
సొంత ఇంటికే కన్నమేసినట్లు.. తాను పని చేసే చోట దారుణమైన మోసానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. కాస్త ఆలస్యంగానైనా పాపం పండడంతో కేసు నమోదు అయ్యింది. ఈలోపు హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం బురిడీ కొట్టించిన అతని మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముంబై: ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కేసులో నిందితుడు ఏకంగా జడ్జి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఆ ఫేక్ కోర్టు ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మీద ఎంచక్కా బయటకు వచ్చాడు. చివరకు.. ఆ మోసం బయటపడేలోపు పరారయ్యాడు. ఆ మాయగాడి వ్యవహారంపై బాంబే హైకోర్టు(Bombay High Court) భగ్గుమంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
పుణేకి చెందిన సీటీఆర్ మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిజైన్లను చెన్నైకు చెందిన ఓ కంపెనీ ఉపయోగించడంపై 2022లో ఫిర్యాదు దాఖలైంది. దర్యాప్తులో సీటీఆర్‌లో పని చేసే ఉద్యోగులే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. సీటీఆర్ ఉద్యోగులు.. మాజీ ఉద్యోగులు కొందరి మీద విమంతల్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 2016-2017 పని చేసిన హరిబావు చెంటే కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. అతనిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన అభియోగాలున్నాయి.
అయితే.. ముందస్తు బెయిల్ కోసం హరిబావు పుణే జిల్లా కోర్టును ఆశ్రయించగా.. అతనికి చుక్కెదురైంది. దీంతో బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో పుణే కోర్టు జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కోర్టు ఆదేశాలను సృష్టించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 169 ప్రకారం.. నిందితుడి మీద అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకుంటే న్యాయ విచారణ లేకుండా విడుదల చేయొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని పుణేకు చెందిన ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతకాన్ని చెంటే ఫోర్జరీ చేశాడు. ఆ నకిలీ ఆదేశాలకు హైకోర్టుకు సమర్పించి.. ఈ ఏడాది జనవరి 17వ తేదీన బెయిల్ పొందాడు. అయితే..
ఈ వ్యవహారంపై అనుమానంతో సీటీఆర్ కంపెనీ విమంతల్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని ఇటు పుణే కోర్టు.. అటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హరిబావు సమర్పించిన కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా ఉండడంతో హైకోర్టు పరిశీలన జరిపింది. జడ్జి సంతకం ఫోర్జరీ, నకిలీ ఆదేశాలు బెయిల్ పొందినట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా భావించింది. అతని బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అతనిపై మరో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హరిబావు చెంటే కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.