సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం | Cannot keep former deputy CM Manish Sisodia in jail in excise policy cases indefinitely | Sakshi
Sakshi News home page

సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేం

Published Tue, Oct 17 2023 6:05 AM | Last Updated on Tue, Oct 17 2023 6:05 AM

Cannot keep former deputy CM Manish Sisodia in jail in excise policy cases indefinitely - Sakshi

న్యూఢిల్లీ: ఎక్సైజ్‌ పాలసీ కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మనీష్‌ సిసోడియా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లపై జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..సిసోడియాపై మోపిన అభియోగాలపై దిగువ కోర్టులో వాదనలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటూ సీబీఐ, ఈడీల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజును ప్రశ్నించింది.

‘సిసోడియాను ఈ విధంగా మీరు సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. ఇప్పటిదాకా మీరు వాదనలను ఎందుకు ప్రారంభించలేదు? ఎప్పుడు మొదలవుతాయి? మాకు ఈ విషయం రేపటి(మంగళవారం) కల్లా చెప్పండి’అని ధర్మాసనం ఎస్‌వీ రాజును ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద సిసోడియాను ప్రాసిక్యూట్‌ చేయడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, రాజు అవునని బదులిచ్చారు. ఈ కేసులో మంగళవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. మార్చి 9వ తేదీన సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసి, తీహార్‌ జైలులో ఉంచిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement