రాజకీయ కుట్రల అమలులో పావుగా పోలీసు శాఖ.. కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థ దుర్వినియోగం
రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతిభద్రతలు
మహిళలు, చిన్నారులకు రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘రెడ్‌బుక్’ రాజ్యాంగానికి సెల్యూట్ చేయడంతోనే పోలీసులకు సరిపోతోంది! రాష్ట్రంలో చిన్నారులు వరుసగా అఘాయిత్యాలు, అపహరణకు గురవుతున్నా పట్టించుకునే తీరుబడి లేకుండా పోయింది. రాజకీయ కుట్రలకు వత్తాసు పలకడం, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అక్రమ కేసులు నమోదే పోలీసు శాఖ కర్తవ్యంగా మారింది. వెరసి టీడీపీ అరాచకాలు, అక్రమాల అమలే పోలీసుల ఏకైక అజెండాగా మారిపోయింది.
రెడ్‌బుక్‌కే పోలీస్ సెల్యూట్
కక్ష సాధింపు చర్యలే ఏకైక అజెండాగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి సర్కారు తమ రాజకీయ కుట్రలకు వత్తాసు పలకాల్సిందేనని పోలీసు శాఖకు నిర్దేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై పచ్చ ముఠాలు దాడులకు తెగబడ్డాయి. దాదాపు నెల రోజులపాటు యథేచ్ఛగా మారణహోమం కొనసాగినా పోలీసు శాఖ చేష్టలుడిగి చూస్తుండిపోయింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై అక్రమ కేసులు బనాయిస్తూ రెడ్‌బుక్ అరాచకాలకు కొమ్ముకాసింది. టీడీపీ గూండాల స్వైర విహారంతో ఏకంగా 3 వేల కుటుంబాలు కట్టుబట్టలతో స్వస్థలాలను వీడి వెళ్లినా పోలీసులకు ఏమాత్రం పట్టలేదు.
టీడీపీ కార్యాలయంపై దాడి ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, దేవినేని అవినాశ్ తదితరులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసుశాఖ విచారణ పేరుతో వేధిస్తూ కాలయాపన చేస్తోంది. ఇక చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో విజయవాడను వరదలు ముంచెత్తగానే పోలీసు శాఖ రంగంలోకి దిగి బోటు రాజకీయానికి వత్తాసు పలికింది. అయినా సరే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చలేకపోవడంతో ముంబై నటి కాదంబరి జత్వానీని తెరపైకి తెచ్చారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనను వక్రీకరిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ప్రభుత్వ పెద్దలు హుటాహుటిన హెలికాఫ్టర్‌లో పంపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు ఇవ్వాలని పోలీసు, రెవెన్యూ శాఖలు పలువురిపై ఒత్తిడి తెచ్చాయి. పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పలపై టీడీపీ గూండాలు పట్టపగలు దాడికి తెగబడితే పోలీసు యంత్రాంగం చోద్యం చూసింది. అక్రమ కేసులతో మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసింది. ఇక తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పోలీసు శాఖ వత్తాసు పలకడం దీనికి పరాకాష్ట. ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ము కాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నియామకం అందులో భాగమే. సుప్రీంకోర్టు అడ్డుకోవడంతో ఈ కుట్రకు అడ్డుకట్ట పడింది.
మహిళల భద్రత పట్టని పోలీసులు
గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 74 మంది మహిళలపై లైంగిక దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. బాధితుల ఫిర్యాదును స్వీకరించేందుకు సైతం పోలీసులు సుముఖత చూపకపోవడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు నిదర్శనం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రులో తమ చిన్నారి అపహరణకు గురైనట్లు ఓ నిరుపేద కుటుంబం మొరపెట్టుకున్నా పోలీసులు రెండు రోజులపాటు పట్టించుకోలేదు. ఆ చిన్నారి హత్యాచారానికి గురైనట్లు 15 రోజుల తరువాత ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. మూడు నెలలు గడిచినా మృతదేహాన్ని అప్పగించలేకపోయారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ బాలికను నిందితులు అపహరిస్తే పోలీçÜులు కనీసం 5 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చేపట్టపోవడం విస్మయకరం. నాలుగు రోజుల తరువాత పుంగనూరుకు 4 కి.మీ. దూరంలో ఆ బాలిక మృతదేహం లభించింది.
తాజాగా హిందూపురంలోఅత్తా కోడళ్లపై సామూహిక లైంగిక దాడి కేసును నీరుగారుస్తూ మూడు రోజులపాటు కాలయాపన చేశారు. రాయచోటిలో టీడీపీ నేత ఖాదర్ బాషా పెన్షన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బయటపెట్టిన అనంతరం ఓ బాధితురాలు కనిపించకుండా పోవడం గమనార్హం. శాంతి భద్రతలు దారుణంగా దిగజారడంతో బద్వేలులో ఓ విద్యార్థినిపై నిందితుడు లైంగిక దాడికి తెగబడి నిప్పంటించి దారుణంగా హతమార్చాడు. కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు తెనాలిలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి పాశవిక దాడికి తెగబడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment