తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు కోర్టుకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ ష్యూరిటీ పత్రాలు సమర్పించిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి నుంచి నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇటీవల తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో తమిళనాడుకు చెందిన వందలాది మంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు పట్టుబడ్డారు. మరికొంత మంది చిన్న చిన్న నేరాలకు పాల్పడి అరెస్టయ్యారు. వారిని బెయిల్‌పై బయటకు తీసుకు వచ్చేందుకు చంద్రగిరి మండలానికి చెందిన ఇద్దరు యువకులు రంగంలోకి దిగారు. తిరుపతిలోని కోర్టు భవనాల సముదాయం వద్ద వీరు నిందితుల బంధువులతో పెద్దమొత్తం డబ్బుకు ఒప్పందం కుదుర్చుకునేవారు.
ఆ మేరకు బెయిల్‌కు కావాల్సిన ష్యూరిటీ పత్రాలు, అందుకు అవసరమైన తహశీల్దార్, ఎంపీడీవోల సంతకాలు, గ్రామరెవెన్యూ అధికారుల సంతకాలను వీరే ఫోర్జరీ చేసేవారు. తాము తయారు చేయించిన రబ్బర్ స్టాంపులతో అధికారుల సీల్ వేసి కోర్టులకు సమర్పించేవారు. ఈ వ్యవహారం ఆరు నెలలుగా సాగుతోంది. ఇటీవల చంద్రగిరి మండలం నుంచే ఎక్కువ బెయిల్ పిటిషన్లు దాఖలు కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అనుమానం వచ్చింది.
వీటిపై విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతమందికి బెయిల్ ఇచ్చారనే సమాచారం రాబట్టడం కోసం నిందితులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. వీరు సమర్పించిన ష్యూరిటీల్లోని సంతకాలకు సంబంధించి చంద్రగిరి, తొండవాడ వీఅర్‌వోలను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలిసింది. బెయిల్ పిటిషన్లలో ఉన్న సంతకాలు తమవి కావని చెప్పినట్లు సమాచారం.
ఫోర్జరీ సంతకాలతో బెయిల్!
Published Mon, Jan 13 2014 3:53 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement