‘మా హీరోకి బెయిల్‌ వచ్చింది’.. అంత సంబరపడిపోకండి.. ఆప్‌పై బీజేపీ సెటైర్లు | Manish Sisodia get Bail, BJP Says Don't Be Too Happy | Sakshi
Sakshi News home page

‘మా హీరోకి బెయిల్‌ వచ్చింది’.. అంత సంబరపడిపోకండి.. ఆప్‌పై బీజేపీ సెటైర్లు

Published Fri, Aug 9 2024 3:27 PM | Last Updated on Fri, Aug 9 2024 3:34 PM

Manish Sisodia get Bail, BJP Says Don't Be Too Happy

ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 17 నెలల క్రితం అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనిష్‌ సిసోడియాకు భారీ ఊరట దక్కింది. శుక్రవారం (ఆగస్ట్‌ 09) ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆప్‌ నేతలు మా ఢిల్లీ హీరోకి బెయిల్‌  వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తుంటే..అంత సంబరపడిపోకండి అంటూ’బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.

మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన బెయిల్‌ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో  సుప్రీం  ధర్మాససం ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని వ్యాఖ్యానించింది. చివరికి సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

సుప్రీం కోర్టులో సిసోడియాకు బెయిల్‌ రావడంపై ఆప్‌తో పాటు ఇతర ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్‌ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ చద్దా ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఢిల్లీ  విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మా హీరో మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ రావడం సంతోషంగా ఉంది. ఆయనకు బెయిల్‌ రావడంపై ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. - రాఘవ్‌ చద్దా

మరో ఆప్‌ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి  అతిషి సంతోషం వ్యక్తం చేశారు. అదే మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్న ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ త్వరలోనే ఈ కేసు నుంచి విముక్తి కలుగుతుందని అన్నారు.నిజం గెలిచింది. 17 నెలల తర్వాత  సిసోడియాకు ఈ రోజే బెయిల్‌ వచ్చింది. ఇది ఢిల్లీ ప్రజల విజయం. త‍ర్వలోనే కేజ్రీవాల్‌కు సైతం బెయిల్‌ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.-  అతిషి

మద్యం పాలసీ కేసులో అరెస్టై ఆరునెలల జైలు శిక్షను అనుభవించి.. బెయిల్‌పై విడుదలైన ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నియంతృత్వానికి ఈ తీర్పు చెంపదెబ్బలాంటిందని స్పష్టం చేశారు. - సంజయ్‌ సింగ్‌

అదే సమయంలో ఆప్‌ నేతల్ని టార్గెట్‌ చేస్తూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘సిసోడియాకు బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందంటూనే .. కేసులో నిందితుడికి బెయిల్ రావడం అంటే అభియోగాల నుండి విముక్తి పొందడం కాదు’అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు.  ‘విచారణలు జరుగుతున్నాయి.. త్వరలో కోర్టు సాక్ష్యాలను చూస్తుంది’ అని మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లేదా ఇతరులు ఎవరైనా సరే.. మద్యం పాలసీ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించారని, ఈ అంశం ప్రజా కోర్టులో అందరి ముందు ఉందని పునుద్ఘాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement