ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన
నిజాయితీపరుడినని ప్రజలు తీరి్పచ్చాకే గద్దెనెక్కుతా
నవంబర్‌లో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు విజ్ఞప్తి
సీఎం పగ్గాలు భార్య సునీతకా? లేక ఆప్ నేతకా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు. తాను నిజాయతీపరున్ని అని ప్రజలు తీర్పు ఇచ్చేదాకా సీఎం సీట్లో కూర్చోబోనని ప్రతిజ్ఞ చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలవడం తెలిసిందే. ఆదివారం భార్య సునీతతో కలిసి ఆయన ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లో ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎంంను ఎంపిక చేస్తానని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంకా ఏమన్నారంటే...
నేరస్తుడినని భావిస్తే నాకు ఓటేయకండి
‘‘దేశ ప్రజలను, ఢిల్లీవాసులను అడగాలనుకుంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడా? లేక నేరస్తుడా? ప్రజలే తీర్పు చెప్పాలి. కొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ప్రతి గల్లీకి, ప్రతి గడపకూ వెళ్తాను. నిజాయితీపరుడని అనుకుంటే నాకు ఓటేయండి. నేరస్తుడినని భావిస్తే వేయకండి. మీరు వేసే ప్రతి ఓటూ నా నిజాయతీకి సర్టిఫికెట్. ఆప్‌కు ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా మీరు నన్ను గెలిపించినప్పుడే నేను ముఖ్యమంత్రి పీఠంపై, మనీశ్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాం. మా ఇద్దరి విషయంలో నిర్ణయాధికారం ఇక మీ చేతుల్లోనే ఉంది. ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని మహారాష్ట్రతో పాటు వచ్చే నవంబర్‌లోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా.
సీతలా నాకు అగి్నపరీక్ష
‘‘14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి అగి్నపరీక్ష ఎదుర్కోవాల్సి వచి్చంది. జైలు నుంచి వచ్చాక నేను కూడా అగి్నపరీక్షకు సిద్ధంగా ఉన్నాను. కేజ్రీవాల్ చోర్, అవినీతిపరుడు, భరతమాతకు ద్రోహం చేశాడంటూ నిందలేస్తున్నారు. నేను ‘డబ్బుతో అధికారం, అధికారంతో డబ్బు’ అనే ఆటాడేందుకు రాలేదు. దేశానికి మంచి చేద్దామని వచ్చా. ఆప్‌ను విచి్ఛన్నం చేసేందుకే నన్ను జైలుకు పంపించారు.
ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం, సీబీఐ, ఈడీలతో భయపెట్టడం, తప్పుడు కేసులు, జైళ్లకు పంపడం, ప్రభుత్వాలను పడగొట్టడం, చివరికి సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం.. ఇలా ఒక ఫార్మూలా రూపొందించుకున్నారు. నన్ను జైలుకు పంపితే ఢిల్లీలో ఆప్ విచ్ఛిన్నమై ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వస్తుందని అనుకున్నారు. కానీ మా పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విచ్ఛిన్నం కాలేదు. కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం ఆప్‌కు ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జైలులో ఉండగా పీఎం పదవికి రాజీనామా చేయలేదు’’.
భార్యను సీఎం చేయడానికే డ్రామాలు: బీజేపీ
భార్య సునీతను సీఎం చేయడానికి కేజ్రీవాల్ నాటకాలాడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘‘సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా రాజకీయంగా లబ్ధి కోసమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలా డ్రామాకు తెర తీశారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రాజీనామా చేస్తా అనటమంటే మద్యం కుంభకోణంలో నేరాన్ని ఒప్పుకున్నట్లేనని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ఆప్‌లో అంతర్గత ఘర్షణలను తట్టుకోలేకే రాజీనామా ప్రకటన చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఆప్ కొత్త సీఎం ఎవరు?
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చ ప్రారంభమైంది. రేసులో కేజ్రీవాల్ భార్య సునీత, మంత్రులు అతిశీ, గోపాల్ రాయ్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఆప్ వర్గాలు అధికారికంగా స్పందించకున్నా సునీతకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ నాయకుడొకరు చెప్పారు. కేజ్రీవాల్ మాదిరిగానే ఐఆర్‌ఎస్ అధికారిగా చేసిన ఆమెకు ప్రభుత్వాన్ని నడిపే విధానం క్షుణ్ణంగా తెలుసన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో దళితులు, ముస్లింల ప్రాబల్యంగా అధికం గనుక ఆ వర్గాల నుంచి సీఎంను ఎంచుకున్నా ఆశ్చర్యం లేదు’’ అని పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment