రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..
జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?
మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.
కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..
రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్‌డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి.
కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్‌ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్‌డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్‌ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు.
మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పు
మరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు.
సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్‌డేషన్‌కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్‌డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..
ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్‌నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.
ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment