quash
-
సర్కారు నిర్ణయంతో పవన్ క్వాష్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై కోర్టుల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం పవన్ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.కాగా, గతేడాది ఏలూరులో పవన్ మాట్లాడుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
పోలీసులపై దాడి కేసులో టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో సానుకూల ఉత్తర్వులు పొందేందుకు తమకే సాధ్యమైన అనైతిక ఎత్తుగడలను రచించే టీడీపీ పెద్దలు మరోసారి అలాంటి దారినే ఎంచుకున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల పోలీసులపై దాడి ఘటనలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. హైకోర్టులో ఇప్పటికే కొందరు నాయకులతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ అధినాయకత్వం... పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మరి కొందరితో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయించింది. హైకోర్టులో రోస్టర్ ప్రకారం ముందస్తు బెయిల్ పిటిషన్లు ఓ న్యాయమూర్తి, క్వాష్ పిటిషన్లు మరో న్యాయమూర్తి వేర్వేరుగా విచారిస్తున్నారు. ఓ చోట సానుకూల ఉత్తర్వులు రాకపోయినా మరోచోట సానుకూల ఉత్తర్వులు పొందవచ్చనే ‘దూరాలోచన’తో టీడీపీ నాయకత్వం ఇలా వేర్వేరు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. రెండు పిటిషన్లలోనూ వారికి కావాల్సింది అరెస్ట్ నుంచి తప్పించుకోవడమే. అందుకే వ్యూహాత్మకంగా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. నేతల తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులందరూ దాదాపుగా ఆ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన వారే. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేతలు మధ్యంతర ఉత్తర్వుల కింద తమకు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతుండగా, క్వాష్ పిటిషన్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో తమ అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థి స్తున్నారు. హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరం కింద కేసులు నమోదు కాగా, ఆ సెక్షన్‌ను పట్టించుకోకుండా తమకు సీఆర్సీపీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని వారు క్వాష్ పిటిషన్లో కోరారు. హత్యాయత్నం నేరాన్ని తేలికగా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడేలా పోలీసులను కొట్టడమే కాకుండా, వారిని చంపండిరా అంటూ ఉసిగొల్పిన టీడీపీ నేతలు సీఆర్సీపీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని కోర్టును కోరడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతల దాడిలో ఓ పోలీసు ఏకంగా కళ్లు కోల్పోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసు నమోదైన వారం రోజులకే కొట్టేయాలని కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల కుయుక్తులు అందరికీ తెలుసు. ముఖ్యంగా న్యాయమూర్తులందరికీ బాగా తెలుసు. గతంలో టీడీపీ పెద్దలు ఇలాంటి కుయుక్తులతో విజయం సాధించినా, ఇప్పుడు వారి బాగోతం అందరికీ తెలిసిపోయింది. అలాంటి అనైతిక ఎత్తులు పనిచేసే అవకాశం లేదన్నది న్యాయవర్గాల మాట. గతంలో నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్.... గతంలో టీడీపీ నాయకత్వం నాట్ బిఫోర్ , బెంచ్ హంటింగ్ వంటి దుష్ట పన్నాగాలను అమలు చేసి విజయం సాధించింది. నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి సాధారణ ప్రజలకు తెలియదు. కేవలం న్యాయవాదులకు మాత్రమే తెలిసిన నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి జన బాహుళ్యానికి తెలియచేసింది తెలుగుదేశం పార్టీనే. న్యాయమూర్తుల నైతిక విలువలను అలుసుగా తీసుకుని ఎన్నో సార్లు అనైతిక పద్ధతుల్లో ప్రయోజనం పొందింది. అయితే ప్రస్తుతం అలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.ఇలాంటి ఎత్తుగడలతో విసిగిపోయిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు నాట్ బిఫోర్కు చెల్లు చీటీ పాడారు. నాట్ బిఫోర్ లేని న్యాయమూర్తుల వద్దకు తమ కేసు వస్తే దానిని తప్పించేందుకు టీడీపీ పలు ఎత్తుగడలు వేసేది. చీటికీ మాటికీ గొడవ పెట్టుకునే కొందరు పెయిడ్ న్యాయవాదులను ఇందుకోసం ఎంపిక చేసుకునేది. వారిని ఆ న్యాయమూర్తి కోర్టుకు పంపి అక్కడ న్యాయమూర్తి ఎంత సహనంగా ఉన్నా ఏదో రకంగా రెచ్చగొట్టి ఆ న్యాయవాదిని నాట్ బిఫోర్ చేయించేది. తద్వారా తమ కార్యం సాధించుకునేది. తరువాత కాలంలో కూడా ఏదైనా కేసు ఆ న్యాయమూర్తి వద్దకు వస్తే అప్పటికే నాట్‌బిఫోర్‌గా ఉన్న ఆ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించేది. ఇలా ఎన్నో కేసుల్లో నాట్ బిఫోర్ ఎత్తుగడలతో టీడీపీ నెగ్గుకొచ్చిది. పలు సందర్భాల్లో బెంచ్ హంటింగ్‌కు పాల్పడ్డారు. న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు.. ఇటీవల టీడీపీ మరింత బరి తెగించింది. ఎల్లో మీడియా చర్చా వేదికల్లో కొందరు పెయిడ్ ఆర్టీస్టులను కూర్చోబెట్టి వారితో న్యాయమూర్తులపై విషం చిమ్ముతోంది. ఇటీవల ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తిపై ఇలాగే నిరాధార ఆరోపణలు చేయించింది. చట్ట ప్రకారం ఆ న్యాయమూర్తి కేసు విచారణ నిర్వహించగా, ఆయన డబ్బు తీసుకున్నట్లు టీవీ లైవ్ చర్చలోనే ఆరోపణలు చేయించింది. తద్వారా ఆ న్యాయమూర్తి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయితే ఆయన చలించలేదు. చట్టప్రకారమే తీర్పు చెప్పారు. ఎల్లోమీడియా చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం పోలీసులపై జరిగిన దాడిని వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కళ్లు కోల్పోయేలా పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ దాడి ఘటనపై నమోదైన కేసుల్లో పోలీసుల తరఫున వాదించే బాధ్యతను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిది.అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. తద్వారా పోలీసుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని భావిస్తోంది. పోలీసులపై జరిగిన దాడి విషయంలో తెర వెనుక జరిగిన కుట్రకు సంబంధించిన పలు కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు ఇప్పటికే సాధించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపితే ఈ కుట్ర వెనుక దాగిన పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
సీజే, జడ్జీల ఖాళీల భర్తీపై పిల్ కొట్టివేత
- నియామక ప్రక్రియ కొనసాగుతోందని సుప్రీం చెప్పింది - దాన్ని గౌరవిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంతో పాటు న్యాయమూర్తుల పోస్టుల ఖాళీలను భర్తీ చేసేలా కేంద్రం, సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా, ఇతర న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగుతోందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో దానిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ప్రస్తుతం హైకోర్టులోని న్యాయమూర్తుల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు మాత్రమే ఉన్నారన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది ఎంతమాత్రం సరికాదని, హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన న్యాయమూర్తులు ఉన్నారని, వారి పూర్వీకులు తెలంగాణవారు కారన్న కారణంతో వారిని ఈ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. సదరు న్యాయమూర్తుల డీఎన్ఏలో వారి పూర్వీకులు ఇక్కడి వారేనని తేలితే తప్ప వారిని ఇక్కడి వారిగా పరిగణించేటట్లు లేరని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణి యన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. మా వద్ద మంత్రదండమేమీ లేదు.. హైకోర్టుకు 22 నెలలుగా పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి లేరని, అలాగే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌పై ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండమేదీ లేదని తన తీర్పులో వ్యాఖ్యానించింది. న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ విస్తృతమైన సంప్రదింపులతో జరిగేదని గుర్తు చేసింది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సంబంధించి అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు విశ్వసనీయతనిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నామే తప్ప, ఆ వ్యాజ్యాన్ని విచారించే న్యాయ పరిధి లేకో.. వ్యాజ్యానికి విచారణార్హత లేకో కాదని తెలిపింది. హైకోర్టులో పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని, దీంతో న్యాయమూర్తులపై భరించలేనంత పనిభారం పెరగడంతో పాటు, పెండింగ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉందని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు కొలీజియం న్యాయవాదుల నుంచి ఆరుగురు పేర్లను, జిల్లా జడ్జీల నుంచి నలుగురు పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేస్తే, వారిలో నలుగురే నియమితులయ్యారని పేర్కొంది. -
'కలాం పదవిని వదిలేయాలనుకున్నారు'
భువనేశ్వర్: బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని2005లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత నాడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం తన పదవిని వదులుకోవాలని భావించారని, ఆ రోజు ఆయన చాలా మదన పడ్డారని నాటి కలాం ప్రెస్ సెక్రటరీ ఎస్ఎం ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఆర్ఎన్ఐ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 'మై డేస్ విత్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ సోల్ ఎవెర్' అనే టాపిక్‌పై ఆదివారం శిక్ష్యా ఓ అన్సందన్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా ఈ అంశాన్ని గుర్తు చేశారు. 2005లో బిహార్ అసెంబ్లీని రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని దానిని రాష్ట్రపతికి పంపించిందని, ఆ సమయంలో దానిని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతిగా కలాంకు ఉందని, అయితే, అలా పంపిన తర్వాత మరోసారి అదే తీర్మానం రాష్ట్రపతి వద్దకు వస్తే తిరిగి పంపించే అధికారం ఆయనకు లేనందున అయిష్టంగానే కలాం సంతకం చేశారని, దానిని సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆ సమయంలో కలాం రామేశ్వరం వెళ్లి తన సోదరుడిని కూడా కలిసి ఈ విషయం మాట్లాడారని, తన పదవికి రాజీనామా చేద్దామనుకుంటున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారని ఎస్ఎం ఖాన్ చెప్పారు.