న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల అనంతరం ఆగష్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ఇంత కాలం తాను జైలులో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు.
విచారణను పొడిగించాలనే ఉద్ధేశ్యంతోనే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా అరెస్టు చేయడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని భావించాను.
సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వారికి రెడ్ కార్పెడ్ పరిచి స్వాగతం లభిస్తుందని ఎప్పుడూ ఆశించకూడదు. అదే విధంగా నేను కూడా మానసికంగా సిద్ధమయ్యాను. కానీ మరీ 17 నెలల పాటు మద్యం పాలసీ కేసులో జైలులో నేను ఎప్పుడూ అనుకోలేదు
ఆరోపణలు కల్పితమే..
పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులను ఆపడానికి ఉద్దేశించిందిది. ఈ చట్టం ప్రకారం బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను జైలులో ఉండటం నాకు, నా కుంటుబానికి ఇబ్బందిగా ఉండేది. . అయితే నేను కృంగిపోకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.
జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు, సెల్‌లో ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ సంభాషణకు అవకాశం ఉండదు. అందుకే నాతో నేను స్నేహం చేయడం అలవాటు చేసుకున్నాను.’ అని తెలిపారు.
మళ్లీ డిప్యూటీ సీఎంగా..
కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సిసోడియా స్పందిస్తూ.. ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు.
‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తిరిగి వస్తాడు. ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్‌లో ఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది. ’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment