రక్రియ కొనసాగుతోందని సుప్రీం చెప్పింది
- దాన్ని గౌరవిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంతో పాటు న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేలా కేంద్రం, సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతోందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో దానిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ప్రస్తుతం హైకోర్టులోని న్యాయమూర్తుల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు మాత్రమే ఉన్నారన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇది ఎంతమాత్రం సరికాదని, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన న్యాయమూర్తులు ఉన్నారని, వారి పూర్వీకులు తెలంగాణవారు కారన్న కారణంతో వారిని ఈ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. సదరు న్యాయమూర్తుల డీఎన్‌ఏలో వారి పూర్వీకులు ఇక్కడి వారేనని తేలితే తప్ప వారిని ఇక్కడి వారిగా పరిగణించేటట్లు లేరని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణి యన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.
మా వద్ద మంత్రదండమేమీ లేదు..
హైకోర్టుకు 22 నెలలుగా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరని, అలాగే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌పై ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండమేదీ లేదని తన తీర్పులో వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ విస్తృతమైన సంప్రదింపులతో జరిగేదని గుర్తు చేసింది.
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు విశ్వసనీయతనిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నామే తప్ప, ఆ వ్యాజ్యాన్ని విచారించే న్యాయ పరిధి లేకో.. వ్యాజ్యానికి విచారణార్హత లేకో కాదని తెలిపింది. హైకోర్టులో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో న్యాయమూర్తులపై భరించలేనంత పనిభారం పెరగడంతో పాటు, పెండింగ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు కొలీజియం న్యాయవాదుల నుంచి ఆరుగురు పేర్లను, జిల్లా జడ్జీల నుంచి నలుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తే, వారిలో నలుగురే నియమితులయ్యారని పేర్కొంది.