భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు  | Indian Families Are Impacting Law and Society says Justice Nagarathna | Sakshi

భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు 

Apr 14 2025 5:20 AM | Updated on Apr 14 2025 5:20 AM

Indian Families Are Impacting Law and Society says Justice Nagarathna

పెరుగుతున్న విడాకుల సంస్కృతి 

చిన్న కారణాలకూ కోర్టు కేసులు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న ఆవేదన

అమ్మాయిల వల్లేననడం సరికాదు

సమాజం తీరు మారాలని హితవు

బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ సమాచారాన్ని ఉటంకించారు. 

సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్‌పర్సన్‌ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 

40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం 
కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్‌ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.

ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement