17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన మనీష్‌ సిసోడియా | Former Delhi Deputy CM AAP leader Manish Sisodia walks out of Tihar Jail. | Sakshi
Sakshi News home page

17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన మనీష్‌ సిసోడియా

Published Fri, Aug 9 2024 7:09 PM | Last Updated on Fri, Aug 9 2024 8:21 PM

Former Delhi Deputy CM AAP leader Manish Sisodia walks out of Tihar Jail.

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తిహార్‌ జైలు నుంచి విడుదల అయ్యారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. శుక్రవారం సాయంత్రం తిహార్‌జైలు నుంచి బయటకు వచ్చారు.  సిసోడియాకు ఘన స్వాగతం పలికేందుకు ఆప్‌ నేతలు అతిషి, సంజయ్‌ సింగ్‌.. పార్టీ కార్యకర్తలు జైలు గేటు వద్దకు భారీగా చేరకున్నారు.

జైలు నుంచి విడుదలైన సందర్భంగా మనీష్‌ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజల ప్రేమ, దేవుడి ఆశీర్వాదం, నిజానికి ఉన్న శక్తి కారణంగానే నేడు తాను జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. అన్నింటికి మించి తనను దేశ రాజ్యాంగమే రక్షించింనట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.

నియంతృత్వ ప్రభుత్వాలు, చట్టాల ద్వారా ప్రతిపక్షనాయకులను కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తే.. రాజ్యాంగం వారిని తప్పక కాపాడుతుంది. ఇది బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కన్న కల. రాజ్యాంగ శక్తితోనే సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా బయటకు వస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సిసోడియా పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. 

రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఈ తీర్పుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా లిక్కర్‌ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 ఆయన్ను అరెస్ట్‌ చేసింది.  ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. .దాదాపు 17 నెలల జైలు శిక్ష అనంతరం నేడు బెయిల్‌పై విడుదలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement