న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష, విచారణలో జాప్యాన్ని కీలక కారణాలుగా చూపుతూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న నాయర్.. 23 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అండర్ ట్రయల్‌గా అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని, విచారణ శిక్షగా మారకూడదని సుప్రీం న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయిందని, దాదాపు 350 మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
‘30 అక్టోబర్ 2023న 6 నుంచి 8 నెలల్లో విచారణ ముగిస్తామని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే విచారణ ఇంకా ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది.ఈ కేసులో దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు 350 మంది సాక్షులను విచారించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.
ఈ కేసులో పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ ప్రారంభించకుండా అతనిని అండర్ ట్రయల్‌గా నిర్బంధించడం శిక్షా విధానం కాదు. పిటిషనర్‌ను విచారణ ప్రారంభించకుండానే జైలులో ఉంచితే బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సార్వత్రిక నియమం ఓడిపోతుంది.
ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు అనేది ఒక పవిత్రమైన హక్కు. ఇది పీఎంఎల్‌ఏ వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీ కేసులో విజయ్ నాయర్ నిందితుడిగా ఉన్నారు. నవంబర్ 2022లో సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కానీ ఈడీ కేసులో గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment