పుంగనూరు బైపాస్ వద్ద పోలీసులపై రాళ్లు విసురుతున్న టీడీపీ కార్యకర్తలు (ఫైల్)
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో సానుకూల ఉత్తర్వులు పొందేందుకు తమకే సాధ్యమైన అనైతిక ఎత్తుగడలను రచించే టీడీపీ పెద్దలు మరోసారి అలాంటి దారినే ఎంచుకున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల పోలీసులపై దాడి ఘటనలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. హైకోర్టులో ఇప్పటికే కొందరు నాయకులతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ అధినాయకత్వం... పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మరి కొందరితో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయించింది.
హైకోర్టులో రోస్టర్ ప్రకారం ముందస్తు బెయిల్ పిటిషన్లు ఓ న్యాయమూర్తి, క్వాష్ పిటిషన్లు మరో న్యాయమూర్తి వేర్వేరుగా విచారిస్తున్నారు. ఓ చోట సానుకూల ఉత్తర్వులు రాకపోయినా మరోచోట సానుకూల ఉత్తర్వులు పొందవచ్చనే ‘దూరాలోచన’తో టీడీపీ నాయకత్వం ఇలా వేర్వేరు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. రెండు పిటిషన్లలోనూ వారికి కావాల్సింది అరెస్ట్ నుంచి తప్పించుకోవడమే. అందుకే వ్యూహాత్మకంగా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. నేతల తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులందరూ దాదాపుగా ఆ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన వారే.
ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేతలు మధ్యంతర ఉత్తర్వుల కింద తమకు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతుండగా, క్వాష్ పిటిషన్‌లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో తమ అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థి స్తున్నారు. హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరం కింద కేసులు నమోదు కాగా, ఆ సెక్షన్‌ను పట్టించుకోకుండా తమకు సీఆర్‌సీపీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని వారు క్వాష్ పిటిషన్‌లో కోరారు. హత్యాయత్నం నేరాన్ని తేలికగా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడేలా పోలీసులను కొట్టడమే కాకుండా, వారిని చంపండిరా అంటూ ఉసిగొల్పిన టీడీపీ నేతలు సీఆర్‌సీపీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని కోర్టును కోరడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ నేతల దాడిలో ఓ పోలీసు ఏకంగా కళ్లు కోల్పోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసు నమోదైన వారం రోజులకే కొట్టేయాలని కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల కుయుక్తులు అందరికీ తెలుసు. ముఖ్యంగా న్యాయమూర్తులందరికీ బాగా తెలుసు. గతంలో టీడీపీ పెద్దలు ఇలాంటి కుయుక్తులతో విజయం సాధించినా, ఇప్పుడు వారి బాగోతం అందరికీ తెలిసిపోయింది. అలాంటి అనైతిక ఎత్తులు పనిచేసే అవకాశం లేదన్నది న్యాయవర్గాల మాట.
గతంలో నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్....
గతంలో టీడీపీ నాయకత్వం నాట్ బిఫోర్ , బెంచ్ హంటింగ్ వంటి దుష్ట పన్నాగాలను అమలు చేసి విజయం సాధించింది. నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి సాధారణ ప్రజలకు తెలియదు. కేవలం న్యాయవాదులకు మాత్రమే తెలిసిన నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి జన బాహుళ్యానికి తెలియచేసింది తెలుగుదేశం పార్టీనే. న్యాయమూర్తుల నైతిక విలువలను అలుసుగా తీసుకుని ఎన్నో సార్లు అనైతిక పద్ధతుల్లో ప్రయోజనం పొందింది. అయితే ప్రస్తుతం అలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.ఇలాంటి ఎత్తుగడలతో విసిగిపోయిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు నాట్ బిఫోర్‌కు చెల్లు చీటీ పాడారు.
నాట్ బిఫోర్ లేని న్యాయమూర్తుల వద్దకు తమ కేసు వస్తే దానిని తప్పించేందుకు టీడీపీ పలు ఎత్తుగడలు వేసేది. చీటికీ మాటికీ గొడవ పెట్టుకునే కొందరు పెయిడ్ న్యాయవాదులను ఇందుకోసం ఎంపిక చేసుకునేది. వారిని ఆ న్యాయమూర్తి కోర్టుకు పంపి అక్కడ న్యాయమూర్తి ఎంత సహనంగా ఉన్నా ఏదో రకంగా రెచ్చగొట్టి ఆ న్యాయవాదిని నాట్ బిఫోర్ చేయించేది. తద్వారా తమ కార్యం సాధించుకునేది. తరువాత కాలంలో కూడా ఏదైనా కేసు ఆ న్యాయమూర్తి వద్దకు వస్తే అప్పటికే నాట్‌బిఫోర్‌గా ఉన్న ఆ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించేది. ఇలా ఎన్నో కేసుల్లో నాట్ బిఫోర్ ఎత్తుగడలతో టీడీపీ నెగ్గుకొచ్చిది. పలు సందర్భాల్లో బెంచ్
హంటింగ్‌కు పాల్పడ్డారు.
న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు..
ఇటీవల టీడీపీ మరింత బరి తెగించింది. ఎల్లో మీడియా చర్చా వేదికల్లో కొందరు పెయిడ్ ఆర్టీస్టులను కూర్చోబెట్టి వారితో న్యాయమూర్తులపై విషం చిమ్ముతోంది. ఇటీవల ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తిపై ఇలాగే నిరాధార ఆరోపణలు చేయించింది. చట్ట ప్రకారం ఆ న్యాయమూర్తి కేసు విచారణ నిర్వహించగా, ఆయన డబ్బు తీసుకున్నట్లు టీవీ లైవ్ చర్చలోనే ఆరోపణలు చేయించింది. తద్వారా ఆ న్యాయమూర్తి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయితే ఆయన చలించలేదు. చట్టప్రకారమే తీర్పు చెప్పారు. ఎల్లోమీడియా చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేశారు.
అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం
పోలీసులపై జరిగిన దాడిని వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కళ్లు కోల్పోయేలా పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ దాడి ఘటనపై నమోదైన కేసుల్లో పోలీసుల తరఫున వాదించే బాధ్యతను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిది.అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. తద్వారా పోలీసుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని భావిస్తోంది. పోలీసులపై జరిగిన దాడి విషయంలో తెర వెనుక జరిగిన కుట్రకు సంబంధించిన పలు కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు ఇప్పటికే సాధించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపితే ఈ కుట్ర వెనుక దాగిన పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment