bail petitions
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది.రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తేగా.. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు పూర్తి కాగా.. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో భుజంగరావు తిరుపతన్న ఉన్నారు. -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తెలిపారు. తమ కౌంటర్ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు
-
సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్ సిసోడియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..సిసోడియాపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. ‘సిసోడియాను ఈ విధంగా మీరు సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. ఇప్పటిదాకా మీరు వాదనలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు మొదలవుతాయి? మాకు ఈ విషయం రేపటి(మంగళవారం) కల్లా చెప్పండి’అని ధర్మాసనం ఎస్వీ రాజును ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, రాజు అవునని బదులిచ్చారు. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మార్చి 9వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి, తీహార్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. -
పోలీసులపై దాడి కేసులో టీడీపీ కొత్త ఎత్తులు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో సానుకూల ఉత్తర్వులు పొందేందుకు తమకే సాధ్యమైన అనైతిక ఎత్తుగడలను రచించే టీడీపీ పెద్దలు మరోసారి అలాంటి దారినే ఎంచుకున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఇటీవల పోలీసులపై దాడి ఘటనలపై నమోదైన కేసుల్లో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. హైకోర్టులో ఇప్పటికే కొందరు నాయకులతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయించిన టీడీపీ అధినాయకత్వం... పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మరి కొందరితో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయించింది. హైకోర్టులో రోస్టర్ ప్రకారం ముందస్తు బెయిల్ పిటిషన్లు ఓ న్యాయమూర్తి, క్వాష్ పిటిషన్లు మరో న్యాయమూర్తి వేర్వేరుగా విచారిస్తున్నారు. ఓ చోట సానుకూల ఉత్తర్వులు రాకపోయినా మరోచోట సానుకూల ఉత్తర్వులు పొందవచ్చనే ‘దూరాలోచన’తో టీడీపీ నాయకత్వం ఇలా వేర్వేరు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. రెండు పిటిషన్లలోనూ వారికి కావాల్సింది అరెస్ట్ నుంచి తప్పించుకోవడమే. అందుకే వ్యూహాత్మకంగా రెండు రకాల పిటిషన్లు దాఖలు చేయించింది. నేతల తరఫున పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులందరూ దాదాపుగా ఆ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన వారే. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన నేతలు మధ్యంతర ఉత్తర్వుల కింద తమకు తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతుండగా, క్వాష్ పిటిషన్లో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో తమ అరెస్ట్‌తో సహా తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థి స్తున్నారు. హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరం కింద కేసులు నమోదు కాగా, ఆ సెక్షన్‌ను పట్టించుకోకుండా తమకు సీఆర్సీపీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని వారు క్వాష్ పిటిషన్లో కోరారు. హత్యాయత్నం నేరాన్ని తేలికగా చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడేలా పోలీసులను కొట్టడమే కాకుండా, వారిని చంపండిరా అంటూ ఉసిగొల్పిన టీడీపీ నేతలు సీఆర్సీపీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి సరిపెట్టాలని కోర్టును కోరడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ నేతల దాడిలో ఓ పోలీసు ఏకంగా కళ్లు కోల్పోయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. కేసు నమోదైన వారం రోజులకే కొట్టేయాలని కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల కుయుక్తులు అందరికీ తెలుసు. ముఖ్యంగా న్యాయమూర్తులందరికీ బాగా తెలుసు. గతంలో టీడీపీ పెద్దలు ఇలాంటి కుయుక్తులతో విజయం సాధించినా, ఇప్పుడు వారి బాగోతం అందరికీ తెలిసిపోయింది. అలాంటి అనైతిక ఎత్తులు పనిచేసే అవకాశం లేదన్నది న్యాయవర్గాల మాట. గతంలో నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్.... గతంలో టీడీపీ నాయకత్వం నాట్ బిఫోర్ , బెంచ్ హంటింగ్ వంటి దుష్ట పన్నాగాలను అమలు చేసి విజయం సాధించింది. నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి సాధారణ ప్రజలకు తెలియదు. కేవలం న్యాయవాదులకు మాత్రమే తెలిసిన నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి వాటి గురించి జన బాహుళ్యానికి తెలియచేసింది తెలుగుదేశం పార్టీనే. న్యాయమూర్తుల నైతిక విలువలను అలుసుగా తీసుకుని ఎన్నో సార్లు అనైతిక పద్ధతుల్లో ప్రయోజనం పొందింది. అయితే ప్రస్తుతం అలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.ఇలాంటి ఎత్తుగడలతో విసిగిపోయిన న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు నాట్ బిఫోర్కు చెల్లు చీటీ పాడారు. నాట్ బిఫోర్ లేని న్యాయమూర్తుల వద్దకు తమ కేసు వస్తే దానిని తప్పించేందుకు టీడీపీ పలు ఎత్తుగడలు వేసేది. చీటికీ మాటికీ గొడవ పెట్టుకునే కొందరు పెయిడ్ న్యాయవాదులను ఇందుకోసం ఎంపిక చేసుకునేది. వారిని ఆ న్యాయమూర్తి కోర్టుకు పంపి అక్కడ న్యాయమూర్తి ఎంత సహనంగా ఉన్నా ఏదో రకంగా రెచ్చగొట్టి ఆ న్యాయవాదిని నాట్ బిఫోర్ చేయించేది. తద్వారా తమ కార్యం సాధించుకునేది. తరువాత కాలంలో కూడా ఏదైనా కేసు ఆ న్యాయమూర్తి వద్దకు వస్తే అప్పటికే నాట్‌బిఫోర్‌గా ఉన్న ఆ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించేది. ఇలా ఎన్నో కేసుల్లో నాట్ బిఫోర్ ఎత్తుగడలతో టీడీపీ నెగ్గుకొచ్చిది. పలు సందర్భాల్లో బెంచ్ హంటింగ్‌కు పాల్పడ్డారు. న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు.. ఇటీవల టీడీపీ మరింత బరి తెగించింది. ఎల్లో మీడియా చర్చా వేదికల్లో కొందరు పెయిడ్ ఆర్టీస్టులను కూర్చోబెట్టి వారితో న్యాయమూర్తులపై విషం చిమ్ముతోంది. ఇటీవల ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తిపై ఇలాగే నిరాధార ఆరోపణలు చేయించింది. చట్ట ప్రకారం ఆ న్యాయమూర్తి కేసు విచారణ నిర్వహించగా, ఆయన డబ్బు తీసుకున్నట్లు టీవీ లైవ్ చర్చలోనే ఆరోపణలు చేయించింది. తద్వారా ఆ న్యాయమూర్తి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. అయితే ఆయన చలించలేదు. చట్టప్రకారమే తీర్పు చెప్పారు. ఎల్లోమీడియా చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం పోలీసులపై జరిగిన దాడిని వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కళ్లు కోల్పోయేలా పోలీసులపై దాడికి ఉసిగొల్పిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ దాడి ఘటనపై నమోదైన కేసుల్లో పోలీసుల తరఫున వాదించే బాధ్యతను అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగిస్తూ ప్రత్యేక జీవో ఇచ్చిది.అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి పోలీసులకు న్యాయం జరిగేలా చూడాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. తద్వారా పోలీసుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని భావిస్తోంది. పోలీసులపై జరిగిన దాడి విషయంలో తెర వెనుక జరిగిన కుట్రకు సంబంధించిన పలు కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు ఇప్పటికే సాధించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపితే ఈ కుట్ర వెనుక దాగిన పెద్ద తలకాయలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. పెండింగ్ కేసులను తగ్గించే క్రమంలో వివాహ వివాదాలకు చెందిన బదిలీ, బెయిలు పిటిషన్లు చెరో పది చొప్పున అన్ని కోర్టులు విచారించాలని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయించామని సీజేఐ తెలిపారు. ‘‘ఫుల్ కోర్టు సమావేశంలో ప్రతి బెంచ్ రోజూ కుటుంబ వ్యవహారాలకు చెందిన పది బదిలీ పిటిషన్లు చేపట్టాలని నిర్ణయించాం. ఆ తర్వాత రోజూ పది బెయిలు సంబంధిత కేసులు.. శీతాకాల సెలవులకు ముందు పరిష్కరించాలని నిర్ణయించాం. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వివాహ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం 3 వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 కోర్టులు రోజూ పది బదిలీ కేసులు తీసుకుంటే రోజుకు 130 కేసులు చొప్పున వారానికి సుమారు 650 కేసులు పరిష్కరించొచ్చని సీజేఐ ఉదాహరించారు. శీతాకాల సెలవులకు ముందుగా ఈ బదిలీ కేసులు కొలిక్కి వస్తాయని తెలిపారు. అన్ని కోర్టులూ బెయిలు, బదిలీ పిటిషన్లు విచారించిన తర్వాత సాధారణ కేసులు విచారిస్తాయన్నారు. న్యాయమూర్తులు అర్ధరాత్రి వరకూ దస్త్రాలు చూడాల్సి వస్తుండడంతో వారిపై భారం తగ్గించాలని, అనుబంధ జాబితా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. -
జంట పేలుళ్ల నిందితుడు షర్ఫుద్దీన్కు చుక్కెదురు
* బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు * బెయిలిస్తే తిరిగి పట్టుకోవడం కష్టం * హైకోర్టుకు నివేదించిన అదనపు పీపీ * ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఫరూక్ షర్ఫుద్దీన్ తర్కాష్ అలియాస్ ఫరూక్ తర్కాష్ అలియాస్ అబ్దుల్లా బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2007, ఆగస్టు 25నలుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్క్ ఘటనలో 12 మంది మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోకుల్ ఛాట్ వద్ద 32 మంది చనిపోగా, 47 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తరువాత దర్యాప్తును అక్టోపస్‌కు బదిలీ చేశారు. పేలుళ్ల అనంతరం ముంబైలో తలదాచుకున్న ఉగ్రవాదులను అక్టోపస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తర్కాష్ను 2009లో పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తర్కాష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నాడు. ఈ పిటిషన్లను వ్యతిరేకిస్తూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుపై కింది కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని, ఇప్పుడు అతనికి బెయిల్ ఇస్తే మళ్లీ పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందన్నారు. అంతేకాక బెయిల్‌పై విడుదలైన తరువాత సాక్ష్యాలను తారు చేయడం, సాక్షులను బెదిరించడం వంటి చేయడంతో పాటు ఇండియన్ ముజాహిద్దీన్‌తో కలసి ఉగ్ర కార్యకలాపాలకు తిరిగి పాల్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఇలంగో బెయిల్ కోసం తర్కాష్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఫోర్జరీ సంతకాలతో బెయిల్!
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కోర్టుకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ ష్యూరిటీ పత్రాలు సమర్పించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో తమిళనాడుకు చెందిన వందలాది మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు పట్టుబడ్డారు. మరికొంత మంది చిన్న చిన్న నేరాలకు పాల్పడి అరెస్టయ్యారు. వారిని బెయిల్‌పై బయటకు తీసుకు వచ్చేందుకు చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు యువకులు రంగంలోకి దిగారు. తిరుపతిలోని కోర్టు భవనాల సముదాయం వద్ద వీరు నిందితుల బంధువులతో పెద్దమొత్తం డబ్బుకు ఒప్పందం కుదుర్చుకునేవారు. ఆ మేరకు బెయిల్‌కు కావాల్సిన ష్యూరిటీ పత్రాలు, అందుకు అవసరమైన తహశీల్దార్, ఎంపీడీవోల సంతకాలు, గ్రామరెవెన్యూ అధికారుల సంతకాలను వీరే ఫోర్జరీ చేసేవారు. తాము తయారు చేయించిన రబ్బర్ స్టాంపులతో అధికారుల సీల్ వేసి కోర్టులకు సమర్పించేవారు. ఈ వ్యవహారం ఆరు నెలలుగా సాగుతోంది. ఇటీవల చంద్రగిరి మండలం నుంచే ఎక్కువ బెయిల్ పిటిషన్లు దాఖలు కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అనుమానం వచ్చింది. వీటిపై విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతమందికి బెయిల్ ఇచ్చారనే సమాచారం రాబట్టడం కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. వీరు సమర్పించిన ష్యూరిటీల్లోని సంతకాలకు సంబంధించి చంద్రగిరి, తొండవాడ వీఅర్వోలను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలిసింది. బెయిల్ పిటిషన్లలో ఉన్న సంతకాలు తమవి కావని చెప్పినట్లు సమాచారం.