దర్యాప్తును సాగదీస్తూ నిందితుడిని ఎంతోకాలం
జైల్లో ఉంచలేమన్న సుప్రీం
శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదల
17 నెలలుగా జైలులో విచారణ ఖైదీగా గడిపిన మాజీ ఉప ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది.
సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.
వైకుంఠపాళి ఆడించారు..
‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్‌షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు.
సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు.
స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.
‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది.
తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీ
డిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.
అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియా
తీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు.
శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.
ఆప్ హర్షం
సిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment